ఓ డాక్టర్ తన భార్యను హత్య చేయాలనుకున్నాడు. కానీ ఆమెకు తెలియకుండా చేయాలనుకున్నాడు. నవ్వుతూ..నవ్విస్తూ.. శరీరంలోకి విషం ఎక్కించాడు. తన భర్త తనను చంపుతున్నాడని తెలియని ఆమె నవ్వుతూనే విషం ఎక్కించుకుంది. చివరికి చనిపోయింది. కానీ చేసిన పాపాలు ఎప్పటికైనా పండాల్సిందే. ఆరు నెలల తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దాంతో ఆ భర్త బండారం బయటపడింది. విషాదం ఏమిటంటే చనిపోయిన ఆ భార్య కూడా డాక్టరే.
బెంగళూరులో నివాసం ఉండే చర్మవ్యాధుల స్పెషలిస్ట్ అయిన కృతికారెడ్డి ఆరు నెలల కిందట చనిపోయారు. తన భార్య అనారోగ్యంతో పడిపోయిందని ఆమె భర్త మహేంద్రరెడ్డి ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. పరీక్షించిన వైద్యులు చనిపోయిందని గుర్తించారు. కానీ ఆమె శరీరంలో ఏదో తేడా గుర్తించారు. సహజ మరణం కాదని నిర్దారణకు వచ్చారు . మెడికో లీగల్ కేసుగా నమోదు చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు పోస్ట్‌మార్టం నిర్వహించి, విసెరా నమూనాలను సేకరించారు. ఈ నమూనాలను ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపించారు.
వారి అనుమానం నిజం అయింది. అక్టోబర్ 13న పోలీసులకు FSL నివేదిక అందింది. కృతికా శరీరంలో ప్రొపోఫోల్ అనే అనస్తీటిక్ ఔషధం అధిక మోతాదులో ఉన్నట్లు తేలింది. ఈ ఔషధం సాధారణంగా నియంత్రిత వైద్య పరిస్థితుల్లో ఇస్తారు. రిపోర్టు ఆధారంగా ఆమె మరణం సహజమైనది కాదని, ముందస్తు ప్రణాళికతో జరిగిన హత్య అని తేల్చింది. దీంతో పోలీసులు మహేంద్రరెడ్డిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో అసలు నిజం ఒప్పుకున్నాడు.
డాక్టర్ కృతికారెడ్డిని .. మహేంద్రరెడ్డి పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెకు కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చాయి. పెళ్లికి ముందే ఆమెకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని మహేంద్రరెడ్డి గుర్తించారు. కానీ తనతో చెప్పలేదని .. ఇలాంటి సమస్యలు ఉన్న ఆమెతో తాను జీవించలేనని అనుకున్నాడు. విడాకులు ఇవ్వడం కన్నా.. హత్య చేయడం మంచిదని ప్లాన్ చేసుకున్నాడు. తన వైద్య తెలివితేటలతో.. భార్యను ఎలా చంపవచ్చో పెద్ద ప్లానే వేసుకున్నాడు. భార్య అనారోగ్యాన్నే ప్లస్‌గా చేసుకుని ఎంతో బాధ్యతగా ట్రీట్మెంట్ తానే చేస్తానని నమ్మించి విషపూరిత ఇంజెక్షన్లు ఇవ్వడం ప్రారంభించాడు. తన భర్త చికిత్స పేరుతో తనపై హత్యాయత్నం చేస్తున్నాడని ఆమె గుర్తించలేకపోయింది. ఎందుకంటే మహేంద్రరెడ్డి ఎప్పుడూ కృతికారెడ్డికి అనుమానం వచ్చేలా ప్రవర్తించలేదు. చివరికి ఆమె చనిపోయింది.
తడిగుడ్డతో గొంతు కోయడం అనే మాట గురించి చాలా సార్లు విని ఉంటాం. కానీ కట్టుకున్న భార్యను ఇంత నమ్మకంగా.. ఏ మాత్రం అనుమానం రాకుండా.. ప్రేమ నటిస్తూ .. హత్య చేసే మనస్థత్వం ఉన్న వాళ్లు చాలా అరుదుగా ఉంటారు. ఈ మహేంద్రారెడ్డి అలాంటి భయంకరమైన క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న వైద్యుడు.