‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాలతో తన మార్క్ ఏమిటో చాటుకొన్న దర్శకుడు తరుణ్ భాస్కర్. బడా హీరోలతో సినిమాలు చేసే కెపాసిటీ తరుణ్‌కి ఉంది. అయితే.. ఇప్పటి వరకూ పెద్ద హీరోని డీల్ చేయలేదు. వెంకటేష్ తో ఓ సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. దానికోసం దాదాపు మూడేళ్లు కష్టపడ్డాడు. స్క్రిప్ట్ వర్క్ చేశాడు. కానీ అదెందుకో.. సెట్స్‌పైకి వెళ్లలేదు. వెంకీతో తరుణ్ భాస్కర్ సినిమా లేనట్టే అని అంతా ఫిక్సయ్యారు. కానీ ఇప్పుడు ఆ ఈప్రాజెక్ట్ పై మళ్లీ ఆశలు రేగుతున్నాయి. వెంకీతో సినిమాకి ఇదే రైట్ టైమ్ అంటున్నాడు తరుణ్ భాస్కర్.
‘అప్పట్లో సెకండాఫ్ నాకే నచ్చలేదు. ఆ స్క్రిప్టు చాలాసార్లు తిరగరాశా. వెంకటేష్, సురేష్ బాబు గార్లకు ఓ వెర్షన్ నచ్చింది. అయితే నాకే ఇంకా బాగా చేయొచ్చు అనిపించింది. నాకు సంతృప్తి కరంగా వచ్చేంత వరకూ రాస్తూనే ఉండాలి అనుకొన్నా. ఇప్పుడు ఆ స్క్రిప్టు కు సరైన సమయం వచ్చింది. 2026లోనే పట్టాలెక్కించే అవకాశం ఉంది`” అని చెప్పుకొచ్చాడు తరుణ్. హార్స్ రైడింగ్ నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఈ బ్యాక్ డ్రాప్ లో ఇంత వరకూ సినిమా రాలేదు. కాబట్టి కొత్తగా ఉండే ఛాన్స్ వుంది. తరుణ్ కూడా పెద్ద హీరోలతో సినిమాలు చేయాలని భావిస్తున్నాడు. ప్రస్తుతం ‘ఈ నగరానికి ఏమైంది 2’ సినిమాని పట్టాలెక్కించాడు. ఈ నెల నుంచే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఆ తరవాత.. తప్పకుండా వెంకీ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. సురేష్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని రూపొందించనుంది.
