ఈ సంక్రాంతి బరిలో నిలిచిన ‘రాజాసాబ్’ అసంతృప్తి మిగిల్చింది. ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకొన్న దర్శకుడు మారుతి ఈ రిజల్ట్ పట్ల నిరాశతో ఉన్నారు. అయితే.. వచ్చే సంక్రాంతికి ఓ సినిమాని బరిలో దించాలన్న ప్రయత్నాలు ఇప్పటి నుంచే మొదలెట్టినట్టు ఇన్ సైడ్ వర్గాల టాక్. సంక్రాంతి నేపథ్యంలో మారుతి ఓ కథ రెడీ చేసుకొన్నారని, ఓ యువ హీరోతో ఆ సినిమా పట్టాలెక్కిస్తారన్న వార్తలు వినవస్తున్నాయి. మెగా కుటుంబంలోని ఓ హీరో తో మారుతి సినిమా ఉంటుందని రెండ్రోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అయితే ఆ వార్తల్లో నిజం లేదని మారుతి పీ.ఆర్ టీమ్ స్పష్టం చేసింది. మారుతి సినిమా మెగా హీరోతో కాకపోవొచ్చు. కానీ ఓ యువ హీరోతో మాత్రం తథ్యం.
‘రాజాసాబ్’ రిజల్ట్ చూసి పెద్ద హీరోలు మారుతికి సినిమా ఇచ్చే ధైర్యం చేయకపోవొచ్చు. కానీ యంగ్ హీరోలకు అలాంటి భయాలు ఉండవు. యంగ్ హీరోలతో మారుతి జట్టు కట్టినప్పుడల్లా హిట్టు కొట్టాడు. ‘భలే భలే మగాడివోయ్’, ‘మహానుభావుడు’, ‘ప్రతీరోజూ పండగే’ ఈ సినిమాలన్నీ మారుతి యంగ్ హీరోలతో తీసినవే. వాళ్లతో మినిమం గ్యారెంటీ సినిమా ఇవ్వగలడు మారుతి. పైగా సంక్రాంతి సీజన్‌కు వస్తే మరింత ప్లస్ అవుతుంది. కాబట్టి మారుతి కూడా అదే ఆలోచనలతో ఉన్నట్టు టాక్. మార్చి లేదా ఏప్రిల్ లో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. సంక్రాంతికి విడుదల చేస్తారు. హీరో ఎవరన్నది ఈలోగా తెలిసిపోతుంది.
