తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లు కొత్తగా ఈడీ చిక్కుల్లో పడే సూచనలు కనిపిస్తున్నాయి. సోనియా, రాహుల్ గాంధీలపై నమోదు చేసిన నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్ లో వీరిద్దరి పేర్లు ఉన్నాయి. వీరిద్దరూ యాంగ్ ఇండియాకు విరాళాలు ఇప్పించారని.. ఇచ్చారని ఈడీ చెబుతోంది. నేషనల్ హెరాల్డ్ యాజమాన్య సంస్థ అయిన యంగ్ ఇండియా సంస్థకు రేవంత్ రెడ్డి ఏమీ విరాళాలు ఇవ్వకపోయినా ఆయన దాదాపుగా 80 లక్షలను పార్టీ నేతలతో విరాళం ఇప్పించారు.
డీకే శివకుమార్ కూడా ఇతర పార్టీ నేతలతో ఇప్పించడమే కాకుండా.. తాను కూడా పాతిక లక్షలు ఇచ్చినట్లుగా ఈడీ చెబుతోంది. వీరిద్దరి పేర్లను ఈడీ చార్జ్ షీట్ లో నమోదు చేశారు. ఇప్పటికే యంగ్ ఇండియాకు విరాళాలు ఇచ్చారంటూ పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతల్ని పిలిచి ఈడీ ప్రశ్నించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రెండు కీలక రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని నడిపే వారి పేర్లను చార్జిషీట్లో పెట్టడం సంచలనంగా మారింది.
అయితే విరాళాలు ఇవ్వడం లేదా ఇప్పించడం మనీ లాండరింగ్ ఎలా అవుతుందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వీరు కోర్టులో అదే వాదనలు వినిపించే అవకాశం ఉంది. ఈడీ చార్జిషీటుపై ఢిల్లీ కోర్టు.. త్వరలో రోజువారీ విచారణ చేపట్టనుంది.