ప్చ్..! భారతం అంతా విని కశ్మీర్‌ పై పాత పాటే పాడిన ట్రంప్..!

రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుందో అడిగినట్లుగా … ఫినిషింగ్ టచ్ ఇచ్చారు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. కశ్మీర్ విషయంలో… మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధమని ప్రకటించేశారు. అంతే కాదు.. భారత గడ్డపై నుంచి పాకిస్థాన్ గురించి చాలా సానుకూలంగా మాట్లాడారు. భారత్‌ తో సమానంగా పాకిస్తాన్‌తో అమెరికాకు సత్సంబంధాలు ఉన్నాయని ప్రకటించారు. తద్వారా తనకు భారత్, పాకిస్తాన్ రెండూ ఒకటేనని చెప్పకనే చెప్పేశారు. భారత్‌- పాకిస్తాన్ మధ్య కొన్ని అంశాలు అపరిష్కృతంగా ఉన్నాయని.. కశ్మీర్‌ వివాదంలో చాలా సంక్లిష్టమైన అంశాలున్నాయని చెప్పుకొచ్చారు. ప్రతి అంశానికి రెండు కోణాలు ఉంటాయన్నారు. పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌తో మంచి సంబంధాలున్నాయని.. అవసరమైతే భారత్‌- పాక్ మధ్య మధ్యవర్తిత్వం వహిస్తానని ఆఫర్ ఇచ్చారు.

కశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒకే విధానంతో ఉంది. ఇటీవల ఆర్టికల్ 370ని రద్దు చేసి.. ప్రపంచ దేశాలకు స్పష్టమైన సంకేతాన్ని పంపింది. ఆ భూభాగంపై.. ఇక ఎలాంటి శషబిషలు లేవని… ఉన్నతంతా.. ప్రస్తుతం కశ్మీర్ అధీనంలో ఉన్న పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించేనని చెబుతూ వస్తోంది. దాన్ని స్వాధీనం చేసుకుంటామనే గంభీరమైన ప్రకటనలు చేస్తోంది. కశ్మీర్ గురించి.. ఇతర దేశాలు ఏవైనా వ్యాఖ్యానిస్తే.. ఘాటుగా స్పందించడానికి వెనుకాడటం లేదు. గత వారం.. పాకిస్థాన్‌లో.. టర్కీ అధ్యక్షుడు ఎర్దోగాన్ పర్యటించినప్పుడు… కశ్మీర్‌పై పాకిస్థాన్ వాదనకు మద్దతు తెలిపారు. దానిపై నా కేంద్రం ఘాటుగా రిప్లయ్ ఇచ్చింది. అది అలా ఉండగానే.. భారత గడ్డపై అద్భుతమైన ఆహ్వానాన్ని అందుకున్న ట్రంప్.. పోతూ.. పోతూ.. తనకూ పాకిస్థాన్ కూడా ముఖ్యమేనని ప్రకటించారు. కశ్మీర్ విషయం ఇంకా వివాదాస్పదంగానే ఉందని.. పరిష్కారం కాలేదని.. తేల్చేశారు.

గతంలోనూ డొనాల్డ్ ట్రంప్.. ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. కశ్మీర్ పై మధ్యవర్తిత్వం వహిస్తానంటూ ప్రకటించారు. దీనిపై.. భారత్ కొంత సాఫ్ట్ గానే నిరసన తెలిపింది. అప్పటికి భారత్ అంతర్గత వ్యవహారం అని ప్రకటన చేసిన.. ట్రంప్.. ఆ తర్వాత మాత్రం.. మళ్లీ మొదటి వాదనకే కట్టుబడుతున్నారు. కశ్మీర్ విషయంలో.. తన ఉపలాటాన్ని ప్రదర్శిస్తున్నారు. మొత్తానికి అగ్రరాజ్యాధినేతను పలిచి.. గొప్పగా మర్యాదలు చేసి.. తమకు ఎంతో సన్నిహిత మిత్రదేశమని చెప్పుకునేందుకు పడిన కేంద్ర ఆరాటం.. చివరికి.. తేలిపోయింది. భారత్ లానే పాకిస్తాన్ కూడా తమకు సన్నిహిత దేశమని ట్రంప్ సర్టిఫికెట్ ఇచ్చి చక్కా వెళ్లిపోయారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com