ఒకప్పుడు ప్రపంచ కుబేరుల జాబితాలో వెలిగిపోయిన రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముంబైలోని ఆయన నివాసం అబోడ్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ ద్వారా జరిగిన బ్యాంక్ రుణాల మళ్లింపు కేసులో ఈ జప్తు చేశారు.
వేల కోట్ల విలువైన విలాసవంతమైన భవనం
ముంబైలోని పాలి హిల్లో ఉన్న అనిల్ అంబానీ నివాసం అబోడ్ అత్యంత విలాసవంతమైన భవనాల్లో ఒకటి. ఈ 17 అంతస్తుల నివాసం విలువ సుమారు 3,716 కోట్లుగా ఈడీ అంచనా వేసింది. బ్యాంకులకు చెల్లించాల్సిన వేల కోట్ల రూపాయల రుణాలను దారి మళ్లించి, ఈ ఆస్తులను ఒక ఫ్యామిలీ ట్రస్ట్ పేరు మీదకు మార్చడం ద్వారా వ్యక్తిగత గ్యారెంటీ బాధ్యతల నుండి తప్పించుకోవాలని చూశారనేది ప్రధాన ఆరోపణ. ఇప్పటివరకు ఈ కేసులో అనిల్ అంబానీకి చెందిన దాదాపు రూ. 15,700 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.
వేల కోట్ల అప్పులు – బ్యాంకుల బాకీలు
అనిల్ అంబానీ నాయకత్వంలోని రిలయన్స్ గ్రూప్ కంపెనీలు భారీ రుణ ఊబిలో కూరుకుపోయాయి. ప్రధానంగా రిలయన్స్ కమ్యూనికేషన్స్ , దాని అనుబంధ సంస్థలు భారతీయ, విదేశీ బ్యాంకుల నుండి తీసుకున్న రుణాల్లో సుమారు రూ. 40,185 కోట్లు బకాయి పడ్డాయి. ఇప్పటికే ఎస్బీఐ వంటి బ్యాంకులు ఈ అప్పులను ఫ్రాడ్ కేటగిరీ కింద వర్గీకరించాయి. గతంలో చైనా బ్యాంకుల కేసులో తన నికర ఆస్తి విలువ సున్నా అని అనిల్ అంబానీ కోర్టుకు తెలపడం అప్పట్లో సంచలనం సృష్టించింది.
కోలుకోలేకపోతున్న అనిల్ అంబానీ వ్యాపారాలు
టెలికాం రంగంలో ఒకప్పుడు రారాజుగా వెలిగిన అనిల్ అంబానీ వ్యాపారాలు ప్రస్తుతం అత్యంత క్లిష్ట దశలో ఉన్నాయి. రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఇప్పటికే దివాలా ప్రక్రియ లో ఉంది. రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ , రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ వంటి కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నప్పటికీ, వాటిపై వేల కోట్ల అప్పుల భారం ఉంది. స్టాక్ మార్కెట్లో ఈ కంపెనీల షేర్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. నిధుల మళ్లింపు ఆరోపణలపై సీబీఐ దాఖలు చేసిన రెండు ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ లోతైన దర్యాప్తు చేస్తోంది.
వేరు పడ్డాక.. ఎగసిపడిపోయారు !
అన్న ముఖేష్ అంబానీతో విభేదాల తర్వాత 2005లో వేరుపడిన అనిల్ అంబానీ, ఆ సమయంలో అత్యంత శక్తివంతమైన వ్యాపారవేత్తగా ఉండేవారు. కానీ, తప్పుడు నిర్ణయాలు, పెరిగిపోయిన అప్పులు ఆయనను ఇప్పడు కోర్టులు, దర్యాప్తు సంస్థల చుట్టూ తిరిగేలా చేశాయి. ఇప్పుడు సొంత ఇల్లు కూడా జప్తు కావడం ఆయన పతనానికి పరాకాష్టగా మారింది. అత్యంత కుబేరుడి ట్యాగ్ ను కోల్పోయి.. ఏమీ లేని స్థితికి..ఆస్తుల జప్తు వరకూ అనిల్ అంబానీ దిగజారిపోయారు.కానీ ముకేష్ అంబానీది మాత్రం డిఫరెంట్ స్టోరీ.
