కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాలు రసవత్తర ఘట్టానికి చేరుకున్నాయి. డీకే శివకుమార్ తనకు సీఎం పీఠం అప్పగించాల్సిందేనని పార్టీ హైకమాండ్ కు అల్టిమేటం జారీ చేశారు. ఆయన తన వర్గం ఎమ్మెల్యేలతో ఢిల్లీ వెళ్లారు. తనను పీసీసీ చీఫ్ పోస్ట్ వద్దని ఎవరికి కావాలంటే వారికి ఇచ్చుకోవాలని తనకు మాత్రం సీఎం పోస్టు ఇవ్వాల్సిందేనని ఆయన పట్టుబడుతున్నారు. ఇది ఆయనకు హైకమాండ్ ఇచ్చిన హామీనే. సిద్ధరామయ్య మాత్రం తాను దిగేది లేదంటున్నారు. కానీ ఆయనను దింపాలనుకుంటే .. పెద్ద విషయం కాదు.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం డికే శివకుమార్ రెక్కల కష్టం
బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు డీకే శివకుమార్ తీవ్రంగా పోరాడారు. పీసీసీ చీఫ్ గా ఉండి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తల్ని ఏకతాటిపైకి నడిపించారు. ఎన్నికల్లో గెలుపు తర్వాత హైకమాండ్ ఆయనకు పదవి ఇవ్వలేదు. సిద్ధరామయ్యకే మరోసారి చాన్స్ ఇచ్చింది. ఆ సమయంలో రెండున్నరేళ్ల గడువు పెట్టింది. ఆ తర్వాత మీకే పదవి అని చెప్పింది. శివకుమార్ ఆ తర్వాత లోక్ సభ ఎన్నికలు బాధ్యతలు తీసుకున్నారు. పీసీసీ చీఫ్ గా పార్టీని నడిపిస్తున్నారు. ఇప్పుడు ఒప్పందం ప్రకారం శివకుమార్ కు సీఎం పదవి ఇవ్వడానికి కిందా మీదా పడుతున్నారు. శివకుమార్ ఒత్తిడి తేవాల్సి వస్తోంది.
ఇతర నేతల పేర్లను ప్రచారంలోకి తెస్తున్న కాంగ్రెస్ హైకమాండ్
సిద్ధరామయ్యను మార్చాల్సిన పరిస్థితి వస్తే శివకుమార్ కాదని సామాజిక సమీకరణాలతో ఇతరులకు అవకాశం కల్పిస్తామని వారి పేర్లు ప్రచారంలోకి తెస్తున్నారు. ఇలాంటివి శివకుమార్ కు సహజంగానే ఆగ్రహం తెప్పిస్తాయి. బీజేపీలో సరైన లీడర్ లేడు. సామాజికవర్గాల ప్రకారం చూసినా శివకుమార్ బీజేపీకి సరిగ్గా సరిపోతాడు. ఆయనకు ఎప్పుడో సీఎం పదవి కూడా ఇచ్చేవాళ్లు. కానీ జైలుకెళ్లారు కానీ శివకుమార్ కాంగ్రెస్ ను దాటి వెళ్లాలనుకోలేదు. కానీ ఆయన ఎక్కడ బలపడతారోనని కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచిస్తోంది. సహజంగానే ఇది కాంగ్రెస్ లోని శివకుమార్ సన్నిహితుల్ని ఆవేదనకు గురి చేస్తోంది. మరో దారి చూసుకోవాల్సిన అవసరం కల్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిర్ణయం రాహుల్ చేతుల్లోనే !
కాంగ్రెస్ పార్టీలో ఏదైనా పవర్ ఉందంటే అది రాహుల్ చేతుల్లోనే. రాహుల్ గాంధీ ఇప్పుడు శివకుమార్ కు సీఎం పదవి అప్పగిస్తారా లేదా అన్నదానిపైనే కాంగ్రెస్ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. ఇలాంటి రాజకీయాల్ని కలగాపులగం చేసుకుంటే.. కాంగ్రెస్ పార్టీ చీలికలు, పేలికలు అవుతుంది. కానీ అలాగే చేసుకోవడంలో కాంగ్రెస్ హైకమాండ్ కు తిరుగులేని రికార్డు ఉంది. అందుకే.. శివకుమార్ విషయంలో రాహుల్ ఏం చేయబోతున్నారన్నది … ఆసక్తికరంగా మారింది.
