తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి చెప్పేవాళ్లు ఉండరో లేకపోతే వినరో కానీ ఆయన చెప్పే ప్రతీ మాట కామెడీ అయిపోతూ ఉంటుంది. ఆయనపై వచ్చే భూకబ్జాల ఆరోపణలు కావొచ్చు..ఇతర వివాదాలు కావొచ్చు. తాజాగా ఈడీ చేసిన దాడుల్లో దొరికిన కేసినో వ్యాపారులు మాధవరెడ్డి, చికోటి ప్రవీణ్‌లకు మల్లారెడ్డితో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. మాధవరెడ్డి ఉపయోగిస్తున్న కారుకు.. మల్లారెడ్డికి చెందిన ఎమ్మెల్యే స్టిక్కర్ ఉంది. ఆయన మీకు బాగా తెలుసా అని … మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే.. విచిత్రంగా సమాధానం ఇచ్చారు మల్లారెడ్డి.
విజయవాడ ఎంపీ కేశినేని నాని చెప్పినట్లుగా తనకు చెందిన నకిలీ స్టిక్కర్లు తయారు చేసి వాడుకుంటున్నారని చెప్పలేదు.. ధైర్యంగానే తన స్టికరేనని అంగీకరించారు. కానీ మాధవరెడ్డి ఎవరో నకు తెలియదంటున్నారు. మరి ఎమ్మెల్యే స్టిక్కర్ ఎలా చేరిందంటే … విచిత్రమైన కారణం చెబుతున్నారు. ఆ స్టిక్కర్ ఇప్పటిది కాదని 2022 మార్చిదన్నారు. తాను తీసి బయటపడేస్తే మాధవరెడ్డి తీసుకుని పెట్టుకున్నాడని.. తనకేం సంబంధం అని ప్రశ్నిస్తున్నారు. ఆయన ఎప్పుడో దశాబ్దం కిందటిదన్నట్లుగా చెప్పారు కానీ ఆ స్టిక్కర్ మూడు నెలల కిందటిదే.. అయినా అలాంటి స్టిక్కర్లు మల్లారెడ్డి బయట ఎందుకు పడేస్తాడో ఆయనకే తెలియాలి.
మాధవరెడ్డితో మల్లారెడ్డికి ఎక్కడ పరిచయం ఉందో కానీ ఆయనకు తెలియకుండా స్టిక్కర్లు బయటకు వెళ్లే చాన్స్ లేదు. మాధవరెడ్డితో ఉన్న పరిచయాల మేరకే ఆయనకు ఇచ్చి ఉంటారని.. కవర్ చేసుకోవడానికి పిట్టకథలు చెబుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అటూ ఇటూ తిరిగి ఈ కాసినోల వ్యవహారం మల్లారెడ్డికి చుట్టుకుంటుదేమోనని ఆయన వర్గీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.