వైసీపీ నాయకులు అంటే ఇతరుల్ని ఉపయోగిచుకుని వారిని బలి చేసేవారని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మరోసారి నిరూపించారు. ఆయనను అరెస్టు చేయబోతున్నారని తనకు సమాచారం ఇచ్చి , తాను పారిపోయేలా చేసిన వారినే కాదు.. ఎక్కడ ఉన్నారో తెలిసినా తెలియనట్లుగా వ్యవహరిస్తున్న పోలీసు అధికారులు నిండా మునిగిపోయేలా చేశారు. ఆయన తీరుతో ఆయనకు సహకరించిన పోలీసులు ఇప్పుడు క్రమశిక్షణాలు చర్యలు ఎదుర్కోవాల్సిన వస్తోంది.
జగన్ ఇటీవల రాప్తాడులో శవ రాజకీయ యాత్ర చేశారు. ఈ సందర్భంగా హెలికాఫ్టర్ స్కిట్ ను పార్టీ కార్యకర్తలతో వేయించారు. ఇందులో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిది కీలక పాత్ర. హెలికాఫ్టర్ ను చుట్టముట్టాలని.. రభస చేయాలని… పోలీసులపై నిందలు వేయాలన్న ప్లాన్ వేశారు. అంతా స్క్రిప్ట్ ప్రకారం చేశారు. కానీ ఆయన చేసిన ఓవరాక్షన్ కారణంగా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో అరెస్టు చేసేందుకు ఆయనను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
తోపుదుర్తి ఇంటికి వెళ్లిన పోలీసులకు ఆయన కనిపించలేదు. దాంతో పరారీలో ఉన్నారని చెప్పి లైట్ తీసుకున్నారు. కానీ తోపుదుర్తి హైదరాబాద్ లో రీల్స్ చేస్తూ కనిపించారు. బహిరంగంగా తిరుగుతూ వీడియోలు రిలీజ్ చేసుకున్నారు. దీంతో ఆయనకు సహకరించిన పోలీసులపై అందరి దృష్టి పడింది. స్వయంగా డీజీపీ కార్యాలయం తోపుదుర్తి గురించి ఆరా తీసి.. సహకరించిన పోలీసులకు చర్యలకు సిద్ధమయింది. ఇప్పుడు తోపుదుర్తి నిజంగా పారిపోవాల్సిన పరిస్థితి రావడంతో ఆయనకు సహకరించిన పోలీసులకూ డిపార్టుమెంట్లో చెడ్డపేరు తెచ్చారు.