తెలుగు360 రేటింగ్: 2.5/5
ఓ గొప్పింటి అమ్మాయి
ఓ పేదింటి అబ్బాయి..
ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఇప్పుడేమవుతుంది?
– ఈ ప్రశ్నని పదేళ్ల పిల్లాడిని అడిగినా, రెండు మూడు తెలుగు ప్రేమకథా చిత్రాలు చూసిన ఏ సినీ ప్రేక్షకుడ్ని అడిగినా ‘పెద్దవాళ్లు ఒప్పుకుంటారేంటి?’ అనే సమాధానం ఇస్తాడు. తెలుగు సినిమాల్లో అరిగిపోయి, ఇప్పుడు ఆనకుండా పోయిన అతి పురాతనమైన ఫార్ములా ఇది. దాన్ని అటూ ఇటూ చేసి, నేపథ్యాలు మార్చి, కొత్త రంగులు ఇచ్చి, మళ్లీ మళ్లీ పిండి పిప్పి చేయడానికి ఏమాత్రం సిగ్గు పడడం లేదు చిత్ర పరిశ్రమ. ‘పాత కథే… మేం కొత్తగా చూపిస్తాం’ అంటూ డంకా బజాయించి మరీ వస్తోంది. అలాంటి సినిమానే ‘దొరసాని’ కూడా. ‘ఈ స్క్రిప్టుపై నేను మూడేళ్లు కూర్చున్నా’ అన్నాడు దర్శకుడు. ’42 వెర్షన్లు రాసుకున్నా’ అని కూడా అన్నాడు. ఇన్ని గొడవలెందుకు.. ‘సైరత్’ని ఒక్కసారి చూస్తే చాలు అనిపిస్తుంది. ‘దొరసాని’ చూస్తుంటే..
రాజు (ఆనంద్ దేవరకొండ) పట్నంలో చదువుకుని ఊరొస్తాడు. రాగానే ఇక్కడ దొరసాని (శివాత్మిక)ని చూసి మనసు పారేసుకుంటాడు. కానీ దొర కూతురెక్కడ, ఊర్లో సూన్నాలేసుకుని బతికే రాజు స్థోమత ఎక్కడ? కులం, ఆస్థి, అంతస్థు, హోదా ఇవన్నీ అడ్డుగోడలుగా మారిపోతాయి.ఆ గోడల్ని రాజు బద్దలు కొట్టాడా? దొరసానే దాటుకొచ్చిందా? లేదంటే ఆ గొడల మధ్యే ఈ ప్రేమ శిథిలమైందా? అన్నదే కథ. దర్శకుడు మహేంద్రపై `సైరత్` ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. `సైరత్` కథ కూడా ఇలాంటిదే కదా? కాకపోతే.. ఈ కథని చెప్పడానికి ఎంచుకున్న నేపథ్యం వేరు. వాడిన భాష వేరు. నటులు వేరు. చూపించిన సంప్రదాయాలు వేరు.
శంఖంలో పోస్తేనే తీర్థం అవుతుంది. అందుకే దొరికిన ప్రతీదీ ఆ శంఖంలో పోసేసి – తీర్థమైపోయింది అంటే ఎలా? తెలంగాణ యాస, భాష ఓ శంఖంలా కనిపిస్తోంది రచయితలు, దర్శకులకు. అందులో ఓ కథ పోసేస్తే… పనైపోతుందనుకుంటున్నారు. కానీ ప్రతీసారీ ఆ ఫార్ములా వర్కవుట్ కాదు. తెలంగాణ నేపథ్యంలో ఈ కథని మొదలెట్టడం – తెలంగాణ యాస, భాష మెల్లమెల్లగా మత్తులా ఆవహించడం… కలిసొచ్చి – కథలోకి తొందరగానే లీనం అవుతాడు ప్రేక్షకుడు. కానీ దర్శకుడి చేతిలో ఉన్న కథ ఏమంతని? అందుకే ఓ చిన్న గిరి గీసుకుని దాని చుట్టూ తిరగడం మొదలెట్టాడు.
రాజు – దొరసాని – ఓ కిటికీ – ఆ రెండు పాత్రలూ… ఆ ఒక్క లొకేషనూ పట్టుకుని – సీన్లకు సీన్లు నడిపించేశాడు దర్శకుడు.
రాజుగాడు కిటికీ దాటి కోటలోపలకు వెళ్లడు. దొరసాని ఆ కిటిటీ వదిలి బయటకు రాదు. ఒకచోటే, ఒకే ఫ్రేమలో ఎంత కథ అని నడుపుతాడు. వీరిద్దరి మధ్యా మాటలుండవు. కేవలం చూపులే. ఒకట్రెండు సీన్ల వరకూ ఓకే. ఇంట్రవెల్ వరకూ
ఇదే స్క్రీన్ ప్లే నడుపుతానంటే ఎలా?? రాజు కవిత్వానికే దొరసాని పడిపోతుందా? ఆ కోటని దాటడానికి రాజులో దొరసాని ఇంకేం చూడలేదా?
ప్రేమకథలో ఎమోషన్ చాలా కీలకం. ప్రేమికుల ఎడబాటుని ప్రేక్షకుడు సైతం తట్టుకోకూడదు. అప్పుడే ప్రేమకథలు విజయవంతం అవుతాయి. కానీ.. దొరసానిలో ఆ ఎమోషన్ మిస్ అయ్యింది. హీరో, హీరోయిన్లు ఎప్పుడు కలుసుకుంటారా? అనే ఆత్రుత ప్రేక్షకుడిలో లేనప్పుడు వాళ్లు కలుసుకుంటే ఏంటి? కలవకపోతే ఏంటి? పరువు రాజేసిన మంటల్లో ఆ ప్రేమకథ కాలిపోతే ఏంటి? నక్సలిజానికీ ఈ కథలో చోటుంది. అయితే దాన్నీ అంత బలంగా చూపించలేకపోయాడు దర్శకుడు. ఇటు ప్రేమకథలోని ఎమోషన్‌కీ, అటు నక్సలిజానికీ రెండింటికీ న్యాయం చేయలేకపోయాడు. నిజమైన తెలంగాణ యాసనీ, భాషనీ, అక్కడి సంస్కృతిని. ముఫ్ఫై ఏళ్ల నాటి దొరల రాజ్యాన్నీ కళ్లకు కట్టినట్టు చూపించాం అని చెప్పారు కానీ, అక్కడా కొన్ని విషయాల్లో రాజీ పడ్డారేమో అనిపిస్తోంది. కాకపోతే.. తెలంగాణ యాసనీ, భాషనీ ఇప్పటి సినీ ప్రేమికులకు రుచి చూపించాలన్న తపన మాత్రం తప్పకుండా నచ్చుతుంది. ఎలాంటి సెట్లూ వేయకుండా, గ్రాఫిక్కుల జిమ్మిక్కులు నమ్ముకోకుండా 30 ఏళ్లనాటి వాతావరణం ప్రతిబింబించేలా సినిమా తీయడం చాలా కష్టం. ఈ విషయంలో చిత్రబృందం సక్సెస్ అయ్యింది.
నటీనటుల విషయంలో దర్శకుడు ఎక్కడా తప్పు చేయలేదు. శివాత్మికని పక్కన పెట్టి దొరసాని పాత్ర ఊహించలేం. తను అంత చక్కగా ఒదిగిపోయింది. నటించే స్కోప్ దర్శకుడు శివాత్మికకు చాలా తక్కువ ఇచ్చాడు. తనకు డైలాగులు కూడా తక్కువే. కేవలం చూపులతోనే హావభావాలు పలికించింది. పేజీ డైలాగులు ఇచ్చి చెప్పమంటే – అప్పుడు బయటపడేది శివాత్మికలోని ప్రతిభ. ఆనంద్ దేవరకొండ కూడా ఆకట్టుకుంటాడు. డైలాగులు వింటుంటే విజయ్ దేవరకొండ గుర్తొస్తాడు. హుషారైన పాత్రలు చేయాల్సిన వయసులో, బరువైన పాత్రని ఎంచుకున్నాడు. అన్న పేరుని నిలబెట్టాడని చెప్పలేం గానీ, ఆ పేరుకి మాత్రం ఎలాంటి నష్టం తీసుకురాలేదు. నక్సల్ నాయకుడిగా కిషోర్ కనిపించాడు. మిగిలినవాళ్లంతా కొత్తవాళ్లే.
కథ, దాన్ని నడిపించిన విధానం పక్కన పెడితే – తొలి చిత్ర దర్శకుడికి ఇది డీసెంట్ ఎఫెక్టే. సంగీతం, ఛాయాగ్రహణం చక్కగా కుదిరాయి. కొన్ని కవితాత్మక భావాలు… ఆహ్లదకరంగా సాగాయి. సినిమాటిక్ ఎక్స్‌ప్రెషన్స్ చాలా తక్కువగా కనిపిస్తాయి. మాటలూ సహజంగానే ఉన్నాయి. పరువు హత్య నేపథ్యంలో సాగే రొటీన్ కథ ఇది. తెలంగాణ నేపథ్యం ఒక్కటే బలం. బలగం. ఎమోషన్లని బలంగా పండించడంలో దర్శకుడు విఫలం అయ్యాడు. స్క్రీన్ ప్లే కూడా చాలా నెమ్మదిగా సాగింది. `సైరత్`లాంటి సినిమాలు చూసి ఎమోషన్‌తో ఊగిపోయినోళ్లకు ఈ సినిమా అంతగా ఆనకపోవొచ్చు. తెలంగాణ ఫ్లేవర్‌ని ఇష్టపడేవాళ్లు మాత్రం ఒక్కసారి చూడొచ్చు.
ఫినిషింగ్ టచ్: ‘సైరత్’కి ఫ్రీమేక్
తెలుగు360 రేటింగ్: 2.5/5