తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యి కల్తీ వ్యవహారం ఇప్పుడు మరో కీలక మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో ఆర్థిక అక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయన్న ప్రాథమిక ఆధారాలతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగుతుండటం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. సిట్ చార్జిషీటు ఆధారంగా మనీలాండరింగ్ కేసు నమోదు చేసేందుకు ఈడీ సిద్ధమవుతోంది. ఇప్పటివరకు జరిగిన విచారణలో వందల కోట్ల రూపాయల కమిషన్లు చేతులు మారాయని దర్యాప్తు సంస్థలు ఒక అంచనాకు వచ్చాయి. ముఖ్యంగా నెయ్యి సరఫరా కాంట్రాక్టుల కేటాయింపులో జరిగిన అవకతవకలు, ఆ తర్వాత చేతులు మారిన భారీ సొమ్ముపై ఈడీ దృష్టి సారించనుంది.
చిన్న అప్పన్న నుంచి అసలు సూత్రధారుల వైపు..!
సిట్ దర్యాప్తు వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ చిన్న అప్పన్న దగ్గరే ఆగిపోయింది. అంత పెద్ద మొత్తంలో అక్రమ సొమ్ము గురించి వివరాలు బయటపడిన తర్వాత విచారణ కేవలం ఒక పీఏ స్థాయి వ్యక్తి దగ్గరే ఆగిపోయే అవకాశం లేదని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. ఈ సొమ్మును ఎక్కడికి తరలించారు? హవాలా రూపంలో విదేశాలకు పంపారా? లేదా ఇతర వ్యాపారాల్లోకి మళ్లించారా? అన్న కోణంలో ఈడీ లోతైన దర్యాప్తు జరపనుంది. చిన్న అప్పన్నను కేవలం ఒక లింక్ గా భావిస్తున్న ఈడీ, అసలు లబ్ధిదారులను పట్టుకునే దిశగా అడుగులు వేసే అవకాసం ఉంది.
తాడేపల్లి దగ్గరకు చేరుతుందా?
ఈ కేసులో ఈడీ ఎంట్రీ ఇవ్వడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం.. నిధుల మళ్లింపు వెనుక ఉన్న బిగ్ బాస్‌లను గుర్తించడమే. నెయ్యి సరఫరాదారుల నుంచి వసూలు చేసిన కమిషన్లు అంతిమంగా ఎవరికి చేరాయన్నది ఇప్పుడు అసలు ప్రశ్న. ఈ దర్యాప్తు గనుక పారదర్శకంగా, సీరియస్‌గా సాగితే ఆ సెగ తాడేపల్లి ప్యాలెస్ వరకు వెళ్లడం ఖాయమన్న అభిప్రాయం వినిపిస్తోంది. అక్రమ నగదు చలామణి కింద కేసు నమోదైతే, ఎంతటి వారికైనా అరెస్టు నుంచి తప్పించుకోవడం కష్టతరమవుతుంది.
ఆస్తుల అటాచ్మెంట్ దిశగా..!
కేవలం కమిషన్ల వివరాలు సేకరించడమే కాకుండా, ఈ అక్రమ సొమ్ముతో కొనుగోలు చేసిన ఆస్తులను జప్తు చేసే అధికారం ఈడీకి ఉంటుంది. కల్తీ నెయ్యి సరఫరా ద్వారా కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా, అలాంటి సొమ్ముతో ఆస్తులు కూడబెట్టిన వారిని వదలకూడదన్న పట్టుదలతో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దర్యాప్తు వేగవంతమైతే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించే అవకాశం ఉంది.
