తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై సందిగ్ధత కొనసాగుతోంది. హైకోర్టు సెప్టెంబర్ 30లోపు పూర్తి చేయమని ఆదేశించింది. రిజర్వేషన్లు ఈ నెలాఖరులోపు ఖరారు చేయాల్సి ఉంది. కానీ అక్కడ పడిన పీటముడి వీడటం లేదు. సీఎం రేవంత్ రెడ్డి తాను అనుకున్న దారిలో వెళ్తున్నారు. కానీ అడుగులు ముందుకు పడవని ఆయనకూ క్లారిటీ ఉంది. డెడ్ లైన్ దగ్గర పడుతున్నా .. అధికారికంగా రిజర్వేషన్లను ఖరారు చేయలేరు. పాత రిజర్వేషన్లతోనే అమలు చేయాల్సి ఉంది. దానికి సిద్ధపడితేనే ఎన్నికలు జరుగుతాయి. లేకపోతే కోర్టు కేసుల్లో పడి అయినా ఆగిపోతాయి.
ఇప్పటికిప్పుడు 42 శాతం బీసీ రిజర్వేషన్లు సాధ్యం కాదు !
కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించినప్పుడు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని రేవంత్ ప్రకటించారు. ఆయన ఈ హామీ విషయంలో నిజాయితీగానే ఉండి ఉండవచ్చు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులగణన చేసి.. రిజర్వేషన్లపై పరిమితి ఎత్తేస్తామని రాహుల్ గాంధీ పదే పదే చెబుతున్నారు. అలాంటి సమయంలో కాంగ్రెస్ వస్తుందని రిజర్వేషన్లు ఇస్తానని రేవంత్ అనుకుని ఉంటారు. కానీ కేంద్రంలో కాంగ్రెస్ రాలేదు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్లను తాత్కలికంగా అయినా ఇవ్వడానికి ఆయన కష్టాలు పడాల్సి వస్తోంది. ఎప్పుడో నిర్వహించాల్సిన స్థానిక ఎన్నికలు ఈ రిజర్వేషన్ల కారణంగానే వాయిదా పడుతూ వస్తున్నాయి.
స్థానిక ఎన్నికలను నిర్వహించకపోతే సమస్యలు
స్థానిక ఎన్నికలను నిర్వహించకపోతే ప్రభుత్వానికీ సమస్యలు వస్తాయి. ఇలా రిజర్వేషన్లతో ముడి పెట్టుకోవడం వల్ల ఆ ఎన్నికలు నిర్వహించడం కత్తి మీద సాములా మారింది. చివరికి హైకోర్టు మూడు నెలల గడువు ఇచ్చింది. ఈ నెలాఖరులోపు అంటే.. ఇక వారం లోపే రిజర్వేషన్లను ఖరారు చేయాలి. అలా చేయాలంటే గవర్నర్ కు పంపిన ఆర్డినెన్స్ పై సంతకం చేయాలి. ఆ ఆర్డినెన్స్ కు రాజ్యాంగ అర్హత లేదని ఎక్కువ మంది నిపుణులు చెబుతున్నారు. రేవంత్ పై బీజేపీకి ఏమైనా సాఫ్ట్ కార్నర్ ఉంటే.. ఆర్డినెన్స్ పై గవర్నర్ సంతకం పెట్టవచ్చు. వెంటనే స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేయవచ్చు. కానీ కోర్టుల్లో పడితే మాత్రం మళ్లీ సమస్యలు వస్తాయి.
అనధికారికంగా రాజకీయ రిజర్వేషన్లతో నిర్వహించడమే మార్గం
చట్టపరంగా ప్రాసెస్ కు సమయం పడుతుంది.. కాబట్టి స్థానిక ఎన్నికలను అనధికారిక రాజకీయ రిజర్వేషన్లతో నిర్వహించాలని రేవంత్ భావించవచ్చు. అది ఒక్కటే మార్గం ఉంది. అనధికారిక రాజకీయ రిజర్వేషన్లు అంటే.. పార్టీ పరంగా బీసీలకు 42 శాతం అవకాశాలు కల్పించడం. నియోజకవర్గాలను యూనిట్ గా తీసుకుని 42 శాతం బీసీలకు టిక్కెట్లు ఇస్తే.. అవకాశాలు కల్పించినట్లే. ఇతర పార్టీలు అలా చేస్తాయా లేదా అన్నది పక్కన పెడితే విమర్శలను కొంత మేర ఎదుర్కోవచ్చు. రేవంత్ ముందు ఉన్న మార్గం ఇదొక్కటే. ఎన్నికలు సజావుగా జరగాలంటే.. ఇలా ముందుకెళ్లాలి. ఇతర మార్గాల్లో వెళ్తే న్యాయపరమైన చిక్కుల్లో పడతాయి.