దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రస్తుతం అత్యంత క్లిష్ట దశను ఎదుర్కొంటోంది. గత కొన్నేళ్లుగా రికార్డు స్థాయి వృద్ధిని చూసిన ఈ రంగం, యుద్ధ పరిణామాలతో ఒక్కసారిగా కుప్పకూలింది. దుబాయ్ రియల్ ఎస్టేట్ ఇండెక్స్ కేవలం రెండు వారాల వ్యవధిలోనే 30 శాతం మేర పతనమై 2026 ప్రారంభంలో సాధించిన లాభాలన్నింటినీ కోల్పోయింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైన తర్వాత పెట్టుబడిదారులు ఒక్కసారిగా వెనక్కి తగ్గడంతో మార్కెట్ నిశ్చలమైపోయింది. గోల్డ్ మన్ సాక్స్ నివేదిక ప్రకారం, మార్చి మొదటి పక్షం రోజుల్లో రియల్ ఎస్టేట్ లావాదేవీల వాల్యూమ్ గతేడాదితో పోలిస్తే 37 శాతం తగ్గిపోయింది. ఒకప్పుడు పెట్టుబడులకు సురక్షిత స్వర్గధామంగా ఉన్న దుబాయ్, ఇప్పుడు యుద్ధ నీడలో ఉండటంతో ఇన్వెస్టర్లు తమ మూలధనాన్ని కాపాడుకునేందుకు ఆస్తులను విక్రయించడానికి సిద్ధపడుతున్నారు.
యుద్ధానికి ముందు, అంటే జనవరి 2026లో దుబాయ్ మార్కెట్ రూ.1.6 లక్షల కోట్ల రికార్డు స్థాయి విక్రయాలతో కళకళలాడింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల వచ్చిన పెట్టుబడులతో ధరలు ఆకాశాన్నంటాయి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ముఖ్యంగా ఎమార్ వంటి దిగ్గజ డెవలపర్ల షేర్లు దుబాయ్ స్టాక్ మార్కెట్లో 26 శాతానికి పైగా పడిపోయాయి. విమానాశ్రయాలపై దాడులు, ప్రాంతీయ అస్థిరత కారణంగా కొత్త ప్రాజెక్టుల లాంచింగ్లు నిలిచిపోయాయి.
ఇక అద్దెల మార్కెట్ పరిస్థితి మరీ విచిత్రంగా ఉంది. గతంలో ఏటా 15-20 శాతం పెరిగే అద్దెలు, ఇప్పుడు 4 నుండి 6 శాతానికి పడిపోయాయి. కొత్తగా భారీ సంఖ్యలో అపార్ట్మెంట్లు అందుబాటులోకి రావడం ఒక కారణమైతే, యుద్ధం వల్ల జనాభా పెరుగుదల రేటు 4 శాతం నుండి 1 శాతానికి పడిపోవచ్చని అంచనా వేస్తున్నారు. దీనివల్ల అద్దెదారులు ఇప్పుడు బేరసారాలు చేసే స్థితికి వచ్చారు. డిమాండ్ తగ్గడంతో లగ్జరీ ఏరియాల్లో కూడా అద్దెలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇది ప్రాపర్టీ యజమానులకు పెద్ద దెబ్బగా మారింది.
యుద్ధం రేపు ఆగిపోయినా, దుబాయ్ కోల్పోయిన సురక్షితమైన పెట్టుబడి కేంద్రం అనే ఇమేజ్ను తిరిగి పొందడం అంత సులభం కాదని రియల్ ఎస్టేట్ నిపుణులు భావిస్తున్నారు. సిటీ గ్రూప్ వంటి సంస్థలు దుబాయ్ జనాభా వృద్ధిపై తమ అంచనాలను తగ్గించేశాయి. భవిష్యత్తులో యుద్ధం ముగిసినా, మళ్ళీ ఎప్పుడు గొడవలు మొదలవుతాయోననే భయం ఇన్వెస్టర్లను వెన్నాడుతూనే ఉంటుంది. ఈ అనిశ్చితి వల్ల ప్రాపర్టీ ధరలు వచ్చే మూడేళ్లలో ఏటా 7 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దుబాయ్ రియల్ ఎస్టేట్ మళ్ళీ పాత వైభవాన్ని చూడాలంటే అది కేవలం కాలమే నిర్ణయించాలి.
