” రాజకీయాలు క్షుద్రమైనవి. అవి కుటుంబాల్లోనూ చిచ్చు పెడతాయి. రక్త సంబంధీకుల మధ్య గొడవలు సృష్టిస్తాయి. కానీ ఎప్పుడంటే మొత్తం కుటుంబ పెద్ద కొంత మందిపై ఆపేక్ష చూపినప్పుడు.. మరికొంత మందిపై వివక్ష చూపినప్పుడు మాత్రమే”. అంటే రాజకీయ కుటుంబ పెద్ద ఫెయిలయితే కుటుంబాలు చీలిపోతాయి. దాంతో పాటు పార్టీలు కూడా చీలిపోతాయి. ఇప్పుడు ఈ పరిస్థితి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలే అధికారం కోల్పోయిన రెండు ప్రాంతీయ పార్టీలకు వచ్చింది. కుటుంబాలను, పార్టీని ఏకతాటిపై నిలపాల్సిన పెద్దలు వివక్ష చూపి కుటుంబసభ్యులను దూరం చేసుకుంటున్నారు. చేసుకున్నారు కూడా. మళ్లీ కలప లేనంతగా వీరి బంధాల మధ్య పగుళ్లు కనిపిస్తున్నాయి.
కేసీఆర్ విధానాలపై కవిత అసంతృప్తి
తెలంగాణను దాదాపుగా పదేళ్ల పాటు పరిపాలించిన భారత రాష్ట్ర సమితి ఇప్పుడు చీలిక అంచున ఉన్నట్లుగా కనిపిస్తోంది. కేసీఆర్ తీరును ప్రశ్నిస్తూ నేరుగా చేతిరాతతో లేఖ రాసి మీడియాకు లీక్ చేయడం సంచలనంగా మారింది. ఇందులో ఆమె ప్రస్తావించిన అంశాలు అన్నీ బీఆర్ఎస్ పార్టీ విధానాలను సూటిగా ప్రశ్నించేలాగానే ఉన్నాయి. వాటికి సంబంధించి కవితకు ఏ సమాచారం లేదని అనుకోలేం. భారతీయ జనతా పార్టీని కేసీఆర్ ఒక్క మాట అడం లేదు. కేటీఆర్ కూడా అనడం లేదు. అనాల్సి వస్తే బీజేపీని కాకుండా.. బీజేపీని విమర్శించాల్సి వస్తే నేతల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుంటున్నారు. కిషన్ రెడ్డిని, బండి సంజయ్ ను విమర్శిస్తున్నారు. బీజేపీ పట్ల భయభక్తులు చూపిస్తున్నారు. దానికి కారణం కవిత అరెస్ట్ అన్న అభిప్రాయం కూడా గతంలో ఉంది. కానీ ఇప్పుడు కవితే రివర్స్ అవుతున్నారు. ఎందుకు బీజేపీపై పోరాడటం లేదని ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో కేసీఆర్ పార్టీ నేతలుకు అందుబాటులే లేరని కూడా కవిత నిందించారు. ఇది చాలా పెద్ద ఆరోపణే అనుకోవచ్చు. ఎందుకంటే కేసీఆర్ శైలి గురించి కవితకు కాకుండా ఎవరికి ఎక్కువగా తెలుస్తుంది. సీఎంగా ఉన్నప్పుడు అయినా కేసీఆర్ వద్దకు ఎవరికైనా లిమిటెడ్ యాక్సెస్సే ఉంటుంది. ఆయన కోరుకుంటే తప్ప ఎవరూ ఆయనతో సమావేశం కాలేరు. ఓడిపోయిన తర్వాత ఆయన పూర్తిగా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. అక్కడికి తనకు కూడా యాక్సెస్ లేదన్నట్లుగా కవిత లేఖ రాయడం చిన్న విషయం కాదు. ప్లీనరీ అంశాల్లో కేసీఆర్ ప్రసంగంలో కొన్ని అంశాలను పొగిడినప్పటికీ నిర్వహణ విషయంలో తన అసంతృప్తిని బహిరంగంగానే వెల్లడించారు. ఉద్యమకారులకు ప్రాధాన్యం ఇవ్వలేదని సీనియర్ నేతలకు చాన్సివ్వలేదని కూడా చెప్పుకొచ్చారు. అలాగే ఇప్పుడు ఉన్న ఇంచార్జ్, స్థానిక ఎన్నికల బీఫామ్‌ల అంశాన్ని కూడా ప్రశ్నించారు. నిజానికి కవిత ఇవన్నీ తన తండ్రి ఎదుట కూర్చుని మాట్లాడి ఉండవచ్చు. అలా మాట్లాడితే పార్టీలోని అంశాలను బయటకు రాకుండా పరిష్కరించుకున్నట్లవుతుంది. కానీ కవిత లేఖ రాశారు. ఆ లేఖను తాను అమెరికాలో ఉండగా లీక్ చేశారు. దానిపై వాడి వేడిగా చర్చ జరుగుతున్న సమయంలోనే ఇండియాలో ల్యాండ్ అవబోతున్నారు. అంటే అంతా వ్యూహాత్మకమే అనుకోవచ్చు.
తన దారి తాను చూసుకోవాలనే కవిత ప్లాన్
కొన్నాళ్ల నుంచి కల్వకుంట్ల కవిత పార్టీపై అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. జైలు నుంచి విడుదలైన తర్వాత ఆమె బీఆర్ఎస్ కార్యక్రమాల్లో అరుదుగా పాల్గొంటున్నారు. తెలంగాణ జాగృతి తరపునే అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మామూలుగా అయితే తెలంగాణ జాగృతి అనేది సాంస్కృతిక కార్యక్రమాలకు పరిమితం కావాల్సిన సంస్థ. కానీ పూర్తిగా రాజకీయ పార్టీ తరహాలో కార్యక్రమాలు చేపట్టారు. బీసీ రిజర్వేషన్ల ఉద్యమం, పూలే విగ్రహం ఉద్యమంతో పాటు దాదాపుగా అన్ని సమస్యలపై సొంతంగా పోరాటాలు చేశారు. అప్పుడే ఆమె తనదైన బాటలో ఉన్నారని అందరూ అనుకున్నారు. కానీ రాజకీయం తెలిసిన కేసీఆర్ కుమార్తెను పార్టీ ట్రాక్ లోకి తీసుకు వస్తారని అనుకున్నారు. కానీ ఆయన కూడా ఫెయిలయ్యారని తేలిపోయింది. కుమారుడు, కుమార్తె మధ్య లో ఆయన నలిగిపోతూ ఉండవచ్చు. కేసీఆర్ టీడీపీ నుంచి బయటకు వచ్చి టీఆర్ఎస్ పార్టీ ప్రారంభించినప్పుడు కుమారుడు, కుమార్తె లేరు. ఉద్యమం గాడిన పడిన తర్వాత మాత్రమే పార్టీలోకి వచ్చారు. వారికి కేసీఆర్ రాజకీయ భవిష్యత్ కల్పించారు. భవిష్యత్ లో జరగబోయే పరిణామాలను ఆయన కనీసం అంచనా వేసి ఉంటే.. కేవలం ఒకర్ని మాత్రమే ప్రోత్సహించి ఉండేవారు. కానీ ఇద్దరికీ అవకాశాలు కల్పిస్తూ ఇద్దరిలోనూ నాయకులను బయటకు తెచ్చారు. కేటీఆర్ కన్నా కొన్ని విషయాల్లో కవిత బెటరని అనుకుంటారు. కవిత కన్నా కేటీఆర్ మరికొన్ని విషయాల్లో బెటరని పార్టీ క్యాడర్ అనుకుంటారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏకపక్షంగా ఒక నేత కింద లేదు. కేటీఆర్ వర్గం ఉంది..కవిత వర్గం ఉంది. ఈ రెండు వర్గాల్లోనూ స్లీపర్ సెల్స్ గా హరీష్ రావు వర్గం కూడా ఉంది. పార్టీలో ప్రాధాన్యం కోసం కేటీఆర్, కవిత గొడవ పడుతూంటే… ఓ రకంగా పార్టీని తన భుజాలపై మోసుకొచ్చిన హరీష్ రావు ఎవరో ఒకరి పక్కన చేరే అవకాశాలు ఉండవు. పూర్తిగా ఆయన దారి ఆయన చూసుకోవచ్చు. కానీ హరీష్ రావు తన మామ, రాజకీయ భవిష్యత్ ఇచ్చిన కేసీఆర్ కు ఓ కమిట్ మెంట్ ఇచ్చారు. అదేమిటంటే.. కేసీఆర్ ఉన్నంత వరకూ ఆయన పార్టీని ధిక్కరించనని. అందుకే ఎన్ని అవమానాలు పాలు చేసినా ఆయన పార్టీనే అంటి పెట్టుకుని ఉన్నారు. ఇప్పుడు ఆ పార్టీని కేటీఆర్, కవిత చీల్చాలనుకుంటే ఆయన ఆపే అవకాశం ఉండదు. తన దారి తాను చూసుకునే అవకాశం ఉంటుంది. ఇంత జరుగుతూంటే.. కేసీఆర్ ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారన్నదే ఇప్పుడు అర్థం కాని విషయం.
కేసీఆర్ చాణక్యం ఏమైపోయింది ?
బీఆర్ఎస్ పార్టీ విజయాల్లో ఉన్నప్పుడు కేసీఆర్ ను చాణక్యుడు అని పొగిడారు. ఆయనకు ఎలాంటి పరిస్థితిని అయినా డీల్ చేయడం వచ్చని చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు సొంత కుటుంబం రోడ్డున పడుతూంటే ఆయన ఆపలేకపోతున్నారు. తన బిడ్డలు రాజకీయం కోసం రచ్చకెక్కుతూంటే ఆపేందుకు సాహసం చేయలేకపోతున్నారు. ఈ లేఖ అంశంలో కేసీఆర్ చేయగలిగిందేమీ లేదు. ఇప్పటికే చేయి దాటిపోయింది. కవిత ఎంతో ఆలోచించుకుని ఇక వేరు బాటలో ముందడుగు వేయాలని నిర్ణయించుకున్న తర్వాతనే ఆమెలేఖ రాయడం.. లీక్ చేయించడం చేసి ఉంటారు. ఏ విదంగా చూసినా బీఆర్ఎస్ కు ఇది బ్యాడ్ టైం. ప్లీనరీ నిర్వహించారు కానీ దాని వల్ల క్యాడర్ లో ఏమైనా కదలిక వచ్చిందా లేదా అన్నది వారికే అర్థం కావడం లేదు. ఇప్పుడు కవిత లేఖ బాంబు వచ్చి పడింది. కొద్ది రోజులుగా బీఆర్ఎస్ లో చీలిక ఖాయమని చెప్పుకుంటున్నారు. కవిత లేఖ వివాదం ఆమె సొంత కుంపటికి దారి తీస్తే.. బీఆర్ఎస్ పరిస్థితి అంతమైనట్లే. చాలా కాలంగా పార్టీని కేటీఆర్ నడుపుతున్నప్పటికీ ఆయనను నాయకుడిగా అంగీకరించేందుకు పార్టీ క్యాడర్ మొత్తం రెడీగా ఉండే అవకాశాలు లేవు. కేసీఆర్ ఇప్పుడు అటు కూతురు లేదా ఇటు కుమారుడివైపు ఉండలేరు. పార్టీ ఉనికి ప్రశ్నార్థమైన సమయంలో ఆయన బిడ్డల్లో ఒకర్ని దూరం చేసుకునే అవకాశం ఉండదని అనుకుంటున్నారు. రాజకీయంతో ఆడుకున్నంత కాలం బాగానే ఉంటుంది కానీ.. ఆ రాజకీయం తనతో ఆడుకోవడం ప్రారంభిస్తే ఏ రాజకీయ నేత అయినా ఏమీ చేయలేడు. ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి కూడా అదే. అధికారం అనుభవించినంత కాలం బాగానే ఉంది. కానీ ఇప్పుడు పార్టీ ఉనికినే కాదు.. కుటుంబ ఐక్యత కూడా ప్రమాదంలో పడింది. రాజకీయాలు మానవ సంబంధాలపై చూపే ప్రభావం తీవ్రంగా ఉంటుంది. పగిపోయిన గ్లాస్ ను అతికించడం ఎలా అసాధ్యమో.. రాజకీయాల బారిన పడిన నెర్రెలిచ్చిన కుటుంబ బంధాలను కలుపుకోవడం కూడా అంతే అసాధ్యం.
జగన్ పనైపోయినట్లే !
ఇప్పుడు కేసీఆర్ ఈ ఫ్యామిలీ పొలిటికల్ డ్రామాలో పెద్దరికం చూపించడానికి ఇబ్బంది పడుతున్నారు. పార్టీని, కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. ఆయన అనుంగు మిత్రుడు జగన్ రెడ్డి మాత్రం ఎప్పుడో ఇలాంటి పరిస్థితిని డీల్ చేయలేక పాతాళంలోకి పడిపోయారు. ఏకంగా చెల్లి, తల్లిలపై కోర్టులో కేసు వేసి నవ్వుల పాలయ్యారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హఠాన్మరణంతో ఆయన స్థానంలో బాధ్యతలు తీసుకున్న జగన్ రెడ్డి అత్యంత స్వార్థ బుద్దితో వ్యవహరించి మొత్తం కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశారు. చివరికి సొంత బాబాయ్ ను హత్య చేయించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ బాబాయ్ హత్యలో ప్రదాన పాత్రధారులు, సూత్రధారులన్ని ఐదేళ్ల పాటు కాపాడి.. మిగతా కుటుంబసభ్యులకు దూరమయ్యారు. తన కోసం.. తన పార్టీ కోసం కష్టపడిన చెల్లి షర్మిలకు కనీసం పదవులు కాదు కదా ఆస్తులు కూడా ఇవ్వడానికి నిరాకరించారు. షర్మిల రాజకీయ పదవుల కోసం ఎప్పుడూ ఆశపడలేదు. తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం జగన్ రెడ్డి అక్రమంగా పోగేసిన అక్రమాస్తులలో వాటాలు ఇస్తే చాలనుకుంది. కానీ జగన్ రెడ్డి అది కూడా ఇచ్చేందుకు ఆసక్తి చూపించలేదు. దీంతో కుటుంబంలో చీలిక వచ్చింది. జగన్ రెడ్డి స్వార్థాన్ని కళ్లారా చూసిన విజయమ్మ కూడా జగన్ రెడ్డిని అసహ్యించుకుంటోంది. రెండు, మూడు సార్లు జగన్ కు వ్యతిరేకంగా ఆమె రాసిన లేఖలు, ఎన్సీఎల్టీలో జగన్ రెడ్డి దాఖలు పిటిషన్ పై విజయమ్మ వేసిన కౌంటర్ చూస్తే..జగన్ రెడ్డి ఎంత పాతాళానికి పడిపోయారో అర్థం చేసుకోవచ్చు. కుటుంబాన్ని కలిపి ఉంచలేక కుటుంబాన్ని నాశనం చేసుకుని పార్టీని నిర్వీర్యం చేసుకుని ఇప్పుడు ఒంటరిగా బిక్కుబిక్కుమంటున్నారు. ఆయన ఎవర్నీ నమ్మలేని పరిస్థితుల్లో సజ్జల వంటి వారి చేతుల్లో కీలబొమ్మగా ఉండి బండి లాక్కొస్తున్నారు. ఆయన పార్టీని ఎప్పుడు ఎవరు లాక్కుంటారో తెలియక కంగారు పడుతున్నారు. తన పార్టీ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ ముందుగానే క్లీన్ చేసుకున్నారు. అవన్నీ ఎటు పంపించారో కానీ ఇప్పుడు తన దగ్గర డబ్బుల్లేవని బీద అరుపులు అరుస్తున్నారు. ఇవాళో రేపో ఆయన లిక్కర్ కేసులో జైలుకెళ్లవచ్చు. ఆ తర్వాత అక్రమాస్తుల కేసుల్లో శిక్షలు పడవచ్చు. అప్పుడు పార్టీ ఎవరి చేతుల్లో ఉంటుందో చెప్పడం కష్టం. అన్నింటికీ మించి ఆయన పార్టీని చూసుకోవడానికి కుటుంబసభ్యులు కూడా ఎవరూ లేరు. గతంలో ఆయన జైలుకెళ్లినప్పుడు ఆయన కోసం రోడ్డు మీద కూర్చుని చెల్లి, తల్లి సహా చాలా మంది ఏడ్చారు. ఇప్పుడు తన సతీమణి తప్ప ఎవరూ లేరు. కుటుంబాన్ని ఏకతాటిపై ఉంచుకోలేక.. అటు కుటుంబాన్ని, ఇటు పార్టీని నిర్వీర్యం చేసుకున్న వ్యక్తి జగన్ రెడ్డి
జగన్ రెడ్డికి అంటే మూర్ఖత్వం, లోభిత్వం, అత్యాశ అన్నీ ఉన్న రాజకీయనాయకుడు. తన స్వార్థం తప్ప ఏమీ తెలియదు. అందుకే అతని పరిస్థితిపై ఎవరికీ ఆశ్చర్యం లేదు. కానీ కేసీఆర్‌కు రాజకీయం తెలుసు. చాణక్యం తెలుసు. అయినా ఎందుకు కుటుంబ రాజకీయాలు కంట్రోల్ చేయలేకపోతున్నారన్నది రాజకీయవర్గాలకు అంతుబట్టని ప్రశ్న. ఎందుకంటే లేఖ వరకూ వచ్చిందంటే ఇక పరిస్థితి చేయి దాటినట్లే. కుటుంబ పార్టీల్లో ఇలాంటి పరిణామాలు అంతిమంగా ఆ పార్టీ ఉనికికే ప్రమాదం తెస్తాయి. బీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీలు అలాంటి ఉనికి ప్రమాదంలో పడ్డాయి. భవిష్యత్ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారనున్నాయి.