తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కేసీఆర్ కు జాతిపిత క్రెడిట్ ఇచ్చేందుకు సిద్ధంగా లేరు. అసలు మలి దశ తెలంగాణ ఉద్యమం క్రెడిట్ కూడా కేసీఆర్ కు ఇవ్వడం లేదు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమకారుల ఆత్మగౌరవ సభను హైదరాబాద్‌లో కవిత నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె కేసీఆర్ ఉద్యమ క్రెడిట్ ఇవ్వనట్లుగా మాట్లాడారు.
మలిదశ తెలంగాణ ఉద్యమం కేసీఆర్‌తో మొదలుకాలేదని…. 1995లోనే వరంగల్ డిక్లరేషన్‌తో ఉద్యమం మొదలైందని గుర్తు చేశారు. మారోజు వీరన్న, గద్దర్ లాంటి ఎంతోమంది విప్లవకారులు, ప్రజాసంఘాల నాయకులు మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారుని అన్నారు. ఉద్యమం అనే అగ్గి పుట్టినంక కేసీఆర్ పార్టీ పెట్టారన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమకారులకు ప్రభుత్వ పరంగా అండగా నిలవాలని తాను గతంలో ప్రయత్నించిన విషయాన్ని కవిత ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఉద్యమకారులకు సాయం చేయాలని అడిగితే.. అసలు ఎవరు ఉద్యమకారులు ఆఫీసర్లు అడిగేవారన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉద్యమకారులు అంటే ఎవరో అని మనకు మనమే చెప్పుకునే దుస్థితి ఉండేదన్నారు.
ఉద్యమకారులను పట్టించుకోకపోవడం వల్లనే ఆ పెద్ద మనిషి అధికారం కోల్పోయారని కేసీఆర్ ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. సభా వేదికపై ఆమె మాట్లాడిన మాటలు ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలకు తెగించి పోరాడిన వారికే నేడు గుర్తింపు కరువైందనే ఆవేదన సభలో వ్యక్తమైంది. తెలంగాణ ఉద్యమాన్ని సృష్టించి..నడిపి.. తెలంగాణను సాధించిన జాతిపిత కేసీఆర్ అని బీఆర్ఎస్ ప్రచారం చేస్తూంటే..ఉద్యమంలో జాగృతి పేరుతో కీలక పాత్ర పోషించిన కవిత ఆ క్రెడిట్ ఇచ్చేందుకు సిద్ధంగా లేకపోవడం మరోసారి హాట్ టాపిక్ అవుతోంది.


