నమస్తే ట్రంప్…! ప్రవాస భారతీయుల ఓట్లపై గురి..!

భారతదేశం… వందల కోట్లు ఖర్చు పెట్టి.. డొనాల్డ్ ట్రంప్‌ కోసం ఎన్నికల ప్రచారం చేస్తోంది. కాస్త అతిశయోక్తిగా ఉన్న ఇది మాత్రం నిజం. ట్రంప్ వస్తూ.. ఇండియాలకు ఎలాంటి తాయిలాలూ తీసుకు రావడం లేదు. కానీ పట్టుకుపోవడానికి మాత్రం చాలా పెద్ద లిస్ట్ తెచ్చారు. వాటి సంగతి పక్కన పెడితే.. మొత్తంగా.. ట్రంప్ ఇండియాలో చేయబోయేది పూర్తిగా ఎన్నికల ప్రచారం. అమెరికాలో ఓటు హక్కు ఉన్న ప్రవాస భారతీయుల ఓట్లను.. గుంపగుత్తగా తాను సొంతం చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నం. ఈ ఏడాది చివరిలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ రెండో సారి పోటీ చేయాలని అనుకుంటున్నారు. ఆయన విధానాల వల్ల.. వలసదారుల్లో వ్యతిరేకత ఉంది. దాన్ని తగ్గించుకునే ప్రయత్నంలోనే ట్రంప్ ఇండియా టూర్‌ను వాడుకుంటున్నారు.

అమెరికన్‌ కమ్యూనిటీ సర్వే ప్రకారం..అమెరికా జనాభాలో ఓటు హక్కు ఉన్న భారతీయులు 40 లక్షల మంది ఉన్నారు.  16 రాష్ట్రాల్లో ఒక శాతం కంటే ఎక్కువగా ప్రవాస భారతీయులు ఉన్నారు. పోటాపోటీగా జరిగే ఎన్నికల్లో.. ఒక్క శాతం.. ఫలితాల్ని తారుమారు చేస్తూ ఉంటుంది. గతంలో.. పలుమార్లు ఓట్లు ఎక్కువ వచ్చినప్పటికీ.. అమెరికా అధ్యక్ష అభ్యర్థి ఓడిపోయిన దాఖలాలు ఉన్నాయి. ఎలక్టోరల్ సిస్టమే దీనికి కారణం. అందుకే ట్రంప్ ఏ అవకాశాన్ని వదిలి పెట్టదల్చుకోలేదు. ప్రవాస భారతీయులు ఎక్కువగా డెమెక్రాట్లకు మద్దతుగా నిలుస్తారు. డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి చెందినవారు. ఆయనకు గత ఎన్నికల్లో 29 శాతం ప్రవాస భారతీయులే మద్దతుగా నిలిచినట్లుగా అక్కడి సర్వేలుతెలిపాయి. పెన్సిల్వేనియా, మిషిగాన్‌, విస్కాన్‌సిన్‌, ఫ్లోరిడాలలో  2016 ఎన్నికల్లో ట్రంప్‌ ఒక్కో రాష్ట్రంలో 10-11 వేల మధ్య ఆధిక్యం సాధించారు. ఈ లెక్కలు తారుమారైతే తుది ఫలితాలు ప్రభావితం అవుతాయి.

అందుకే ప్రవాస భారతీయుల ఓట్లను గురి పెట్టి.. ఇండియా పర్యటనకు వస్తున్నారు. గుజరాతీయులు అత్యధికం కావడంతో.. అహ్మదాబాద్‌లో మెయిన్ షెడ్యూల్ పెట్టుకున్నారు. భారత ప్రధాని నరేంద్రమోడీ కూడా.. ట్రంప్ మళ్లీ గెలవాలని కోరుకుంటున్నారు. ఇందు కోసం.. అమెరికా వెళ్లినప్పుడు.. హౌడీ మోడీ అనే కార్యక్రమం నిర్వహించారు. దానికి ట్రంప్‌ను ఆహ్వానించారు. వేదికపై నుంచి… ఆప్‌ కీ బార్.. ట్రంప్ సర్కార్ అనే నినాదం ఇచ్చారు. అయితే ట్రంప్ విధానాలతో వలసదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు రోజుకో కొత్త నిబంధన తెస్తూండటంతో.. మోడీ ప్రచారం చేసినా… ట్రంప్‌కు మద్దతిస్తారా అన్నది ఆసక్తికరమే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com