ఏపీ సర్కార్‌కు “ఈ- కేవైసీ” శాపనార్థాలు ఎక్స్‌ట్రా..!

ఏపీ సర్కార్ తెలిసి చేస్తుందో.. తెలియక చేస్తుందో.. కానీ… ప్రజలను రోడ్డున పడే కార్యక్రమాలు చాలా ఉధృతంగా చేస్తోంది. సర్కార్ ఏర్పడగానే.. ఇసుకను నిలిపి వేసి.. లక్షల మంది భవన నిర్మాణ కూలీలను… రోడ్డున పడేసింది. విత్తనాలు ఇవ్వలేక రైతులను పడిగాపులు పడేలా చేసింది. ఇప్పుడు… నిరుపేదల కుటుంబాలను… ఈ సేవా కేంద్రాల వద్ద కాపురం పెట్టేలా చేసింది. “ఈ- కేవైసీ” పేరుతో డెడ్‌లైన్లు పెట్టడంతో.. పరిస్థితి అదుపుతప్పుతోంది.

రేషన్ కార్డు “రత్నం” నిలుపుకునేందుకు క్యూలు..!

ఏపీలో నవరత్నాలు పొందాలంటే… ముందుగా.. రేషన్ కార్డు అనే రత్నాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది కాపాడుకోవాలంటే.. “ఈ- కేవైసీ” చేయించుకోవాలని.. ప్రభుత్వం ఆదేశాలిచ్చారు. ఇది ఓ మిస్డ్‌కాల్‌తో అయ్యే పని కాదు. పడిగాపులు పడాల్సిన పని. వైట్ రేషన్ కార్డు ఉండటమే కాదు.. అందులో పేర్లున్న వారంతా.. “ఈ- కేవైసీ” చేయించుకోవాలని.. లేకపోతే.. కార్డు కట్ అని ప్రభుత్వం ప్రకటించేసింది. కొత్త ప్రభుత్వం ఆదేశాలతో లబ్ధిదారులు పరుగులు తీస్తున్నారు. నమోదు కేంద్రాల సంఖ్య అరకొరగా ఉండటం… లక్షల్లో రేషన్ కార్డు దారులు ఉండటంతో… ఆందోళన ప్రారంభమయింది.

“ఈ- కేవైసీ” కోసం పేదల పడిగాపులు..!

“ఈ- కేవైసీ” నమోదు పూర్తవకపోతే రేషన్ నిలిపివేస్తారేమోననే భయంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మీ సేవ, తపాల కార్యాలయాలు, రేషన్ దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. తెల్లవారుజాము నుంచే ఆయా ప్రాంతాలలోని కేంద్రాలకు వచ్చి పడిగాపులు కాస్తున్నారు. రేషన్ కార్డుల్లో ఇతర పేర్లు చేర్చారని కొందరు, తమకు ఎలాంటి వాహనం లేకున్నా కారు ఉన్నట్లు నమోదయిందని మరికొందరు, రేషన్ దుకాణంలో పంచ్ పడలేదని దీంతో రేషన్ ఇవ్వడంలేదని, మళ్లీ ఆధార్ లో నమోదు చేయించుకోవాలని మరికొందరు కేంద్రాలకు వస్తున్నారు. లబ్దిదారుల వేలిముద్రలు సరిగ్గా లేకపోతే తిరస్కరిస్తున్నారు. ఈ నేపధ్యంలో ప్రతిఒక్కరూ ఆధార్ ను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాల్సి ఉంది. గతంలో ఆధార్ నమోదు చేసినప్పుడు ఎనిమిదేళ్ల పిల్లల వేలిముద్రలు ఇప్పుడు మారిపోయాయి. దీంతో 15ఏళ్ల వయస్సులో వారు మరోసారి ఆధార్ కేంద్రాలకు వెళ్లి వేలిముద్రలు నమోదు చేయించుకోవాలి. ఒక్క ఆధార్ నమోదు కేంద్రంలో సర్వర్ బాగా పనిచేస్తే రోజుకు 20నుంచి 25మందికి మాత్రమే అవకాశం అభిస్తుంది.

పథకాల అర్హులను ఏరివేసే ప్రయత్నమా..?

ప్రజలకు కొత్త సర్కార్ తెచ్చి పెట్టిన కేవైసీ ఇబ్బందులపై… ప్రతిపక్షం ఘాటుగా స్పందిస్తోంది. ఒక నిర్ణయం తీసుకుంటే ముందు ప్రజలకు అవగాహన కల్పించాలని.. అలా కాకుండా.. ఈకేవైసీ చేయించుకోకపోతే .. పథకాలకు అర్హత ఉండదనే భయాన్ని ప్రజల్లో కల్పించారని మండిపడ్డారు. లబ్ధిదారులని వీలైనంత వరకు ఏరిపారేయాలనే కుట్ర చేశారని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లబ్దిదారుల ఆందోళన కూడా అంతే ఉంది. తమ కార్డులను తీసేసి.. నవరత్నాలు రాకుండా చేస్తారేమోనని వారు ఆందోళన చెందుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com