అభిమానులే హీరోలకు బలం. వాళ్లే ఒక్కోసారి బలహీనతగా మారుతుంటారు. ఫ్యాన్స్ అసోసియేషన్లు మానేజ్ చేయడం ఓరకంగా హీరోలకు తలనొప్పి. ఇవన్నీ అనార్గనైజ్డ్ వ్యవస్థలు. వీటిని క్రమబద్దీకరణ చేయాలని హీరోలు చాలాసార్లు ప్రయత్నించారు. కానీ కుదర్లేదు. ఈతరం హీరోలైతే.. అభిమాన సంఘాల్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. అభిమానులపై ప్రేమ ఉంది కానీ, సంఘాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఇచ్చినా లోపాయకారిగా ఇస్తుంటారు. బయటకు పెద్దగా చెప్పుకోరు. ఎందుకంటే ఫ్యాన్ వార్స్ పెరిగిపోవడానికి అది కూడా ఓరకంగా దోహదం చేసే ప్రమాదం ఉంది.
కానీ అల్లు అర్జున్ స్టైల్ మాత్రం వేరు. తన ఫ్యాన్స్కి ఆర్మీ అనే పేరు పెట్టారాయన. అంతేకాదు.. ఫ్యాన్స్ అసోసియేషన్ ని ఆర్గనైజ్డ్ చేయాలనుకొంటున్నారు. ఈరోజు అల్లు అర్జున్ రాయలసీమ ఫ్యాన్స్ అసోసియేషన్ యాక్టివేట్ అయ్యింది. రాయలసీమలో కూడా బన్నీ ఫ్యాన్స్ అసోసియేషన్ ఏర్పాటు అయ్యిందన్నట్టు బన్నీ పీఆర్ టీమ్ ఓ ప్రకటన, ఫొటో విడుదల చేసింది. ఫ్యాన్సతా యూనిఫామ్ లో ఉన్నారు. వాళ్లందరికీ అదో డ్రస్ కోడ్ అన్నట్టు.. అంతా ఒకే డ్రస్ లో కనిపించారు. ఫ్యాన్స్ ఇలా డ్రస్ కోడ్ లో కనిపించడం ఒక రకంగా కొత్తగా అనిపించింది. మరోవైపు.. ఇంత హంగామా అవసరమా? అనే ప్రశ్నలూ తలెత్తుతున్నాయి.
అభిమాన సంఘాలు, వాళ్లకు హీరోల తరపున ప్రోత్సాహకాలు అనేవి లోపాయకారిగా, లోలోపల జరిగితే బాగుంటుంది తప్ప, ఇలా బహిరంగంగా ప్రకటించుకోవడం తప్పుడు సంకేతాల్ని పంపినట్టు అవుతుందన్న విమర్శ గట్టిగా వినిపిస్తోంది. ఏం చేసినా సమ్ థిమ్ స్పెషల్ గా కనిపించాలన్నది బన్నీ ఉద్దేశం. ఈసారి అదే ట్రెండ్ ఫాలో అయ్యారు. కాకపోతే.. ఈ విషయాన్ని నెగిటీవ్ కోణంలో చూస్తున్నారంతా. మరి బన్నీ ఫ్యాన్స్ ఏమంటారో?
