సెప్టెంబరుతో బాక్సాఫీసుకు కొత్త కళ వచ్చింది. వరుస విజయాలు చిత్రసీమకు బూస్టప్ ఇచ్చాయి. అక్టోబరులో కూడా శుభారంభం అందింది. ‘కాంతార చాప్టర్ 1’తో థియేటర్లు మళ్లీ కళకళలాడాయి. ఇప్పుడు కీలకమైన దీపావళి సీజన్లోకి అడుగు పెట్టింది చిత్రసీమ. ఈ సీజన్లో పెద్ద సినిమాలు లేకపోయినా.. హంగామా ఏమాత్రం తగ్గడం లేదు. ఏకంగా 4 సినిమాలు ఒకేసారి రిలీజ్‌కి రెడీ అయ్యాయి. 16న ‘మిత్రమండలి’, 17న ‘తెలుసు కదా’, ‘డ్యూడ్’, 18న ‘కెర్యాంప్’ రిలీజ్‌కు రెడీ అయ్యాయి. ఈ నాలుగు సినిమాలపైనా మంచి అంచనాలే ఉన్నాయి.
బన్నీ వాస్ నిర్మాతగా రూపొందించిన ‘మిత్రమండలి’… ఓ క్లీన్ ఎంటర్టైనర్ గా రాబోతోంది. ప్రియదర్శి వరుస విజయాలతో ఫామ్ లో ఉన్నాడు. టీజర్, ట్రైలర్ నవ్వించాయి. ఇదే కామెడీ థియేటర్లలో కూడా పండితే… కచ్చితంగా సినిమా హిట్టే. 15న ఈ చిత్రానికి ప్రీమియర్లు కూడా వేయాలని చిత్రబృందం డిసైడ్ అయ్యింది. అంటే ఒక రోజు ముందే ‘మిత్రమండలి’ థియేటర్లలోకి వచ్చేస్తుందన్నమాట.
17న రెండు సినిమాలున్నాయి. సిద్దు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ అంటూ పలకరించబోతున్నాడు. శ్రీనిధిశెట్టి, రాశీఖన్నా కథానాయికలుగా నటించారు. `మిరాయ్`తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఓ మంచి విజయం అందింది. ఆ జోష్‌తో మరో హిట్టు తమ ఖాతాలో వేసుకోవాలని విశ్వ ప్రసాద్ భావిస్తున్నారు. ‘జాక్’ సినిమా ఫ్లాప్ అవ్వడంతో సిద్దుపై కొంత ఒత్తిడి ఉంది. ఈ సినిమాని హిట్ చేసి, లెక్క సరిచేయాలని భావిస్తున్నాడు. తమన్ అందించిన పాటలు బాగున్నాయి. ట్రైలర్ వస్తే.. ఈ సినిమా కంటెంట్ పై ఓ అభిప్రాయం వస్తుంది.
మైత్రీ మూవీస్ నుంచి 17న `డ్యూడ్` అనే సినిమా వస్తోంది. ప్రదీప్ రంగనాథ్ హీరోగా నటించిన చిత్రమిది. ‘లవ్ టుడే’, ‘డ్రాగన్’ సినిమాలో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకొన్నాడు ప్రదీప్. ఈ సినిమాని కూడా యూత్ ఫుల్ స్టోరీగా తీర్చిదిద్దారు. ట్రైలర్ లో మంచి ఎనర్జీ కనిపించింది. అదే సినిమాలోనూ రిపీట్ అయితే ప్రదీప్ హ్యాట్రిక్ కొట్టడం గ్యారెంటీ.
ఈ దీపావళికి వస్తున్న మరో టపాసు.. ‘కె.ర్యాంప్’. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఈ చిత్రాన్ని హాస్య మూవీస్ రూపొందించింది. టీజర్, ట్రైలర్ చూస్తే ఇది కుర్రాళ్ల సినిమా అని అర్థమైపోతోంది. కిరణ్ బాడీ లాంగ్వేజ్ కూడా డిఫరెంట్ గా వుంది. ఈ దీపావళి కి వస్తున్న మిగిలిన సినిమాలకు కె.ర్యాంప్ గట్టి పోటీ ఇవ్వబోతోందన్న విషయం అర్థం అవుతోంది. ప్రమోషన్లు కూడా బాగానే చేస్తున్నారు. సీజన్ చివర్లో రావడం.. కాస్త కలిసొచ్చే విషయం. పైగా గత దీపావళికి వచ్చిన ‘క’ మంచి విజయం అందుకొంది. ఈ నాలుగు చిత్రాలకూ దీపావళి సెలవలు ఈ నాలుగు చిత్రాలకూ ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఇది వరకు దీపావళిని అన్ సీజన్ గా భావించేది చిత్రసీమ. ఇప్పుడు మాత్రం ఆ బ్యాడ్ సెంటిమెంట్ పోయి.. ఒకేసారి 4 సినిమాలు పోటీ పడుతున్నాయి. వీటిలో రెండు హిట్టయినా థియేటర్లు కళకళలాడడం ఖాయం.