ఏపీ లిక్కర్ స్కామ్లో ఎన్ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ మెల్లగా వేగం పెంచుతోంది. ఇప్పటికే ఏపీ సీఐడీ నుంచి వివరాలు తీసుకుని కేసులు నమోదు చేసిన ఈడీ.. ఇప్పుడు రాజ్ కసిరెడ్డి వాంగ్మూలం నమోదు చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ మేరకు విజయవాడ ఏసీబీ కోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. ఏ1 రాజ్ కేసీ రెడ్డి వాంగ్మూలం తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఈడీ తరఫున న్యాయవాది జయప్రకాశ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై శుక్రవారం విచారణ జరిగే అవకాశం ఉంది.
రాజ్ కసిరెడ్డి ఏపీ లిక్కర్ స్కాంలో కీలక నిందితుడిగా ఉన్నారు. చాలా రోజుల పాటు సీఐడీతో ఆటాడిన తరవాత పోలీసులకు చిక్కాడు. అప్పట్నుంచి జైల్లో ఉన్నారు. రాజ్ కెసిరెడ్డిని ముందు పెట్టి సూత్రధారులు స్కామ్ ను నడిపించారు. వేల కోట్లు దోచుకున్నారు.ఈ వ్యవహారంలో అసలు సూత్రధారులు తప్పించుకుని రాజ్ కెసిరెడ్డిని ఇరికిస్తున్నారని ఆయన లాయర్లు అంటున్నారు.
ఏపీ లిక్కర్ స్కాంలో అసలు కేసు అంతా ఈడీలోనే ఉండే అవకాశం ఉంది. వేల కోట్లు దోపిడీ చేయడమే కాకుండా.. వాటిని వైట్ గా మార్చేందుకు వివిధ రకాల పద్దతుల్లో హవాలా చేశారు. ఈ హవాలా వ్యవహారంలో ఉన్న తీగలన్నీ దొరికాయని భావిస్తున్నారు. బాలాజీ గోవిందప్ప అనే ఆడిటర్ ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ వ్యవహారంలో ఈడీ పూర్తి స్థాయిలో దూకుడు చూపిస్తే .. చాలా మంది జైలుకెళ్లే అవకాశాలు ఉన్నాయి.