ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఎలాంటి ప్రమేయం లేదని స్పష్టం చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విశాఖపట్నంలోని పీఎంఎల్ఏ ప్రత్యేక కోర్టులో సప్లిమెంటరీ చార్జిషీటు దాఖలు చేసింది. రెండు రోజుల కిందట దాఖలు చేసిన ఈ చార్జిషీటులో, నిధుల మళ్లింపు లేదా నేరపూరిత కార్యకలాపాల్లో చంద్రబాబు ప్రమేయం ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు లభించలేదని ఈడీ స్పష్టంగా పేర్కొంది.
ఈడీ దర్యాప్తులో భాగంగా డిజైన్టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ , దానికి సంబంధించిన వ్యక్తులు షెల్ కంపెనీల ద్వారా ప్రభుత్వ నిధులను మళ్లించినట్లు గుర్తించింది. వికాస్ ఖన్వేల్కర్, సుమన్ బోస్ , ఇతరులు ఈ నిధులను సొంత ప్రయోజనాల కోసం వాడుకున్నారని తేల్చిన ఈడీ, సుమారు రూ.54.74 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. అయితే, ఈ ప్రక్రియలో లేదా నిధుల అక్రమ చలామణిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఎటువంటి సంబంధం లేదని ఈడీ తన సప్లిమెంటరీ చార్జిషీటులో తేల్చి చెప్పింది.
2023 సెప్టెంబర్లో జగన్ హయాంలో సీఐడీ కూడా కేసులు పెట్టింది. ఆయనను అరెస్టు చేసి 53 రోజుల పాటు జైలులో పెట్టింది. కానీ ఒక్క రూపాయి ఆర్థిక లావాదేవీలను చూపించలేకపోయింది. తప్పుగా నమోదు చేసిన కేసుగా చివరికి గుర్తించి విజయవాడలోని ఏసీబీ కోర్టులో క్లోజర్ రిపోర్టును సమర్పించింది. చంద్రబాబుపై మోపిన ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదని సీఐడీ తన నివేదికలో వెల్లడించింది. ఈ నివేదికను అంగీకరించిన కోర్టు, జనవరి 13, 2026న చంద్రబాబుతో పాటు మరో 36 మందిపై ఉన్న కేసును అధికారికంగా కొట్టివేసింది.
ఈ పరిణామాలు రాజకీయంగా , న్యాయపరంగా చంద్రబాబుకు పెద్ద విజయంగా నిలిచాయి. ప్రభుత్వ నిధులను దారి మళ్లించి స్కామ్ చేశారన్న ఆరోపణలను కేంద్ర దర్యాప్తు సంస్థ, రాష్ట్ర దర్యాప్తు సంస్థ రెండూ తోసిపుచ్చడంతో, ఈ సుదీర్ఘ న్యాయ వివాదానికి దాదాపు తెరపడినట్లయింది.