ఎన్నికల సంఘం విశ్వసనీయతను దెబ్బతీస్తూ ఓట్ల చోరీ అంటూ రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలపై ఎన్నికల కమిషనర్లు కూడా పోరాటానికి సిద్ధమయ్యారు. రాహుల్ గాంధీ తాను చేస్తున్న ఆరోపణలపై ప్రమాణం చేస్తూ అఫిడవిట్ అయినా ఇవ్వాలని లేదా క్షమాపణ అయినా చెప్పాలని ఎన్నికల సంఘం కమిషనర్లు ప్రెస్‌మీట్ పెట్టి మరీ స్పష్టం చేశారు. ఎన్నికల సంఘానికి ఎలాంటి ఉద్దేశాలు ఉండవని .. ధనిక, పేద తారతమ్యాలు అసలు చూడమన్నారు.
బీహార్‌లో ఓట్ల గణన పూర్తిగా పారదర్శకంగా జరిగిందని స్పష్టం చేశారు. పోలింగ్ బూత్‌ల వారీగా ఓటర్ల జాబితాలను ప్రకటిస్తారని.. ప్రతి పోలింగ్ బూత్‌లో రాజకీయ పార్టీలకు ఓటర్ల జాబితా అందుబాటులో ఉంటుందన్నారు. అందులో ఏమైనా తప్పులు ఉంటే ఎప్పటికప్పుడు రాజకీయ పార్టీలు ఈసీ దృష్టికి తీసుకు వచ్చేందుకు అవకాశం ఉందన్నారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకుని సిద్ధం చేస్తున్న ఓటర్ జాబితాపై.. నిందలు వేస్తూ.. ఓటు చోరీ అంటూ ప్రచారం చేయడం సరి కాదని స్పష్టం చేసింది.
రాహుల్ గాంధీ పూర్తిగా బీజేపీపై కాకుండా.. ఈసీపైనే పోరాటం చేస్తున్నారు. ఎన్నికల సంఘం .. విశ్వసనీయతను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు.. ఓట్ల చోరీ అంటూ ఆయన చేస్తున్న ఆరోపణల్లో నిజం ఉందని ఆయన అంగీకరించడానికి సిద్ధంగా లేరు. ఈడీ అడిగినట్లుగా తాను చెప్పినవన్నీనిజాలేనని ఆయన ప్రమాణం చేసేందుకు సిద్ధంగా లేరు. దీంతో ఈసీ రాహుల్ పై న్యాయపరమైన చర్యలకు సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది. వారం రోజుల తర్వాత ఈసీకి ఉన్న విశేషాధికారాలతో ఆయన పై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
మరో వైపు బీహార్‌లో తొలగించిన 65 లక్షల తొలగించిన ఓటర్ల జాబితాను ఈసీ అప్ లోడ్ చేయాల్సి ఉంది. ఆ తర్వాత ఓట్ల చోరీ ఆరోపణల రాజకీయం కీలక మలుపులు తిరిగే అవకాశం ఉంది.