టాలీవుడ్‌లో ఉన్న అత్తుత్యమ దర్శకులలో క్రిష్ ఒకడు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలూ లేవు. గమ్యం, వేదం, క్రిష్ణం వందేజగద్గురుమ్, కంచె, గౌతమిపుత్ర శాతకర్ణి… ఇలా ఏ సినిమా తీసుకున్నా, క్రిష్‌లోని భావకుడు బయటకు వస్తాడు. మిగిలిన దర్శకులు వేరు, క్రిష్ వేరు అని ఈ సినిమాలు చెప్పకనే చెబుతాయి. అవార్డుల విషయంలో క్రిష్‌కెరీర్‌లో ఎలాంటి లోటూ లేదు. కానీ.. వసూళ్లు..?
ఇదే.. క్రిష్ ముందున్న అసలు ప్రశ్న. క్రిష్ సినిమాలు విమర్శల ప్రశంసల్నిఅందుకుంటున్నాయి. `ఆహా.. ఓహో`.. అనైతే అంటున్నారు. కానీ బాక్సాఫీసు రిజల్ట్ అంత సంతృప్తికరంగా లేదు. ఇన్నేళ్ల క్రిష్ కెరీర్‌లో.. తీసిన ఇన్ని సినిమాల్లో డబ్బులు రాబట్టిన సినిమా ఉన్నదంటే అది గౌతమిపుత్ర శాతకర్ణి మాత్రమే. గమ్యం.. తన బడ్జెట్‌కి న్యాయం చేసింది. వేదం, కృష్ణం వందే, కంచె… ఇవన్నీ నిర్మాతలకు నష్టాలనే మిగిల్చాయి. తాజాగా ఎన్టీఆర్ – కథానాయకుడుదీ అదే పరిస్థితి. సినిమా చూసినవాళ్లంతా `క్రిష్ బాగా తీశాడు, బాలయ్య బాగా చేశాడు` అన్నారు. కానీ ఏమైంది..?? టాలీవుడ్ డిజాస్టర్లలో అదొకటిగా మిగిలిపోయింది.
వ్యాపార సూత్రాలు, కమర్షియల్ హంగులకు దూరంగా సాగుతాయి క్రిష్ సినిమాలు. మానవ సంబంధాలే క్రిష్ కథలకు మూలం. కానీ… అలాంటి కథలకు ఇప్పుడు కాసులు రాలడం లేదు. దర్శకుడిగా క్రిష్‌కి పేరొస్తుంది.. కానీ నిర్మాతలకు పెట్టుబడి తిరిగిరావడం లేదు. క్రిష్ తీసిన సినిమాలన్నీ దాదాపుగా స్వీయ నిర్మాణంలోనే. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఇప్పటి వరకూ తీసిన సినిమాల్లో లాభాలు తెచ్చుకున్న సినిమా ఒక్కటీ లేదు. ఇదంతా క్రిష్‌ని పునరాలోచనలో పడేసే విషయమే. `మంచి సినిమాలు తీస్తున్నా.. డబ్బులెందుకు రావడం లేదు..? నేను కూడా దారి మార్చాలా` అని క్రిష్ తన సన్నిహితుల దగ్గర తన ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. క్రిష్ గమ్యం సరైనదే. కానీ.. దానికి ఆర్థిక పరిపుష్టి తోడవ్వడం అత్యంత అవసరం. ఇదే క్రిష్‌ని ఆలోచనలో పడేస్తోంది. `ఎన్టీఆర్ – మహానాయకుడు` తరవాత క్రిష్ పూర్తి వాణిజ్య పరమైన చిత్రంతో ముందుకొచ్చినా ఆశ్చర్యం లేదని ఆయన సన్నిహితులే చెబుతున్నారు.