రూ.250 కోట్ల వ్యయంతో ఏపిలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు

ఆంధ్ర, తెలంగాణా ముఖ్యమంత్రులు పోటీలు పడి మరీ డా. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేస్తుండటం చూస్తుంటే “ఆత్మశుద్ధి లేని ఆచారమేలయా…చిత్తశుద్ది లేని శివపూజలేలయా” అనే వేమన పద్యం గుర్తుకు వస్తే తప్పు కాదు. ఎందుకంటే తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ దొరతనం ప్రదర్శిస్తూ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు తరచూ ఎదుర్కొంటూనే ఉన్నారు. అలాగే ఆంధ్రాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివిధ కులాలవారికిచ్చిన హామీలను అమలుచేయకుండా మోసం చేస్తున్నారని, ‘దళితులుగా పుట్టాలని ఎవరయినా కోరుకొంటారా?’ అని ప్రశ్నించి కించపరుస్తుంటారని ప్రతిపక్షాలు విమర్శిస్తుంటాయి. ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా బలహీన వర్గాలను ఓటు బ్యాంకులుగా మాత్రమే చూస్తున్నారు తప్ప మనుషులుగా చూడటం లేదని విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన డా. అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటుకు వారిద్దరూ పోటీలు పడటం విచిత్రంగానే ఉన్నా అది కూడా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమేననే ప్రతిపక్షాల నిశ్చితాభిప్రాయం.

దీని వెనుక వారి అంతర్యాలు ఏమయినప్పటికీ, దాని కోసం రెండు ప్రభుత్వాలు చాలా భారీ ఖర్చుకి సిద్దం కావలసి ఉంటుందని అందరికీ తెలుసు. దేశంలో తెలంగాణా రెండవ ధనిక రాష్ట్రమని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకటించుకొన్నారు కనుక దానికి ఎంత వ్యయం అయినా తెలంగాణా ప్రభుత్వం భరించగలదని సరిపెట్టుకోవచ్చు. కానీ విభజన కారణంగా నేటికీ డబ్బుకి కటకటలాడే పరిస్థితి నెలకొని ఉన్నప్పుడు, కేంద్రం ఆర్ధిక సహాయం చేస్తే నెల గడవని పరిస్థితులున్నప్పుడు, 125 అడుగులు ఎత్తుండే డా. అంబేద్కర్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడానికి రూ.250 కోట్లు ఖర్చుపెట్టాలనుకోవడం చాలా విస్మయం కలిగిస్తుంది.

ఆ మహనీయుడు చూపిన మార్గంలో నడుస్తూ సమాజంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కోసం ఆ డబ్బు ఖర్చు చేసి ఉంటే అందరూ హర్షించేవారు. బడుగు బలహీన వర్గాల ప్రజలను ఆకట్టుకోవడానికి లేదా కేవలం తమకి మాత్రమే వారి పట్ల శ్రద్దాసక్తులున్నాయని చాటుకోవడానికి చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా రూ.250 కోట్లు వ్యయంతో డా. అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకోవడం విస్మయం కలిగిస్తుంది.

రాష్ట్రంలో వివిధ కులాల ప్రజల సంక్షేమం, అభ్యున్నతి కోసం అవసరమయిన నిధులు కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వం తగినంత డబ్బు లేదని చెపుతోంది. కానీ డా. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకి రూ. 250 కోట్లు ఖర్చు చేయడానికి సిద్దం అవుతోంది. మహోన్నతమయిన డా. అంబేద్కర్ గురించి ఎవరూ కొత్తగా ప్రపంచానికి పరిచయం చేయనవసరంలేదు. కనుక ఆయనకు ఆరడుగుల విగ్రహం ఏర్పాటు చేసినా, 125 అడుగులు ఎత్తున్న విగ్రహం ఏర్పాటు చేసినా ఆయన పేరు ప్రతిష్టలకు, గౌరవానికి ఎటువంటి తేడా రాదని అందరికీ తెలుసు. కానీ రెండు ప్రభుత్వాధినేతలు పోటీలుపడి ఆయన విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొంటున్నట్లుగానే ఆయన పేరు చెప్పుకొని సమాజంలో బడుగు, బలహీన వర్గాల ఓట్లు దండుకొనే ప్రయత్నమేనని చెప్పక తప్పదు. అంత పెద్ద విగ్రహాలు ఏర్పాటు చేసిన బడుగు, బలహీన వర్గాలు ప్రభుత్వం పట్ల అసంతృప్తి చెందితే ముఖ్యమంత్రులు ఆశించిన ప్రయోజనం పొందలేరు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్ధిక సమస్యల నుంచి బయటపడాలంటే కేంద్రం సహాయం చాలా అవసరమని ముఖ్యమంత్రి మొదలు తెదేపా ఎమ్మెల్యేల వరకు అందరూ నిత్యం కోరస్ పాడుతూనే ఉంటారు. మళ్ళీ ఇటువంటి భారీ ఖర్చులు చేయడానికి వెనుకాడరు. అందుకే కేంద్రం కూడా ఏపికి నిధులు విదిలించడం లేదు. డా.అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు ప్రజల భావోద్వేగాలతో ముడిపడున్న వ్యవహారం కనుక దీని గురించి కేంద్రప్రభుత్వం బహిరంగంగా ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకపోవచ్చు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధుల మంజూరు విషయంలో ఇకపై మరింత కటినంగా వ్యవహరించవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com