రష్యా, చైనా, ఉత్తరకొరియా అధ్యక్షులు కలిశారు. వారి సాక్షిగా చైనా మిలటరీ ఆయుధాలను ప్రదర్శించింది. చైనా నుంచి కడుపులో చల్ల కదలకుండా అమెరికాలోని అన్ని నగరాలను టార్గెట్ చేసేంత శక్తి ఉందని చైనా ప్రదర్శించింది. వెంటనే ట్రంప్ తమ సైన్యాన్ని అప్పమత్తం చేశారు. కొత్త వ్యూహాలతో రెడీగా ఉండాలని ఆదేశించినట్లుగా అమెరికా సైనిక ఉన్నతాధికారులు చెబుతున్నారు. అయితే ఇది యుద్ధ సన్నాహం కాదని అంటున్నారు.
రష్యా అధ్యక్షుడ్ని ఆయుధాలతో భయపెట్టే ప్రయత్నం చేసిన ట్రంప్
ఉక్రెయిన్ అంశంపై రష్యా అధ్యక్షుడితో చర్చలకు అలస్కా వచ్చినప్పుడు ట్రంప్.. తన పైత్యాన్ని చూపించారు. రష్యా అధ్యక్షుడ్ని తన ఆయుధ సంపత్తిని ప్రదర్శించి భయపెట్టే ప్రయత్నం చేశారు. ఇంత కన్నా ఓ దేశ అధ్యక్షుడి నుంచి వచ్చే సిల్లీ ఆలోచన మరొకటి ఉండదని అప్పుడే అందరూ అనుకున్నారు. ఇప్పుడు ఉక్రెయిన్ చర్చలు ముందడుగు పడలేదు. యుద్ధం ఆగలేదు. కానీ రష్యా నుంచి చమురు కొంటున్నారని ఇండియాపై కన్నెర్ర చేశారు ట్రంప్. కానీ సమస్య అది కాదని ఆయనకు తెలుసు.
అమెరికా కన్నా ధీటుగా చైనాకు ఆయుధ సంపత్తి
చైనా ఆయుధ సంపత్తి గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆ దేశమే కమ్యూనిస్టు పాలనలో ఉంటుంది. సైన్యం కూడా ఆ పార్టీదే. అందుకే సైన్యం ఎప్పుడూ ఆధునికంగా ఉంటుంది. చైనా ప్రకటించుకున్నదాని కన్నా అత్యాధునిక ఆయుధాలు ఆ దేశం వద్ద ఉండవచ్చు. అయితే చైనాపై దాడి చేయకుండా ఆ దేశం ఇతర దేశాలపై దాడి చేయకపోవచ్చు. అలాంటి పరిస్థితులు వస్తే.. దానికి ట్రంపే కారణం అవుతారు. అలాంటి నిర్ణయాలను ఆయనే తీసుకుంటారు.
ఇప్పుడు అమెరికాకు మిత్రదేశాలే లేవు !
అమెరికాకు మిత్ర దేశాలే లేకుండా చేశారు ట్రంప్. గత పాలకులు దశాబ్దాల పాటు శ్రమించి అమెరికాకు మిత్ర దేశాలకు చేసిన వారందర్నీ దూరం చేశారని భద్రతా సలహాదారులు మండిపడుతున్నారు. పొరుగుదేశాలు కెనడా, పనామా, మెక్సికోలను ట్రంప్ ట్రీట్ చేసిన విధానం చూసి ఆ దేశాలు ఎప్పుడో గౌరవించడం మానేశాయి. ఇండియా దూరం అయింది. యూరప్ దేశాలు ట్రంప్ బాటలో నడిస్తే తమ పుట్టి మునిగిపోతుందని దూరదూరంగా ఉంటున్నాయి. ఫిన్ ల్యాండ్ అధ్యక్షుడి మాటలే దానికి నిదర్శనం. వెనిజులా లాంటి కొన్ని దేశాలు అమెరికాపై దాడి చేస్తామంటున్నాయి. ఇప్పుడు అమెరికాకు సరైన మిత్రదేశం లేదు. ఇప్పుడు అందర్నీ దూరం చేసుకుని.. సైన్యం సిద్దమవ్వాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి అగ్రదేశానికి రావడం విషాదమే.