హీరోలు దుల్కర్ సల్మాన్, రానా కలిసి ఓ సినిమా నిర్మించారంటేనే తప్పకుండా అటువైపు కళ్లన్నీ వెళ్లిపోతాయి. వాళ్లిద్దరూ నిర్మించడం మాత్రమే కాదు. నటించారు కూడా. ఆ సినిమానే ‘కాంత’. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. ఈనెల 14న విడుదల అవుతోంది. ఇప్పుడు ట్రైలర్ వదిలారు. 3 నిమిషాల నిడివి ఉన్న ట్రైలర్ ఇది. దాదాపుగా కథంతా చెప్పే ప్రయత్నం చేశారు.
‘ఒక కథ ఎప్పుడు చెప్పాలన్నది ఆ కథేరా నిర్ణయిస్తుంది’ అనే సముద్రఖని డైలాగ్ తో ఈ ట్రైలర్ ప్రారంభమైంది.
‘ఒక న్యూస్.. దాని తరవాత వచ్చిన ఒక ఫోన్ కాల్… ఎవ్రిథింగ్ ఛేంజ్’
‘ఈ సినిమా ఇచ్చే డబ్బు పేరు ఖ్యాతి ఇవన్నీ నిన్ను పాడు చేసేశాయ్’ లాంటి డైలాగులు ఈ కథలోని ఎమోషన్ ని, డెప్త్ ని తెలియజేస్తాయి. బ్యాక్ గ్రౌండ్ లో `ఈ అద్భుతమే` అని పాట.. అందులోని మెలోడీ హాయిగా మనసుల్ని తాకుతుంది.
చిత్రసీమ నేపథ్యంలో సాగే కథ ఇది. ఓ హీరోకీ, దర్శకుడికీ మధ్య క్లాష్ వస్తుంది. ఆ క్లాష్ ఈ కథని ఎలాంటి మలుపులు తిప్పిందన్నదే `కాంత`. ఎమోషనల్ గా మొదలై, థ్రిల్లర్ టర్న్ తీసుకొన్నట్టు ట్రైలర్ లో అర్థమవుతోంది. హీరోగా దుల్కర్, దర్శకుడిగా సముద్రఖని నటించారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా రానా ఎంట్రీ ఇచ్చారు. రానా గెటప్ బాగుంది. దుల్కర్ ని చూస్తుంటే `మహానటి` ఫ్లేవర్ కనిపిస్తోంది. ఓ హీరో బయోపిక్ చూస్తున్నట్టు అనిపించింది. తెలుగు సినిమాలా అనిపించదు కానీ, ఓ డబ్బింగ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. బహుశా తమిళంలో ఈ సినిమా తెరకెక్కించి, తెలుగులో డబ్ చేసి ఉంటారు. టెక్నికల్ గా స్ట్రాంగ్ గా ఉంది. బ్లాక్ అండ్ వైట్ లో కూడా కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కించారు. ట్రైలర్ చూస్తున్నప్పుడు సినిమా కూడా చూడాలన్న ఫీలింగ్ కలగాలి. అదే ట్రైలర్ ఉద్దేశ్యం అయితే ఈ ట్రైలర్ కట్.. దాన్ని నెరవేర్చింది.