కుమారుడ్ని టార్గెట్ చేసి.. డీఎస్‌ను కార్నర్ చేస్తున్నారా..?

నిజామాబాద్ శాంకరీ కాలేజీకి చెందిన కొంత మంది విద్యార్థినులు నిన్న హఠాత్తుగా తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చాంబర్‌లో ప్రత్యక్షమయ్యారు. తమ కాలేజీ యజమాని… అయిన సంజయ్.. తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని కన్నీళ్లు పెట్టుకున్నారు. తన గదిలోకి రావాలని బలవంత పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడని వారంతా హోంమంత్రికి ఫిర్యాదు చేశారు. వీరి వెంట ప్రగతి శీల మహిళా సంఘం నేత.. సంధ్య కూడా ఉన్నారు. వెంటనే హోం మంత్రి.. అక్కడ్నుంచి డీజీపీ మహేందర్ రెడ్డికి ఫోన్ చేశారు. విషయం చెప్పారు. డీజీపీ వెంటనే.. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని నిజామాబాద్‌ సీపీని ఆదేశించారు. ఈ మొత్తం వ్యవహారంలో క్రైం యాంగిల్‌ కనబడుతున్నా.. అంతర్లీనంగా రాజకీయం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఎందుకంటే.. ఈ శాంకరీ కాలేజీ, ఆ కాలేజీ యజమాని సంజయ్.. ఎవరో కాదు.. ఇటీవలే టీఆర్ఎస్‌కు దూరం అయిన.. రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ పెద్ద కుమారుడు. ఒకప్పుడు నిజామాబాద్ మేయర్‌గా కూడా పని చేశాడు. కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధమయ్యారనే ప్రచారం జోరుగా సాగడంతో.. నిజామాబాద్ నేతలంతా..డీఎస్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కేసీఆర్‌కు లేఖ రాశారు. ఆ తర్వాత డీఎస్… సీఎంను కలిసి తన వెర్షన్ వినిపిద్దామనుకున్నారు కానీ అవకాశం దక్కలేదు. ప్రచారం జరిగినట్లు కాంగ్రెస్‌లోకి వెళ్లలేదు. అంటే డీఎస్ టీఆర్ఎస్‌లో సాంకేతికంగా ఉన్నారు కానీ.. ఆయన లేనట్లే. కాంగ్రెస్‌లో చేరిక కూడా … ఖరారు కాలేదు. చిన్నకుమారుడు బీజేపీలో ఉండటంతో… ఆ పార్టీతోనూ చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే హఠాత్తుగా.. సంజయ్ విషయం తెరపైకి వచ్చింది.

సంజయ్ క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తేం కాదు. గతంలోనూ కొన్ని ఆరోపణలు ఉన్నాయి. కాకపోతే.. ఈ మధ్య కాలంలో లేవు. నిజంగా విద్యార్థినులను వేధించి ఉంటే.. వారు నిజామాబాద్‌లోనే పోలీసులకు ఫిర్యాదు చేసి ఉండవచ్చు. నేరుగా హోంమంత్రి దగ్గరకు రావాల్సిన అవసరం లేదు. అక్కడి పోలీసులు వినిపించుకోరా.. అంటే.. అక్కడ అధికారం మొత్తం.. టీఆర్ఎస్ చేతుల్లోనే ఉంది. డీఎస్ టీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు కూడా.. నిజామాబాద్‌లో కనీసం ఓ వీఆర్వోను కూడా బదిలీ చేయించుకోగలిగే అధికారం చెలాయించలేకపోయారు.ఈ మొత్తం వ్యవహారం చూస్తే.. డీఎస్ అనుచరులు మాత్రం…. తమ నాయకుడ్ని కార్నర్ చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. కుమారుడిపై కేసులు పెడతామని బెదిరించడానికే.. ఈ వ్యవహారమంటున్నారు. మరి ఈ వ్యవహారం ఏ మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com