ఎడిటర్స్ కామెంట్ : పిచ్చోడి చేతిలో రాయి !

ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన అధికారం అంటే ఎవరికీ రాయి కాదు. ఎవరు దొరికితే వాళ్ల పళ్లు రాలగొట్టేద్దామని ఆవేశ పడటానికి..! కక్ష పెట్టుకున్న వారిని దొరకబుచ్చుకొని చచ్చేదాకా బాదేద్దామని అనుకోవడానికి ..! ఇప్పటి వరకూ భారత ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు చాలా మంది జాగ్రత్తగానే వాడుకున్నారు. కానీ చాలా కొద్ది మంది మాత్రమే దాన్ని ఓ రాయిలా చేసుకున్నారు. అలాంటి వారిలో ఎవర్‌గ్రీన్ .. చరిత్రలో నిలిచిపోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ మాట చాలా కటువుగా అనిపించవచ్చు కానీ.. గత మూడున్నరేళ్లుగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్‌ను అడ్డదిడ్డంగా నాశనం చేస్తున్న వైనాన్ని గుర్తు తెచ్చుకుంటే మాత్రం ఇంత కన్నా పెద్ద పెద్ద మాటలేమైనా ఉంటే వాటినే ఆనాలనిపిస్తుంది. సీఎం జగన్ పాలనలో తాజా ఉత్పాతం ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీకి మహానుభావుడి పేరు తీసేసి వైఎస్ఆర్ పేరు పెట్టడం. దానికి సమర్థింపుగా బలవంతంగా పెట్టుకున్నారని.. అర్హుల పేర్లే ఉండాలనే వాదన. బలవంతంగా వైఎస్ఆర్ పేరు పెట్టుకుంది ఎవరు ? ఎన్టీఆర్ అర్హుడు కాదని నిర్ధారించడానికి జగన్ ఎవరు ?. ఈ ఒక్క అంశమే కాదు.. గత మూడున్నరేళ్లుగా ఆయన తీసుకున్న నిర్ణయాలు.. చివరికి సిగ్గుపడకుండా షిక్కటి చిరునవ్వుతో వెనక్కి తీసుకున్న వైనం గుర్తు చేసుకుంటే దాని వల్ల ఏపీకి జరిగిన నష్టాన్ని అంచనా వేసుకుంటే ముఖ్యమంత్రి పనితీరుపై విరక్తి పుడుతుంది. ప్రజాస్వామ్య ప్రక్రియ మీదే అనుమానం వస్తుంది.

వెనక్కి తీసుకోని నిర్ణయం ఏదైనా ఉందా !?

ముఖ్యమంత్రి అంటే ఓ వ్యక్తి కాదు.. వ్యవస్థ. ఆ విషయాన్ని నొక్కి చెప్పాల్సిన పని లేదు. జగన్‌కు ఐఏఎస్‌లు… ఐపీఎస్‌లు వందల మంది రాజ్యాంగనిబంధనలు ఔపాసన పట్టిన వాళ్లు.. మంచీ చెడూ చెప్పడానికి ఉంటారు. వాళ్లతో అవదేమో అని ఆయన పెట్టుకున్న సలహాదారులూ వంద మంది వరకూ ఉన్నారు. అలాంటప్పుడు.. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే పక్కాగా ఉండాలి. వెనక్కి తీసుకుని పరువు పోగొట్టుకునే పరిస్థితి ఉండకూడదు. కానీ గత మూడున్నరేళ్లుగా ఏం జరుగుతోంది. తీసుకున్న ప్రతి ఒక్క నిర్ణయమూ వెనక్కి తీసుకోవాల్సి వస్తోంది. ఉదాహరణకు శాసనమండలి రద్దు అంశమే తీసుకుందాం  ” ఏడాదిలో వైసీపీకి మెజార్టీ వస్తుందని తెలుసు.. అయినా ఆ మండలి వల్ల పైసా ఉపయోగం లేదు.. ప్రజాధనం రూ. అరవై కోట్ల ఖర్చు ” అంటూ ఎన్నో చెప్పిన ముఖ్యమంత్రి.. తమకు మెజార్టీ రాగానే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఆయనకు తెలియదా అంటే అన్నీ తెలుసని.. అప్పటి ప్రసంగంలోనే ఉంది. మరి ఎందుకు ఆ మాత్రం ఆలోచించలేకపోయారు. అది ఒక్కటి కాదు.. ఏ నిర్ణయమూ పూర్తి స్థాయిలో నిబంధనలకు అనుగుణంగా తీసుకోలేదు. ఎంత దారుణమైన పరిపాలన అంటే.. స్టేట్ ఎలక్షన్ కమిషనర్నే తొలగిద్దామనుకున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల నిర్వహణ అధారిటీ ఉన్న అధికారం పై ఎంత తక్కువ అభిప్రాయం ఉంటే ఇలా చేస్తారో అర్థం చేసుకోవచ్చు. చివరికి సుప్రీంకోర్టు వరకూ వెళ్లి వాతలు పెట్టించుకుని వచ్చిన తర్వాత కానీ వెనక్కి తగ్గలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతీ నెలా ఓ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూనే ఉన్నారు. చివరికి తమ పార్టీ ప్రతినిధులపై ఉన్న హత్య కేసులను ఉపసంహరిస్తూ ఇచ్చిన జీవోలను ఉపసంహరించుకుంటున్నామని లెంపలేసుకుని కోర్టుకు చెప్పుకున్నారు. రంగులేయడం.. రంగులు తీయడం.. సహా.. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలేమీ నిలబడలేదు. ఇలాంటి పరిపాలన చేసే వారి చేతిలో ఉన్న అధికారాన్ని ఏమనాలి ?

ప్రజాధనం పట్ల కనీస బాధ్యత ఎప్పుడైనా చూపించారా ?

ముఖ్యమంత్రిగా ప్రజలు పదవి ఇచ్చారంటే… వారు పన్నులుగా కట్టిన సొమ్మును ఇష్టారాజ్యంగా వాడుకోమని.. రాష్ట్ర సంపదను అమ్మేసుకోమని.. లేకపోతే ధ్వంసం చేయమని కాదు. దానికి కస్టోడియన్‌గా మాత్రమే ఉండాలి. చేతనైతే ప్రభుత్వ సంపదను అంటే ప్రజల సంపదను పెంచాలి. కానీ నాశనం చేయకూడదు. కానీ పదవి చేపట్టిన రోజుల్లోనే కూర్చున్న కొమ్మనే నరుక్కున్నట్లుగా సమావేశం పెట్టిన ప్రజావేదికనే కూల్చివేయించారు. దానికి కొంత మంది అధికారులు చప్పట్లు కొట్టి మరీ స్వాగతించారు. ఇంత దారుణమైన మనస్తత్వం ఉన్న పాలకుడు.. అతని ప్రాపకం కోసం దేనికైనా తెగించే అధికారుల బృందం తయారయినప్పుడు ఇక ప్రజా సంపదనకు విలువెక్కడ ఉంటుంది. అసలు ప్రజావేదికను ఎందుకు కూల్చారో ఎవరికీ తెలియదు. అక్రమం అని ఇంత వరకూ నిరూపించలేదు. రూ. పది కోట్ల ప్రజాధనం అలా కూలిపోయింది. అప్పటి నుంచి ప్రజాధనం అంటే సొంత ధనం అన్నట్లుగా ఖర్చు పెడుతున్నారు..నాశనం చేస్తున్నారు.. ఇష్టం వచ్చిన వారికి పప్పుబెల్లాల్లా పంచుతున్నారు కానీ.. అయ్యో.. ఇది ప్రజలు కష్టపడి పన్నులుగా కడుతున్న సొమ్మే.. జాగ్రత్తగా ఉందామని ఎప్పుడైనా ఆలోచన చేశారా ? సాక్షిలో జీతాలు భారమైతే ప్రభుత్వంలో ఉద్యోగం కల్పించడం.. ఎప్పుడైనా మనకు ఉపయోగపడేవాడైతే.. ఓ సలహాదారు పదవి పడేసి.. లక్షలకు లక్షలు జీతాలివ్వడం రొటీన్. ఎవడబ్బా సొమ్మని అంత మందిసలహాదారుల్ని పోషిస్తున్నారో.. అంత మంది సాక్షి ఉద్యోగుల్ని పోషిస్తున్నారో వాళ్లకే తెలియాలి. ముఖ్యమంత్రి సొంత ఇంటికి కోట్లు పెట్టి మరమ్మతులు చేయించుకున్నారు.. ముఖ్యమంత్రి కుటుంబానికి చెందిన వ్యాపార సంస్థలకు.. సాక్షిపత్రికలకు ప్రకటనలు.. భారతీ సిమెంట్ కు బల్క్ ఆర్డర్లు.. ఆ సంస్థలు లేటరైట్ తరలింపు ఇలా చెప్పుకుంటూ పోతే.. ఏపీ మొత్తం తమ ఆస్తి.. తమకు ప్రజలు రాసిచ్చారన్నట్లుగా వాడుకోవడం తప్ప.. ఇది ప్రజల సంపదన.. సంరక్షించమని తనకు అధికారం ఇచ్చారని ఎప్పుడైనా అనుకున్నారా ? ప్రజాధనం పట్ల కనీస బాధ్యత లేని పరిపాలకుడి చేతిలో ఉన్న అధికారాన్ని ఏమనాలి ?

కోలుకున్న రాష్ట్రాన్ని అంపశయ్య మీదకు నెట్టేసిన పరిపాలనను ఏమనాలి !?

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఆగమ్య గోచరం. కానీ ఐదేళ్లలో అద్భుతమైన పనితీరు కనబర్చింది. ఆర్థిక వనరులు తక్కువే అయినప్పటికీ ఇప్పుడు ఏపీ అంటే ప్రధానంగా చెప్పుకునే కియా పరిశ్రమ సహా.. అప్పట్లో వెలుగులీని.. ఇప్పుటి ప్రభుత్వం పుణ్యాన శిథిలమైన అమరావతి వరకూ అన్నీ అద్భుతం. అప్పట్లో ఏపీ అంటే… పరిశ్రమల గురించి చెప్పుకునేవారు.ప్రగతి గురించి మాట్లాడుకునేవారు. ప్రతీ ఏటా పెట్టుబడుల సదస్సులంటే పారిశ్రామికవేత్తలు వచ్చేవారు. దావోస్‌లోఏపీ పెవిలియన్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. అప్పట్లో ఏపీ అంటే ఓ క్రేజ్. ఆర్థికంగానూ కోలుకుంది. ఐదేళ్ల పరిపాలనలో ఒక్క చార్జీ పెరగలేదు. కరెంట్ బిల్లులు ఇంకా తగ్గిస్తామని చంద్రబాబు చెప్పేవారు. సంక్షే్మం విషయంలో ఆ ప్రభుత్వ ప్రయోజనాలు పొందిన వారికే్ ప్రయోజనాల గురించి తెలుసు. అప్పట్లో ఏపీలో ఎవరు చనిపోయినా వారి ఇంటికి వెళ్లి మరీ ఆర్థిక సాయం చేసేవారు. అందుకున్న వారేక ఆ సంగతి తెలుసు. ఆ చంద్రన్న బీమాలాంటి పథకాలు ఇప్పుడు లేవు. కార్పొరేషన్లతో ఆర్థికంగా బలహీనంగా ఉన్న కులాలను పైకి తెచ్చేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. ఇన్ని చేసినా ఏటా సగటున పాతిక వేల కోట్ల అప్పు చేస్తే గొప్ప. కానీ ఇప్పుడేమయింది ..ఏటా లక్ష కోట్లకుపైగా అప్పు చేస్తున్నారు. కానీ కొంత మందికి కొంత నగదు బదిలీ చేయడం తప్ప.. ఏ వర్గానకీ ప్రయోజనం ఉండటం లేదు. రోడ్ల వంటి మౌలిక సదుపాయాల లేవు. పరిశ్రమలు లేవు. పారిశ్రామిక ప్రగతి లేదు. ప్రజల ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. అంత ఎందుకు ఏపీలోఇప్పుడు ఫలనా వ్యాపారం సక్రమంగా చేసుకుంటున్నామని చెప్పేవారు ఎవరు ఉన్నారు ? నారాయణపై కోపంతో స్కూల్, కాలేజీ ఫీజులతో ఆటాడుకున్నారు. ఉన్నత విద్యా కాలేజీల పరస్థితి అదే. సినిమా హాళ్లు, వైద్యులు… హోటళ్లు.. చివరికి ఫ్లెక్సీలు ప్రింట్ చేసుకుని బతికే వారినీ రోడ్డున పడేశారు. ఫ్లెక్సీలు ప్లాస్టిక్ కాదు మహా ప్రభో అని వాళ్లు మొత్తుకుంటున్నారు. కానీై వినే పాలన అయితే కదా! ఓ వైపు ప్రజల ఆర్థిక మూలాల్ని దెబ్బకొడుతూ.. మరో వైపు ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థను అప్పుల రూపంలో శిథిలం చేస్తూ పాలన సాగుతోంది. ఏ మాత్రం అవగాహన లేకుండా..బాధ్యత లేకుండా విధాన నిర్ణయాలు తీసుకునే వ్యక్తి చేతిలో అధికారం ఉంటే దాన్న ఏమనాలి ?

పగ, ప్రతీకారాలే పాలన అనుకునే అధికారాన్ని ఏమనాలి ?

నిత్యం పగ.. ప్రతీకారం. ఎప్పుడు ఎవరి మీద పగ తీర్చుకోవాలి. చివరికి సోషల్ మీడియా పోస్టులు పెట్టిన వారిని కూడా ఎలా వేటాడాలి.. వేధించాలన్నదే ఎజెండా. అందుకే్ కోసం కనీసం వంద మందికి తగ్గకుండా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకుని మరీ వేట సాగించడం అంటే మామూాలు విషయం కాదు. సోషల్ మీడియా దగ్గర్నుంచి పై స్థాయి వరకూ.. పగ..,పగ . ప్రతీ రోజూ ఎవరో ఒకర్ని వేధించకపోతే నిద్రపట్టదు. వ్యవస్థలన్నింటినీ దుర్వినియోగం చేసి.. వాటికి విలువ లేకుండా చేసి .. ఏపీకి.. ప్రజలకు భవిష్యత్‌లో తీరని నష్టం జరుగుతుందని తెలిసినా తాత్కలిక ప్రయోజనాల కోసం దేనికైనా తెగించడం కామన్ అయిపోయింది. పోలీసులు .. ప్రైవేటు సైన్యంలా మారి కిడ్నాపులు చేస్తూంటే న్యాయస్థానం ఎన్నో సార్లు హెచ్చరించాల్సి వచ్చింది. టీడీపీ ఆఫీసుపై దాడి చేస్తే కేసుల్లేవు. నడి రోడ్డుపై హత్యలు చేస్తే కేసుల్లేవు. పగ,ప్రతీకారాలే పాలన అనే పాలకుల చేతిలో ఉన్న అధికారాన్ని ఏమనాలి ?

చివరికి ప్రాంతం, కులాల మధ్య అసెంబ్లీలోనే చిచ్చు పెట్టే సీఎం పాలనను ఏమనాలి ?

ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ముఖ్యమంత్రిని మనం ఎక్కడా చూసి ఉండం. ఇప్పుడు చూస్తున్నాం. కులాల గురించి నేరుగా మాట్లాడి ఓ కులంపై వ్యతిరేకతను చూపేసీఎంను ఎక్కడా చూసి ఉండం. ఏపీలోనే చూస్తాం. ఆ సీఎం సహా ఎవరైనా… తాము ఫలానా కులంలో కావాలని పుట్టి ఉంటారా ? ఎవరూ అనుకోని పుట్టరు. అసలు కులం అనేది ఓ భావన. కానీ ఉన్నత స్థానంలో ఉన్న వారందరికీ ఉన్నతమైన ఆలోచనలు ఉండాల్సిన అవసరం లేదని నిరూపించేందుకు ప్రస్తుత పాలకులు పోటీ పడుతున్నారు. ఎంతో మంది సలహాదారులు.. అంతకు మించిన మేధావులు ఉన్నా వారంతా వేస్ట్. చివరికి ముప్ఫై ఏళ్లుగా ఉన్న ఎన్టీఆర్ వర్శిటీ పేరును వైఎస్ఆర్ వర్శిటీ అని మార్చుకుని ..మరింత కురచబుద్దిని బయట పెట్టుకున్నారు. ఏ మాత్రం బాధ్యత లేని.. ఇలాంటి పాలకుల చేతుల్లో ఉన్న అధికారాన్ని ఏమనాలి ?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రజలు హామీ ఇస్తే దేశ రాజకీయాల్లోకి : కేసీఆర్

తెలంగాణ ప్రజలు హామీ ఇస్తే దేశ రాజకీయాల్లోకి వెళ్తామని సీఎం కేసీఆర్ మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన బహిరంగసభలో ప్రకటించారు. సమీకృత కలెక్టరేట్ ప్రారంభం తర్వాత ఆయన బహిరంగసభలో మాట్లాడారు. ఈ...

వరుస సినిమాలు – వచ్చే ఏడాది కూడా పవన్ బిజీనే !

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొత్త సినిమాల ప్రకటనలు ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న హరిహర వీరమల్లు కంప్లీట్ అవడానికి జనవరి వరకూ పడుతుంది.. ఆ తర్వాత...

ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని ఇంటికి పంపేసిన ఏపీ సర్కార్ !

ఉద్యోగంలో చేరి పదేళ్లు కాని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందర్నీ.. తక్షణం టెర్మినెట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాన్ఫిడెన్షియల్ అయిన ఈ జీవో ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఈ ఔట్ సోర్సింగ్...

ఈడీ పరిధిలోకి పోలీసుల్ని కూడా తెచ్చిన కేంద్రం !

రాజకీయ అవసరాల కోసం కేంద్ర దర్యాప్తు సంస్థల్ని బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నా కించిత్ పట్టించుకోవడం లేదు సరి కదా ఇంకా వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close