థాయిల్యాండ్, కాంబోడియా మధ్య యుద్ధ పరిస్థితుల్ని తానే ఆపేశానని ట్రంప్ ప్రకటించుకున్నారు. భారత్ , పాక్ యుద్ధాన్ని తానే ఆపానని ఇప్పటికి ఓ మఫ్ఫై సార్లు చెప్పుకుని ఉంటారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం విషయంలోనూ ఇదే చెబుతారు. రోజూ అదే మెడల్లా ఇలాంటివి తన మెడలో వేసుకుని తిరుగుతూనే ఉంటారు. కానీ ఎవరూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యం వల్లనే యుద్ధం ఆపేశామని ఒక్కరంటే ఒక్కరూ చెప్పడం లేదు. కేవలం ట్రంప్ మాత్రమే చెబుతున్నారు. దీంతో అందరూ ఆయనను పిట్టల దొర ఖాతాలో వేసుకుంటున్నారు.
ముందే చెబుతున్నారు !
అమెరికా అధ్యక్షుడు ఇటీవలి కాలంలో పలు దేశాల మధ్య ఏర్పడిన ఘర్షణల విషయంలో.. కాల్పుల విరమణ పాటించబోతున్నారని ట్రంప్ ముందే ప్రకటిస్తున్నారు. తన ట్రూత్ సోషల్ మీడియా ఖాతాలో ఈ విషయాన్ని ప్రకటిస్తున్నారు. తర్వాత అదే నిజం అవుతోంది. ఇండియా, పాకిస్తాన్ యుద్ధం సమయంలోనూ.. ఇజ్రాయెల్, ఇరాన్ వార్ లోనూ.. తాజాగా కాంబోడియా, ధాయ్ అంశంలోనూ ఆయనే ముందు ప్రకటించారు. తర్వాత వారు కాల్పుల విరమణ ప్రకటించారు. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఉంది. అదేమిటంటే.. ట్రంప్ కు ప్రమేయం ఉందని వారెవరూ చెప్పడం లేదు.
అమెరికాతో సంబంధం లేకుండానే కాల్పుల విరమణలు
థాయిల్యాండ్, కాంబోడియా మధ్య యుద్ధ విరమణ గురించి ట్రంప్ ప్రకటించారు కానీ.. చర్చలకు అమెరికాతో సంబంధం ఉందని ఆ రెండు దేశాలు చెప్పలేదు. మలేషియా మధ్యవర్తిత్వం వహించింది. చర్చలు జరిపారు. సంతకాలు చేసుకున్నారు. భారత్, పాక్ కూడా అంతే. పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చింది. సాగదీయడం ఎందుకని భారత్ ఒప్పుకుంది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య చాలా నష్టం జరిగిన తర్వాత రెండు దేశాలు ఒప్పందానికి వచ్చాయి. ఈ మూడుదేశాల్లో ఒక్కరు కూడా ట్రంప్‌నకు క్రెడిట్ ఇవ్వలేదు. ఇజ్రాయెల్ ఇచ్చినా ఇరాన్ మాత్రం.. అమెరికాపై దాడి చేస్తామని అంటోంది.
ముందు చెప్పడం కాదు.. వాళ్లు చెబితేనే విలువ – లేకపోతే జోక్
వాళ్లిద్దరూ యుద్ధాన్ని విరమిస్తున్నారని తానే మధ్యవర్తిత్వం చేశానని ట్రంప్ చెప్పుకుంటున్నారు. కానీ వారిద్దరూ చెప్పుకోకపోతే ఆయన ప్రకటన జోక్ అవుతుంది. ఆయన జోకర్ అవుతారు. ట్రంప్ వల్లనే తాము కలిసిపోయామని.. యుద్దాన్ని వదిలేశామని వాళ్లు చెబితే ట్రంప్ పెద్దరికానికి గౌరవం ఉంటుంది. తానే క్లెయిమ్ చేసుకుంటే ఉండదు. ఈ లాజిక్ .. ట్రంప్ మిస్సవుతున్నారు.