“ నేను ఓడిపోతున్నానంటే కారణం నేను కాదు అంపైర్లు. నన్ను గెలిపించకపోతే కుట్ర జరిగినట్లే. నేను ఎలాగూ గెలవడం లేదు కాబట్టి జెన్ Z తరం అంతా తిరుగుబాటు చేసి నన్ను అప్రజాస్వామ్కంగా పీఠం మీద కూర్చోబెట్టండి” అని ఘనత వహించిన నెహ్రూ వారసుడు రాహుల్ గాంధీ ఇప్పుడు ఉద్యమం చేస్తున్నారు. ఇందు కోసం జెన్Z, యువతను రెచ్చగొట్టేందుకు దేశ ప్రజాస్వామ్యానికి పునాదులు అయిన వ్యవస్థల మీద దాడి చేస్తున్నారు. ఎన్నికల సంఘం, న్యాయవ్యవస్థ, సైన్యం ఇలా దేన్నీ వదిలి పెట్టడం లేదు. అన్నింటిపై ఆయన దాడి చేయడానికి దేశానికి రాచపుండులా పట్టి పీడిస్తున్న కులం అనే ఆయుధాన్ని వాడుకుంటున్నారు. యువనేతగా ప్రపంచంతో పాటు పరుగెత్తే ఆలోచనల్ని చేయాల్సిన రాహుల్ గాంధీ ఇలా పురాతన ఆలోచనలతో.. దేశ వినాశక కుట్ర రాజకీయాలతో రోజు రోజుకు కుంచించుకుపోతున్నారు.
దేశ ప్రజాస్వామ్య నాదులైన వ్యవస్థలపై రాహుల్ వ్యూహాత్మక దాడి
సైన్యాన్ని కేవలం పది శాతం కులాల వారే నియంత్రిస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. అదే సమయంలో న్యాయవ్యవస్థపైనా అదే మరక వేశారు. ఇప్పటికే ఎన్నికల సంఘం విశ్వసనీయతను దెబ్బతీయడానికి రాహుల్ గాంధీ చేస్తున్న ప్రయత్నాలు చాలా పెద్ద స్థాయిలో ఉంటున్నాయి. నిజానికి ఆయన రాజకీయంగా పోరాడాల్సింది భారతీయ జనతా పార్టీపైన. ఆ పార్టీ మత రాజకీయాలు చేస్తే రాహుల్ గాంధీ కులంతో కౌంటర్ ఇవ్వొచ్చు .కానీ ఆయన కుల రాజకీయాలు దేశంపై చేస్తున్నారు. వ్యవస్థలపై చేస్తున్నారు. అక్కడే దేశానికి పెను ప్రమాదం పొంచి ఉంది. వ్యవస్థలపై దేశ యువతలో అనుమానం పెంచడం ద్వారా అలజడి సృష్టించి శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ తరహాలో ప్రభుత్వాలను మార్చినట్లుగా మార్చాలని కోరుకుంటున్నారు. ఆయన ఆలోచనలు చాలా ప్రమాదకరంగా ఉన్నాయని సులువుగా అర్థం చేసుకోవచ్చు. రాహుల్ గాంధీ .. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలవకపోతే అది దేశానికి సమస్య అన్నట్లుగా ఆయన వ్యవహరించడం పూర్తిగా దారి తప్పారన్నదానికి నిదర్శనంగా ఉంది. అందుకే ఆయన కులాన్ని ఎంచుకుంటున్నారు. ఓట్ల చోరీ అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కాస్త పరిశీలిస్తే ఆయన వ్యూహాత్మకంగా దేశ ప్రజాస్వామ్య పునాదులపై బలంగా దాడి చేస్తున్నారని అనుకోవచ్చు.
సైన్యం ఆత్మస్థైర్యం దెబ్బతినేలా కులాల వ్యాఖ్యలు
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సైన్యంలో కులం ఆధిపత్యంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్త చర్చను రేకెత్తించాయి. నవంబర్ 4న బిహార్లోని కుటుంబా ర్యాలీలో మాట్లాడుతూ, ఆయన “దేశంలో 10 శాతం పై కులాలు సైన్యం, న్యాయస్థానాలు, అధికారం, వ్యాపారాలను నియంత్రిస్తుంది, మిగిలిన 90 శాతం దళితులు, OBCలు, మైనారిటీలకు ప్రాతినిధ్యం లేదు ” అని వ్యాఖ్యానించారు. అన్నిరంగాల్లోనూ జనాభా ప్రకారం హక్కు సూత్రాన్ని అమలు చేయాలని అయన అంటున్నారు. సైన్యం, న్యాయవ్యవస్థ అత్యంత కీలకమైన వ్యవస్థలు. సైన్యంలో కుల చిచ్చు పెట్టాలని రాహుల్ ప్రయత్నాలని అర్థం చేసుకోవచ్చు. భారత సైన్యం అర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ లో రిక్రూట్మెంట్ మెరిట్ ఆధారంగా జరుగుతుంది. రిజర్వేషన్లు ఉండవు. బ్రిటిష్ కాలంలో “మార్షల్ రేసెస్” పాలసీ ప్రకారం ఏర్పడిన రెజిమెంట్లు రాజ్పుత్, జాట్, సిక్ఖ్, మహార్ ఇప్పటికీ కొనసాగుతున్నాయి. వీటిలో నిర్దిష్ట కులాలు/కమ్యూనిటీల నుంచి ఎక్కువగా రిక్రూట్ చేసుకుంటారు. ఆర్మీ రిక్రూట్మెంట్లో 15-20 శాతం ఎస్సీ,ఎస్టీలు ఉంటారు. అఫీసర్ ర్యాంకుల్లో 10 శాతం మంది వరకూ ఉంటారు. ఆర్మీలో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్ 2014 నుంచి అమలులో ఉంది, కానీ రెజిమెంట్ల వల్ల పూర్తిగా అమలు కాలేదు. మొత్తం OBC ప్రాతినిధ్యం 20-25 శాతం ఉంటుది.ఉన్నత స్థాయికులాలు ఆఫీసర్ల ర్యాంకుల్లో యాభై శాతం ఉంటారు. ఆర్మీ సిపాయిల్లో 30 శాతం వరకూ ఉంటారు. అయితే ఇక్కడ ప్రతిభ ఆధారంగానే రిక్రూట్ మెంట్ ఉంటుంది. కులాల్ని చూసి ఎంపిక చేయరు. అయినా .. ప్రభావిత స్థాయిలో వారికి ప్రాధాన్యం లభిస్తోంది. ఆఫీసర్ల కేటగరిలో మాత్రం తక్కువగా ఉన్నారు. దీనికి కారణం ఏమిటి?. దశాబ్దాలుగా ఇతర వర్గాలను పైకికి తీసుకువచ్చే ప్రయత్నాల్లో ప్రభుత్వాలు ముఖ్యంగా దేశాన్ని ఏకబిగిన స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి అరవై ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్కు మెజార్టీ తప్పు చేసిన క్రెడిట్ దక్కుతుంది. సైన్యంలో ఏ కులం లేదు – దేశభక్తి, ధైర్యం, త్యాగం మాత్రమే ఉంటుంది. రాహుల్ గాంధీ ఈ విషయాన్ని గుర్తించి ..దేశానికి రక్షణగా ఉంటున్న ఆర్మీని రాజకీయాల్లోకి..కులాల సంఘర్షణలోకి లాగకుండా ఉండాల్సింది. కానీ ఆయనకు రాజకీయ స్వార్థమే ముఖ్యం.
దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలు ముందుకు రాలేకపోవడానికి కారణం కాంగ్రెస్ అసమర్థత !
దేశంలో ఇప్పుడు అన్ని రంగాల్లో అగ్రవర్ణాల ఆధిపత్యమే ఉందని బడుగు, బలహీనవర్గాలకు అవకాశాలు దక్కడం లేదని రాహుల్ అంటున్నారు. చివరికి అందాల పోటీల్లోనూ ఆయన కులాలు చూస్తున్నారు. ఇదే నిజం అయితే దీనికి కారణం ఎవరు అంటే ముందుగా వేలెత్తి చూపించాల్సింది ఆయన కుటుంబాన్నే. భారతదేశ స్వాతంత్ర్యానంతరం కాంగ్రెస్ పార్టీ 1947 నుంచి 2014 వరకు సుమారు 60 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉంంది. విధానాలు, చట్టాలు రూపొందించింది. దేశ ప్రజలందర్నీ సమానంగా అభివృద్ధి చేయడానికి, అంతరాలు లేని సమాజం సృష్టించడానికి ముఖ్యంగా.. బాగావెనుకబడిన వర్గాలకు ఇతర వారితో పాటు అవకాశాలు కల్పించేలా చేయాల్సిన వాతావరణం సృష్టించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పై పడింది. కానీ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమయింది. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలతోనే చట్టాలు చేసింది. ఇవి టార్గెటెడ్ గా కొంత మందిని మాత్రమే పైకి తెచ్చాయి. మళ్లీ మళ్లీ వారికే అవకాశాలు కల్పించాయి. కానీ ఇవి ఆయా వర్గాలను అభివృద్ధి చేయలేదు సరి కదా..మరింత దిగజార్చాయి. రిజర్వేషన్లు పొందినవారే పొందుతున్నారు. కానీ అవకాశాల రాని వారు ఇంకా వెనుకబడే ఉంటున్నారు. కాంగ్రెస్ పాలనలో డా.బి.ఆర్. అంబేడ్కర్ ప్రభావంతో ఎస్సీ,ఎస్టీలకు 22.5 శాతం రిజర్వేషన్లు ఉద్యోగాలు, విద్యలో అమలు చేశారు. 1990లో మండల్ కమిషన్ సిఫారసుల ఆధారంగా OBCలకు 27 శాతం కాంగ్రెస్ మద్దతు ఉన్న ను వీపీ సింగ్ ప్రభుత్వంలోఅమలు చేశారు. కానీ, కాంగ్రెస్ అధికారంలో ఉన్న 60 ఏళ్లలో ఈ వర్గాల స్థితిగతులు పెద్దగా మారలేదు. 1980ల్లో ఓబీసీలకు ఇంజనీరింగ్ కాలేజీల్లో కేటాయించిన సీట్ల సగం కూడా నిండేవి కావు. దీనికి కారణం ఆయా వర్గాల పిల్లలకు ప్రాధమిక విద్యే సరిగ్గా అందకపోవడం. కాంగ్రెస్ అరవై ఏళ్ల పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సమాన విద్య అందలేదు. అందుకే వారు ఎదగలేకపోయారు.
తమ వల్ల వెనుకబడిపోయిన వారిని దేశంపై పావులుగా చేసుకుంటున్న కాంగ్రెస్
దేశంలో బడుగులు, బలహీవర్గాలు ఎదగకపోవడానికి కారణం తామేనని..తమ పూర్వికులు చేసిన తప్పిదమేనని గత ఏడాది ఓ సందర్భంలో అంగీకరించారు. కాంగ్రెస్ కూడా సామాజిక న్యాయం పేరు చెప్పి కార్పొరేట్ లాబీలకు సపోర్టు చేసిందని చెప్పారు. తర్వాత తన మాటలను ట్విస్ట్ చేశారని ఆయన వాదించి ఉండవచ్చు కానీ.. కాంగ్రెస్ హయాంలోని పాలన వల్లనే.. వారి చేతకాని తనం వల్లనే బడుగులు బలహీవర్గాలు ఎదగలేదన్నది మాత్రం పచ్చి నిజం. కళ్ల ముందు రికార్డుల పరంగా ఉన్నదే. ఇప్పుడు రాహుల్ గాంధీ వారు ఎదగలేదు కాబట్టి వారంతా ప్రస్తుత ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి మళ్లీ అప్రజాస్వామ్యకంగా అయినా తమ చేతికి అధికారం ఇవ్వాలని అంటున్నారు. నేరుగా అడగకపోయినా.. ప్రజాస్వామ్యయుతంగా జరుగుతున్న ఎన్నికల్లో తాము గెలవలేకపోతున్నాం కాబట్టి.. అదే జరగాలని ఆయన కోరుకుంటున్నారు. అందు కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వెనుకబాటుకు వ్యవస్థలే కారణం అని నిందిస్తున్నారు. వ్యవస్థలపై తిరుగుబాటుకు ప్రోత్సహిస్తున్నారు. భారత ప్రజాస్వామ్యానికి పునాది నమ్మకం. ఆ నమ్మకం కలిగించేది ఎన్నికల సంఘం. ఎన్నికల సంఘం పనితీరుపై గెలవడం చేతకాని పార్టీలు చాలా ఆరోపణలు చేయవచ్చు కానీ మొత్తం ఎన్నికలనే విశ్వసనీయతలేనివిగా చూపించాలనుకోవడం అతి పెద్ద కుట్ర. ఎన్నికలపై ప్రజల్లో విశ్వాసం లేకుండా చేయడం ద్వారా ప్రజా తిరుగుబాటును సృష్టించాలని రాహుల్ అనుకుంటున్నారు. అందుకే ఎన్నికల సంఘంపై అదే పనిగా హైడ్రోజన్ బాంబులు వేస్తున్నారు. కానీ ఆయన కుట్రలు ఫలించడం లేదు. చాలా వరకూ ఆయన ఆరోపణల్ని నమ్మడం లేదు. కానీ మన దేశం కులం మత్తులో మునిగిపోతున్న ప్రాంతం. స్వాతంత్రం వచ్చినప్పుడు.. రాక ముందు కూడా ప్రజల్లో చైతన్యం ఎక్కువగా ఉండేది. ఈ కులం ఏంది.. దాన్ని బద్దలు కొట్టాలని అనుకునే అభ్యుదయవాదులు ఎక్కువగా ఉండేవారు. దేశంలో చదువుకున్న వారు పెరిగితే.. ఆటోమేటిక్ గా కులం అంతమయిపోతుందని అనుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ చేసిన కుల పరమైన ఓటు బ్యాంక్ రాజకీయాలతో చదువుకున్న మూర్ఖులు తయారయ్యారు. ఇప్పుడు కులాభిమానం లేని వారు లేరు. ఎవరి కులం వారికి గొప్ప. కులం ఏంది అని ఎవరూ అనుకోవడం లేదు. కుల నిర్మూలనా సమితి అని బోర్డులు పెట్టుకున్న వారూ ఓ కులం కోసం పోరాడతారు. కొన్ని కులాలపై ద్వేషంతో రగిలిపోతూంటారు. ఇలాంటివి అంతం కానివి. దీన్నే ఆసరాగా చేసుకుని కాంగ్రెస్ పార్టి .. రాహుల్ గాంధీ దేశ ప్రజా స్వామ్య వ్యవస్థలపై కుట్రలు చేస్తున్నారు.
రాహుల్ చేస్తున్నది దేశద్రోహమే
రాహుల్ గాంధీ జాతీయతపై చాలా సందేహాలు ఉన్నాయి. ఆయనకు ఉన్న జ్ఞానంపైనా అనుమానాలు ఉన్నాయి. ఆయన సామర్థ్యంపైనా అందరికీ డౌట్స్ ఉన్నాయి. ఒకప్పుడు దేశాన్ని దశాబ్దాల పాటు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎందుకు ఓ పెద్ద ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారిపోయింది..? హిందీ రాష్ట్రాల్లో ఎందుకు అడ్రస్ లేకుండా పోయింది?. నెహ్రూ కుటుంబ మూలం అయిన ఉత్తరప్రదేశ్ లో సోనియా, రాహుల్ కూడా గెలవలేని పరిస్థితికి ఎందుకు పడిపోయింది?. ఇవన్నీ అర్థం చేసుకుంటే కాంగ్రెస్ చేసిన ఘోరాలు సులువుగానే అర్థమవుతాయి. అయితే తాము చేసిన తప్పులేమిటో తెలుసు.. ఏ వర్గాలను అయితే ఘోరంగా .. అణిచివేతకు గురయ్యేలా చేశారో.. వారు ఎదిగితే తమకు రాజకీయంగా మేలు జరగదని అనుకున్నారో వారిని ఇప్పుడు.. మరింతగా మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దశాబ్దాలుగా ఎదగలకేపోయారని ఇప్పుడు ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలని ప్రోత్సహిస్తున్నారు. తిరుగుబాటు చేయాల్సి వస్తే అది చేయాల్సింది నిర్మోహమాటంగా కాంగ్రెస్ పార్టీపై.. ఆ పార్టీ నేతలపైనే. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఇప్పుడు ఇతర వర్గాలతో పాటు సమగ్రంగా ఎదగకుండా దశాబ్దాలుగా పాలన చేసింది ఆ పార్టీ. ఇప్పుడు ఇతర పార్టీలు అధికారంలోకి పాలిస్తూంటే.. తమకు అధికారం రావడం లేదని.. వాళ్లనే పావులుగా వాడుకుని మరోసారి కుట్రలకు పాల్పడుతున్నారు. ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలి.. కాంగ్రెస్.. రాహుల్ చేస్తున్న దేశద్రోహ పనులకు అడ్డుకట్ట వేసి.. ప్రజాస్వామ్య వ్యవస్థల్ని బలోపేతం చేసుకోవాలి. అదే దేశభక్తి.
