తెలంగాణ సీపీఎం మాజీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంపై కేంద్ర కమిటీ తీవ్రస్థాయిలో క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడమే కాకుండా, తన వ్యక్తిగత ఆకాంక్షల కోసం పార్టీ ప్రాథమిక సూత్రాలను గాలికి వదిలేశారని రుజువు కావడంతో ఆయన్ను అభిశంసించింది . ముఖ్యంగా 2024లో కొత్త రాష్ట్ర కార్యదర్శి ఎన్నిక సందర్భంగా ఆయన అనుసరించిన వైఖరి పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసిందని కేంద్ర కమిటీ 4 పేజీల సుదీర్ఘ లేఖలో తప్పుబట్టింది.
తమ్మినేని వీరభద్రం తన వ్యక్తిగత ప్రాబల్యాన్ని కాపాడుకోవడానికి , తనకు అనుకూలమైన వారిని పదవుల్లో కూర్చోబెట్టుకోవడానికి ముఠా తత్వాన్ని ప్రోత్సహించారని పార్టీ గుర్తించింది. సాధారణంగా కమ్యూనిస్టు పార్టీల్లో నిర్ణయాలు ఏకాభిప్రాయంతో జరుగుతాయి, కానీ వీరభద్రం హయాంలో లాబీయింగ్, తెరవెనుక మంత్రాంగం, ప్రలోభాలు వంటిి చోటుచేసుకోవడం కేంద్ర కమిటీని విస్మయానికి గురిచేసింది. పొలిట్ బ్యూరో సభ్యులు ఐక్యత కోసం పదేపదే విజ్ఞప్తి చేసినా, తమ్మినేని నేతృత్వంలోని ఒక వర్గం మొండిగా వ్యవహరించడం వల్ల పార్టీ నిట్టనిలువునా చీలిపోయే పరిస్థితి వచ్చిందని ఆక్షేపించింది.
రాష్ట్ర కార్యదర్శిగా అందరినీ సమన్వయం చేయాల్సిన బాధ్యత కలిగిన తమ్మినేని, సమిష్టి నిర్ణయాలకు బదులు ఏకపక్ష వైఖరిని అవలంబించారని పార్టీ తేల్చింది. పార్టీ రాజ్యాంగానికి విరుద్ధంగా గిల్డ్ పాలిటిక్స్ నడపడం, క్రమశిక్షణను ఉల్లంఘించడం వంటి అంశాలపై కేంద్ర కమిటీ వివరణ కోరగా.. ఆయన ఇచ్చిన సమాధానంలో ధిక్కారం ఉండటంతో సీనియర్ నాయకుడై ఉండి పార్టీ రాజకీయ సంస్కృతికి విరుద్ధంగా ప్రవర్తించడం క్షమించరాని నేరంగా భావించిన పొలిట్ బ్యూరో, ఆయనపై దర్యాప్తుకు ద్విసభ్య కమిషన్ను కూడా నియమించింది. ఇకపై ఆయన రాష్ట్ర సెక్రటేరియట్ సమావేశాల్లో కేవలం ఒక పరిశీలకుడి గా మాత్రమే ఉండాలని, సొంతంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదని కేంద్ర కమిటీ గట్టి ఆంక్షలు విధించింది.
అయితే ఇప్పటికే తెలంగాణలో సీపీఎం అంతరించి పోయింది. ఆయన సొంత పార్టీ ప్రయోజనాల కోసం కాకుండా.. బీఆర్ఎస్ ప్రయోజనాల కోసం ఎక్కువగా నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గత ఎన్నికల్లో సీపీఐ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నా…. ఉద్దేశపూర్వకంగానే సీపీఎం పొత్తు పెట్టుకోకుండా చేసి ఓట్లు చీల్చి బీఆర్ఎస్ కు మేలు చేయాలనుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. 2019లోనూ కూటమిలోనూ గందరగోళానికి ఆయన కారణమయ్యారు. అయితే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా ఆయనను ఇప్పుడు అభిశంసించి .. ప్రయోజనం ఏమీ ఉండదు.
