రాజకీయాల్లోకి ప్రవేశించిన ఏ నాయకుడికైనా ప్రైవసీ అనేది ఒక విలాసం మాత్రమే. పబ్లిక్ లైఫ్‌లోకి అడుగుపెట్టిన క్షణం నుంచే ఆ నాయకుడి ప్రతి అడుగు, ప్రతి సంబంధం జనం దృష్టిలో ఉంటుంది. ప్రస్తుతం తమిళనాడులో నటుడు విజయ్ సరిగ్గా ఇటువంటి క్లిష్ట పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. తన భార్య సంగీత విడాకుల కోసం కోర్టుకెక్కడం, అందులో సంచలనాత్మక ఆరోపణలు చేయడంతో.. విజయ్ తన రాజకీయ జీవితాన్ని ఒక పెద్ద ఆటంకంలోకి నెట్టుకున్నారు.
ముందే క్లియర్ చేసుకోవాల్సిన చిక్కుముళ్లు
రాజకీయ రంగప్రవేశం అనేది ఒక ప్రణాళికాబద్ధంగా చేయాల్సిన పని. విజయ్ తన పార్టీని ప్రకటించే ముందే తన కుటుంబంలో ఉన్న విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకుని ఉండాల్సింది. రాజకీయ ప్రత్యర్థులు ఎప్పుడూ ఒక నాయకుడి బలహీనతల కోసం వేచి చూస్తుంటారు. ఇప్పుడు విడాకుల పిటిషన్లో వచ్చిన ఆరోపణలు, ముఖ్యంగా ఒక ప్రముఖ హీరోయిన్‌తో ముడిపెడుతూ వస్తున్న వార్తలు విజయ్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. పబ్లిక్ లైఫ్ లోకి వచ్చే ముందే ఇవన్నీ క్లియర్ చేసుకోకపోవడం ఆయన వ్యూహాత్మక లోపంగా మారుతోంది.
విధానాల కంటే వ్యక్తిత్వమే అజెండా అయితే ప్రమాదం
విజయ్ తన పార్టీ టీవీకే ద్వారా అవినీతి రహిత పాలన, సామాజిక న్యాయం వంటి గొప్ప ఆదర్శాలను ప్రచారంలోకి తెచ్చారు. అయితే, ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో ఆయన చెప్పే విధానాల కంటే, ఆయన వ్యక్తిగత జీవితంపైనే చర్చ జరుగుతోంది. జనం ఒక నాయకుడి నుంచి నైతికతను, స్థిరత్వాన్ని ఆశిస్తారు. కుటుంబ సమస్యలు రోడ్డున పడటంతో, ప్రత్యర్థులు దీన్ని విజయ్ నైతికత కు ముడిపెడుతూ ప్రచారం చేసే అవకాశం ఉంది. ఇది ఓటర్లలో, ముఖ్యంగా మహిళా ఓటర్లలో ఆయన ఇమేజ్ను దెబ్బతీసే ప్రమాదం ఉంది. తమిళనాడులో రాజకీయ యుద్ధం చాలా పకడ్బందీగా ఉంటుంది. డీఎంకే వంటి పార్టీలు విజయ్ ఎదుగుదలను ఏమాత్రం ఇష్టపడవు. ఈ విడాకుల అంశాన్ని వారు ఒక రాజకీయ అస్త్రంగా మలచుకుని, విజయ్ వ్యక్తిత్వాన్ని డీగ్రేడ్ చేయడానికి ప్రయత్నిస్తాయి. విజయ్ తన పార్టీ సిద్ధాంతాలను వివరించాల్సిన వేదికలపై, ఇప్పుడు తన వ్యక్తిగత ఆరోపణలకు సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ఆయన పొలిటికల్ అజెండాను పక్కదారి పట్టించే కుట్రలో భాగమని కొందరు అంటున్నా, దానికి అవకాశం ఇచ్చింది మాత్రం విజయ్ స్వయంగా చేసిన తప్పిదమే.
విజయ్ భార్యపై ఇప్పుడు ఆరోపణలు చేసి ఏం ప్రయోజనం?
విడాకుల పిటిషన్లో విజయ్ భార్య భారీగా ఆస్తులు, భరణం కోరుతున్నారని విజయ్ పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. నిజానికి ఆమె ఎంత అడిగినా అంత ఇచ్చి సెటిల్ చేసుకోవాల్సింది విజయ్యే. ఇప్పుడు విజయ్ ముందున్న ఏకైక మార్గం ఈ వివాదాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పరిష్కరించుకోవడం. కోర్టు రచ్చను ఆపి, గౌరవప్రదంగా బయటపడకపోతే.. రాబోయే ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రతి సభలోనూ ఈ ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుంది. విజయ్ తన చుట్టూ ఉన్న ఈ రాజకీయ, వ్యక్తిగత గందరగోళం నుంచి ఎలా బయటపడతారనే దానిపైనే 2026 ఎన్నికల్లో ఆయన పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.
