భారతీయ సినిమాలకు అమెరికా మార్కెట్ దూరం కాబోతోంది. ఇప్పటి వరకూ అక్కడ వచ్చిన షేర్లో కనీసం సగం నిర్మాత అకౌంట్లో పడేది. ఇక ముందు అందులో కూడా అత్యధిక మొత్తం అమెరికా ప్రభుత్వ అకౌంట్లో టాక్స్ రూపంలో పడబోతోంది. నిర్మాతకు అతి చిన్నమొత్తమే మిగలనుంది. విదేశాల్లో చిత్రీకరించి అమెరికాలో విడుదల చేసే సినిమాలపై 100 శాతం టారిఫ్‌లు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. కొందరు నిర్మాతలు హాలీవుడ్‌ని నాశనం చేస్తున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నానని ట్రంప్ చెప్పారు.
ఇప్పటి వరకూ సినిమాలపై సుంకం స్వల్పం !
భారత సినిమాలపై అమెరికాలో ఇప్పటి వరకూ పెద్దగా పన్నులు లేవు. సాధారణంగా దిగుమతి సుంకాలు మాత్రమే వర్తిస్తాయి. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఏడు శాతం వరకూ ఉండేది. అయితే ఇది సినిమాను ఎక్కడ నిర్మించారన్న దానితో సంబంధం లేని పన్ను. ఇప్పుడు ట్రంప్ ఇతర దేశాల సినిమాలకే కాదు.. అమెరికాలో చిత్రీకరించని హాలీవుడ్ సినిమాలపైనా ఈ పన్ను వేశారు. అంటే హాలీవుడ్ లో నిర్మాణం కాని సినిమాలకు పన్ను విధింపు ఉంటుంది. సాధారణగా ఇండియన్ సినిమాలు అమెరికాలో షూటింగ్ జరుపుకునేది చాలా తక్కువ.
భారత నిర్మాతలకు భారీ నష్టం
భారత్ నుంచి తెలుగు, హిందీ, తమిళ, మలయాళ సినిమాలకు అమెరికాలో మంచి మార్కెట్ ఉంది. స్టార్ హీరోల సినిమాలకు అక్కడ మంచి ఓపెనింగ్స్ వస్తాయి. సినిమా బాగుంటే.. కలెక్షన్లు ఇండియాలో కంటే ఎక్కువగా వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పటి వరకూ ఉన్న టాక్స్ స్ట్రక్చర్ ప్రకారం.. నిర్మాతలకు ప్రాఫిట్ ఉండేది. కానీ ఇప్పుడు వంద శాతం పన్ను అంటే.. అక్కడ రిలీజ్ ఖర్చులు కూడా రావేమోనన్న ఆందోళన ఉంటుంది. ఇది భారతీయ సినిమాకు గట్టి దెబ్బే అవుతుంది. ఇప్పటికే సమస్యల్లో ఉన్న సినిమాలు మరింతగా ఇబ్బందుల్లో పడతాయి.
హాలీవుడ్లో తగ్గిపోయిన సినిమాల నిర్మాణం
గత ఐదు సంవత్సరాల్లో అమెరికాలో సినిమాల నిర్మాణానికి కేంద్రం అయిన లాస్ ఎంజిల్స్ లోని హాలీవుడ్ లో కార్యకలాపాలు తగ్గిపోయాయి. సినీ నిర్మాణాలు దాదాపుగా నలభై శాతం వరకూ తగ్గిపోయాయని రికార్డులు చెబుతున్నాయి. ఇటీవల కార్చిచ్చు కారణంగా చాలా వరకూ మౌలిక సదుపాయాలు కూడా కాలిపోయాయి. దీంతో పరిస్థితి మరింతగా దిగజారింది. చాలా మంది హాలీవుడ్ నిర్మాతలు అమెరికా బయట షూటింగ్ కు ప్రాధాన్యం ఇస్తున్నారు. హాలీవుడ్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ ఉంటుంది కాబట్టి వారి సినిమా కథలకు తగ్గట్లుగా ఆయా దేశాల్లో చిత్రీకరించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఇది ట్రంప్‌కు నచ్చడం లేదు.