పదకొండు మంది మరణానికి కారణమయ్యారు, ముఫ్ఫై మందికి పైగా గాయపడ్డారు, బస్సులో రెండో డ్రైవర్ లేడు, నియమనిబంధనల ఉల్లంఘనలు ఘనంగానే జరిగాయి…..అయితేనేం అధికారం అండగా నిలిచింది. జెసిల వైపు కన్నెత్తి చూసే సాహసం కూడా అధికారులెవ్వరికీ లేకుండా చేసింది. పోస్ట్ మార్టం వ్యవహారం నుంచీ అన్ని కూడా బాధితులకు వ్యతిరేకంగా…జెసిలకు అనుకూలంగా జరిగాయి. లేని రెండో డ్రైవర్ కూడా భువనేశ్వర్ నుంచి బస్సు డిక్కీలో వందలాది కిలోమీటర్లు ప్రయాణించిన అద్భుతం సాక్షాత్కరించింది. ఇంజినీర్లందరూ కూడా అది అసాధ్యం అని చెప్తేనేమీ….చంద్రబాబు ప్రభుత్వానికి ఆ కథే కరెక్ట్ అనిపించింది. జెసిలకు అలాంటి కథలు ఎన్నో వినిపించే అవకాశం దొరికింది. ఇప్పుడు కూడా అలాంటి కథలే చెప్తూ ఉన్నాడు జెసి దివాకర్‌రెడ్డి. బస్సు స్పీడ్ డెభ్భైలలో మాత్రమే ఉంది. ఫుల్ కండిషన్లో ఉంది. డ్రైవర్ మందు తాగలేదు. కొన్ని క్షణాల పాటు కునుకుపట్టినట్టుగా ఉంది. అందుకే ప్రమాదం జరిగింది. అయినా ప్రమాదాలు చెప్పి వస్తాయా? అని రాగం తీస్తున్నాడు జెసీ. ప్రయాణికుల మృతదేహాలన్నీ మాంసం ముద్దలుగా మారిపోయాయని, గుర్తుపట్టని విధంగా ఉన్నాయని…అందుకే పోస్ట్ మార్టం చేయడం సాధ్యం కాలేదన్న కొత్త నిజాన్ని చెప్పుకొచ్చాడు జెసీ. సాధారణంగా ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఇలాంటి కథలు వినిపిస్తూ ఉంటారు. మరి బస్సు ప్రమాదంలో చనిపోయినవారి శరీరాలు మాంసం ముద్దలుగా ఎలా మారాయో…..అలా జరిగితే పోస్ట్ మార్టం ఎందుకు సాధ్యం కాదో జెసీ వారే చెప్పాలి.
ఇక తన తప్పును సమర్థించుకోవడంతోనే ఆగిపోతే జెసి ఎందుకు అవుతాడు. అందుకే అదే మీడియాతో జగన్ గురించి చాలానే మాట్లాడేశాాడు జెసి. జగన్ జన్మలో ముఖ్యమంత్రి కాలేడని చంద్రబాబును ఖుషీ చేసే విమర్శలు స్టార్ట్ చేశాడు జెసీ. వైఎస్ కలెక్టర్ కాలర్ పట్టుకున్నాడని కొత్త విషయం చెప్పాడు. ప్రతిపక్షనేతగా కూడా పనికిరాడన్నారు. తండ్రి చనిపోతే చూడడానికి వచ్చిన ఎమ్మెల్యేల నుంచి సంతకాలు తీసుకుని సిఎం అయిపోవాలని జగన్ ప్లాన్ చేసుకున్నాడన్నాడు. వైఎస్ జగన్ రాక్షసత్వం గురించి చాలానే చెప్పుకొచ్చాడు జెసీ. అదే టైంలో తన గొప్పతనం గురించి కూడా చెప్పుకున్నాడు. టిడిపి తరపున పోటీ చేసిన జెసి దీపక్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని…….ఈ విషయంలో ఎవ్వరినీ బెదిరించడం గానీ, డబ్బు ఎరచూపడం గానీ అస్సలు చేయలేదన్నారు. స్వతంత్ర అభ్యర్థులకు పట్టుమని పది ఓట్లు లేవని…అందుకే వైదొలిగారన్నారు. మొత్తం తొమ్మిది ఎమ్మెల్సీలనూ టిడిపినే గెలుచుకుంటుందని చెప్పుకొచ్చారు. ఇక చంద్రబాబు సూపర్, బంపర్ అని చెప్పి జెసి చేసిన భజన గురించి అయితే ఎంత చెప్పుకున్నా తక్కువే. నిద్రపోకుండా పనిచేస్తారని బాబుకు జెసి ఇచ్చిన సర్టిఫికెట్ అయితే అద్భుతం. ఎలా చూసుకున్నా కూడా చంద్రబాబు రుణం తీర్చుకోవడం కోసం జెసీ బాగానే కష్టపడుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇలాంటి రాజకీయ నాయకులను, రాజకీయాలను ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.