రాజాసాబ్ పై ముందు నుంచీ ఎందుకో సరైన అంచనాలు లేవు. మారుతి ఇప్పటి వరకూ స్టార్ హీరోల్ని హ్యాండిల్ చేయలేదు. పైగా దాదాపు మూడేళ్ల నుంచి ఈ సినిమా సెట్స్‌పైనే ఉంది. పైగా హారర్ కామెడీ సబ్జెక్టు. వరల్డ్ బిల్డింగు సినిమాలు చూడ్డం అలవాటు అయిపోయిన సినీ ప్రేక్షకులకు ఈ జోనర్ ఎందుకో ఆనలేదు. దాంతో.. పెద్దగా ఎట్రాక్ట్ అవ్వలేదు. దానికి తోడు పాటలు ఇంపాక్ట్ ఇవ్వలేదు. టీజర్, ట్రైలర్ ఓకే అనిపించాయి. దాన్ని కూడా కొంతమంది ట్రోల్ చేశారు. విడుదలకు మరో పది రోజుల టైమ్ ఉంది. ఈలోగా ‘రాజాసాబ్’ నుంచి రెండో ట్రైలర్ వచ్చింది. ఈ ట్రైలర్ మాత్రం అందరికీ షాక్ ఇచ్చింది. మారుతి చూపించిన విజువల్స్, ఆ వరల్డ్ బిల్డింగ్, మేకింగ్ వాల్యూస్ అన్నీ రిచ్ గా అనిపించాయి. ప్రభాస్ క్యారెక్టర్ లో వేరియేషన్స్ కనిపించాయి. చివర్లో జోకర్ గెటప్పులో ప్రభాస్ కనిపించడం ఇంకా పెద్ద సర్ప్రైజింగ్ గా అనిపించింది.
సినిమా కథేంటో చూచాయిగా చెబుతూనే, స్టార్ డమ్ చూపిస్తూనే, తనదైన విజువల్ వండర్ని క్రియేట్ చేసేందుకు ప్రయత్నించాడు మారుతి. ఈ ట్రైలర్‌కి యునానిమస్‌గా మంచి మార్కులు పడిపోయాయి. నిజానికి పెద్ద సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ ఏదొచ్చినా.. అందులో లోపాల్ని వెదికి, ట్రోల్ చేయడానికి ఓ వర్గం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. కానీ ఈసారి మారుతి వాళ్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఇప్పటి వరకూ ఈ సినిమాపై నెగిటివిటీ ఏమైనా ఉంటే.. అదంతా ఒక్క ట్రైలర్ తో మాయం అయిపోయింది. హిందీ మార్కెట్ ని దృష్టిలో ఉంచుకొని కట్ చేసిన ట్రైలర్ ఇది. అక్కడి జనాలకు ఈ ట్రైలర్ బాగా నచ్చింది. ఈ ట్రైలర్ లో ప్రభాస్ కనిపించిన విధానం, వీఎఫ్ఎక్స్ని వాడుకొన్న పద్ధతి ఇవన్నీ ప్రభాస్ అభిమానులకు సంతృప్తి ఇచ్చింది. సంక్రాంతి సినిమాల్లో రాజాసాబ్ నుంచి గట్టి పోటీ ఉండబోతోందన్న విషయం మిగిలిన సినిమాలకు ఈ ట్రైలర్ తో అర్థమై ఉంటుంది. సో… మిగిలిన సినిమాలు కంటెంట్ ని వదిలేటప్పుడు రాజాసాబ్ ని బెంచ్ మార్క్ గా పెట్టుకోవాల్సిందే.
