తాగించడానికి నీళ్ళు కొనలేక, సంతల్లో పశువుల్ని తెగనమ్ముకుంటున్న నిస్సహాయ రైతులు …మంచి నీటి కోసం మైళ్ళకు మైళ్ళు నడిచి వెళ్ళే మహిళలు… పనులు లేక పోట్ట చేత పట్టుకొని గల్ఫ్ దేశాలకో, బెంగుళూరు చెన్నై లకో వలస వెళ్ళే కూలీలు…ఇవన్నీ రాయలసీమలో కరువుకి సాక్ష్యాలు. వాననీరు లేక, చాలక సాగు మొదలుకాకుడానే సీమలో ఖరీఫ్ సీజన్ ముగిసిపోయింది. తాగునీటికే ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంతగా ప్రజలు కటకట లాడిపోతున్నారు.
చిత్తూరు జిల్లాలో 2500 పల్లెల్లో ట్యాంకర్లతో తాగునీరు సరఫరా చేస్తున్నారు.అనంతపురం జిల్లాలో 600, కడప జిల్లాలో 500 పల్లెలకు ట్యాంకర్లతో నీళ్లు తోలుతున్నారు. పట్టణాల్లోనూ ఇదే దుస్థితి. మంచినీటి పథకాల్లో వారం పది రోజులకు ఒక సారి నీళ్లు వదులుతున్నారు. ట్యాంకరు నీళ్లు రూ.350 నుంచి రూ.500లకు కొనుగోలు చేస్తున్నారు. ఒకప్పుడు రైతులు కరువులో మేత కరువై పశువులను కబేళాలకు అమ్మేసేవారు. ఇప్పుడు మంచినీళ్లు అందించలేక వాటిని సంతలో అమ్మేస్తున్నారు. గ్రామానికి ఒకటో రెండో పని చేస్తున్న వ్యవసాయ బోర్లను తాగునీటి అవసరాలకు వినియోగిస్తున్నారు.ఏడాదిగా అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో మూడు లక్షలు, కడప, కర్నూలు జిల్లాలో లక్ష వ్యవసాయ బోర్లు ఎండిపోయివుంటాయని అంచనా.
చిత్తూరు జిల్లాలో దాదాపు 10 వేల ఎకరాల్లో మామిడి తోటలు ఎండిపోయాయి. దీని ఫలసాయం లెక్కిస్తే దాదాపు 600 కోట్ల రూపాయలు. కడప జిల్లాలో మామిడి, బత్తాయి, నిమ్మతోటలు కరువుబారిన పడ్డాయి. మరో 30 వేల ఎకరాలలో ఉద్యాన పంటలు కరువు కోరల్లో చిక్కుకున్నాయి. అనంతపురం జిల్లాలో.. 50 వేల ఎకరాల్లో బత్తాయి తోటలు ఎండిపోతున్నాయి.
కరువు తరముతుంటే.. ఉపాధి కోసం ఒక్క అనంతపురం జిల్లా నుంచి రెండు లక్షల మంది వలస వెళ్లివుంటారని అంచనా. చిత్తూరు పడమటి మండలాల్లో గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. కడప, కర్నూలు జిల్లాల్లోనూ వలసలు తీవ్రంగా ఉన్నాయి. ఇక్కడి నుంచి బెంగళూరు, చెన్నై నగరాలకు వెళ్లి జీవనం సాగిస్తున్నారు. ఉపాధి హామీ పథకం ఉన్నా వలసలను ఆపేంతగా పని చేయడం లేదు.
వర్షపాతం, భూగర్భజలాలు అతి తక్కువగా ఉన్న రాయలసీమలో నదీజలాల తోడ్పాటు కూడా అంతంత మాత్రమే. ప్రతి మూడేళ్ళకీ సీమలో వర్షాభావ దుర్భిక్షమే సీజన్ల తరబడి అదేస్ధితి కొనసాగితే అదే కరువు. రాయలసీమలో ఇంతవరకూ 25 భయంకరమైన 25 కరువులు వచ్చాయి. వాటిలో డొక్కల కరువు, పెద్ద కరువు, ధాతు కరువు, దూడ కరువు, వలస కరువు, ముష్టి కరువు లాంటి లాంటివి ప్రధానమైనవి. ప్రస్తుతం రాయల సీమ దుర్భిక్షం ఒకప్పటి గంజి కరువును మించేలా వుందని పెద్దలు చెబుతున్నారు.