“ పిచ్చి కుదిరింది…రోలు తలకు చుట్టమన్నాడట ” అనే సామెత తెలుగు వాళ్లకు తెలియనిది కాదు. పిచ్చి తగ్గిపోయిందని చెప్పి పిచ్చి పనులు చేసేవాళ్ల గురించి ఇలాంటి సామెతలు ఉదహరిస్తూ ఉంటారు. కానీ ఇప్పటి జనరేషన్ లో కొంత మంది పిచ్చి కుదరడం సంగతి అటుంచి ఎన్ని షాక్ ట్రీట్మెంట్లు వచ్చినా ఇంకా ఇంకా ముదిరిపోయేవాళ్లు కనిపిస్తున్నారు. చిన్న పిల్లలు కూడా అది కాదు బాసూ.. అలా ఉండకూడదు.. అనకూడదు అని నవ్వుకుంటున్నా.. మార్పు రాదు. ఇలాంటి వారిలో వైఎస్ఆర్సీపీ అధినేత… 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిన మాజీ ముఖ్యమంత్రి, స్వయం ప్రకటిత ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి ముందు వరుసలో ఉంటారు. ఆయన రాజకీయాలు, తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రెస్ మీట్ లో మాట్లాడే విషయాలు, తమ నిర్వాకాల గురించి సమర్థించుకుంటున్న తీరుతో అందరికీ పిచ్చెక్కిపోతోంది. ఆయన మాత్రం అదే సరైన స్టేటస్ అనుకుంటున్నారు. పిచ్చిగా ఉండటమే బాగుండటం అనుకుంటున్నారు.
సినిమాల్లో ఉంటే బయట చేసేస్తారా – ఇదేం పిచ్చి వాదన !
“సినిమా డైలాగులు చెబితేనే అరెస్టు చేస్తున్నారు. అయితే అ డైలాగులున్న సినిమాలను బ్యాన్ చేయాలి అని..” జగన్ రెడ్డి మీడియా సమావేశంలో అన్నారు. ఆ తర్వాత పుష్ప మేనరిజం కూడా చేసి చూపించారు. ముందే ప్రాక్టీస్ చేసి వస్తారేమో కానీ ..నమస్కారం అనే పదం దగ్గర్నుంచి చూసి చదివే ఆయన.. అక్కడే పుష్ప మ్యానరిజం చూపించాలని స్క్రిప్టులో ఉంటే చేసి చూపించి ఉంటారు. కానీ అది ఎంత సిల్లీ లాజిక్.. పిల్లలు కూడా నవ్వుకుంటారని గుర్తించలేకపోయారు. సినిమాల్లో ఉంది కాబట్టి బయట కూడా చేస్తామని.. సినిమాల్లో చేశారు కాబట్టి బయట చేయడం నేరం కాదని జగన్ రెడ్డి వాదన. ఆయన వాదనను చూసి .. సినిమా స్టైల్లో మర్డర్లు, మానభంగాలు చేసిన వాళ్లకు ధైర్యం వస్తుందేమో?. ఆ సినిమాల్లో చేసింది తప్పు కానప్పుడు…తాను చేసింది తప్పు ఎలా అవుతుందని కోర్టుల్లో వాదించినా వాదించగలరు. ఎవరో ఎందుకు జగన్ రెడ్డే రేపు తనపై ఉన్న కేసుల్లో ఇదే వాదన తన లాయర్లతో వినిపించినా ఆశ్చర్యం లేదు. ఇలాంటి వాదనలే వినిపించే పొన్నవోలు వంటి ఫేవరేట్ లాయర్లను పక్కున పెట్టుకునే జగన్ .. న్యాయసూత్రాలకు సరికొత్త అర్థాలు చెప్పగలరు. వినేవాళ్లకు అది పిచ్చి అనిపించవచ్చు కానీ.. అది జగన్ మోహన్ రెడ్డి బ్రాండ్. ఇది ఒక్కటి కాదు.. రెండు గంటల పాటు ఆయన పెట్టిన ప్రెస్మీట్లో చదివే ప్రతి అంశం .. ప్రజలకు అబ్బురంగానే ఉంటుంది. ఉదాహరణకు మచ్చలేని నేతలపైనా కేసులు పెడుతున్నారని ఆయన అనడం. ఆ మచ్చలేని నేతలెవరంటే.. తాడిపత్రి పెద్దారెడ్డి, తనపై గెలిచిన మహిళా ఎమ్మెల్యేను బోరుబావిగా ఉదహరించిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, బూతుల బావి కొడాలి నాని, పుట్టుకల్ని ప్రశ్నించే వల్లభనేని వంశీ.. ఇలా చెప్పుకుంటూ పోతే.. అరెస్టు అయిన వారంతా సుద్దపూసలే. ఇంకా లిక్కర్ కేసులో అరెస్టు అయి జైల్లో ఉన్న ధనుంజయ్ రెడ్డిని పాపం అనేస్తున్నారు. కానీ ఆ ధనుంజయ్ రెడ్డి ఏం చేశాడో… వైసీపీలో ఐదేళ్ల పాటు ఎమ్మెల్యేలుగా చేసిన అందరికీ తెలుసు. అందుకే ఆయన మంచోడని ఒక్కరూ మాట్లాడటం లేదు.
జగన్ పాలనలోనే కనిపించని ప్రజాస్వామ్య “మునగడ”
ఇక ఏపీలో ప్రజాస్వామ్య మునగడ లేదని ఆయన నిందలేశారు. మునగడ అంటే.. జగన్ రెడ్డి భాషలో మనుగడ అనుకోవాలి. రాజ్యాంగం ప్రకారం ఏమీ జరగడం లేదని ఆయన ఉద్దేశం. నిజంగా అలాగే పరిస్థితులు ఉంటే.. రప్పా రప్పా నరుకుతాం అని డీఎస్పీకి వార్నింగ్ ఇచ్చిన వైసీపీ నేత ఇప్పుడు ఎక్కడ ఉండాలి ?. నోటి దూల అంతా తీర్చుకుని .. ముఖ్యమంత్రి ఎంతకాలం అని మాట్లాడుతున్న పేర్ని నాని ఎక్కడుండాలి?. ఐదు ఏళ్ల కాలంలో ఎన్ని ఘోరాలు చేసినా కొడాలి నాని ఇంకా ఎందుకు బయట ఉన్నారు ?. ఇలా చెప్పుకుంటూ పోతే… జగన్ రెడ్డి అమలు చేసిన ప్రజాస్వామ్య సూత్రాలను అమలు చేయకపోవడం వల్లే ఎంతో మంది బయట ఉన్నారు. జగన్ రెడ్డి హయాంలో.. అప్పటి వరకూ పులివెందులలో ఉన్న వ్యక్తిని అరెస్టు చేయకుండా ఆయన విమానం ఎక్కేందుకు చెన్నై ఎయిర్ పోర్టుకు వెళ్తే అక్కడికి వెళ్లి అరెస్టు చేసేవారు. అప్పటి వరకూ పరారీలో ఉన్నారని చెప్పేవారు. అలాంటి ప్రజాస్వామ్యాన్ని ప్రజలు చూసి చూసి అలసిపోయారు. కొత్తగా టీడీపీ చూపించాలని అనుకోవడం లేదు. ప్రజాస్వామ్య విలువల్ని సీఎం చంద్రబాబు బలంగా నమ్మి.. కంట్రోల్ లో ఉంచుతున్నారు కాబట్టి జగన్ ధైర్యంగా సింగయ్య లాంటి వాళ్లను తొక్కేసుకుంటూ యాత్రలు చేస్తున్నారు. అనుమతులు లేకపోయినా యాత్రలు చేసి విధ్వంసాలు సృష్టిస్తున్నారు.
అదే జగన్ హయాంలో ప్రతిపక్ష నేతల పరిస్థితి ఎలా ఉండేది?. చంద్రబాబు విశాఖ వెళ్తే ఎయిర్ పోర్టు ముందే మూడు గంటలు నిలబెట్టి పార్టీ నేతలతో చెప్పులు వేయించేవారు. అమరావతికి వెళ్తే ఇతర ప్రాంతాల నుంచి మనుషుల్ని తీసుకు వచ్చి రాళ్లు, చెప్పులు వేయించి… అది ప్రజాస్వామ్య నిరసన అని అప్పటి డీజీపీతో చెప్పించారు. పల్నాడుకు వెళ్తానంటే.. గేట్లకు తాళ్లు కట్టించేవారు. అసలు ఎలాంటి ప్రదర్శనలు ఉండవని.. చంద్రబాబు ఒంటరిగా వెళ్లేందుకు తిరుపతి ఎయిర్ పోర్టుకు వస్తే అక్కడే అడ్డుకున్నారు. నారా లోకేష్ పాదయాత్ర చేస్తే మాట్లాడేందుకు మైకులు ఉండవు. స్టూల్ మీద నిలబడి మాట్లాడుతున్నారని ఆ స్టూల్ కూడా పట్టుకెళ్లిపోయారు. ఇలాంటి రాజ్యాంగాన్ని అమలు చేసి.. ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి..రాజ్యాంగ మునగడ నుంచి మాట్లాడితే ఎబ్బెట్టుగా ఉంటుంది. జగన్ రెడ్డికి ఓ పిచ్చి నమ్మకం ఉంది. అదేమిటంటే.. ప్రజలకు ఏమీ గుర్తుండదని. తన ఐదు సంవత్సరాల పాలనలో ఏం జరిగిందో ప్రజలు మర్చిపోయి ఉంటారని ఆయన అనుకుంటారు. అందుకే.. తన పాలనలో ప్రజాస్వామ్యం ఫరిడవిల్లిందని ఆయన చెప్పుకుంటారు. కానీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, జీవోలను కూడా బయట పెట్టకుండా రహస్య పాలన చేసి.. అదే ప్రజలకు కావాల్సిందన్నట్లుగా ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు పాలన అంతా పారదర్శకంగా జరుగుతోంది. ఫలానా వాళ్లను ఒక్కరినైనా అన్యాయంగా అరెస్టు చేశారని ఎవరూ అనడం లేదు. అరెస్టు అయిన వైసీపీ నేతలంతా.. అన్ని రకాల న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకున్నారు. వారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని తప్పుడు పనులు చేశారని స్పష్టత రావడంతోనే అన్ని అవకాశాలను వారు కోల్పోయారు. చివరికి అరెస్టు తప్ప వారికి మరో మార్గం లేని సందర్భంలోనే దొరికిపోయారు. అదే వైసీపీ హయాంలో ఏం జరిగేది ?. కోర్టులకు కూడా అవకాశం రాకుండా వీకెండ్ లో అరెస్టు చేసేవారు. కనీస ఆధారాలు లేకపోయినా ఉన్నాయని కోర్టుకు చెప్పి రిమాండ్ కు పంపేవారు. తీరా అసలు విచారణలో ఆధారాలు చూపించేవారు కాదు. అత్యంత ఘోరమైన పాలనకు వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్న ఐదేళ్లే సాక్ష్యం. దాన్ని ప్రజలు అంత త్వరగా మర్చిపోరు. కానీ జగన్ రెడ్డి మర్చిపోయినట్లుగా నటిస్తారు. దానికి బుధవారం ఆయన నిర్వహించిన ప్రెస్ మీటే సాక్ష్యం.
కీచు గొంతుతో హెచ్చరికలు – ఏం చేయలేరు !
విచిత్రం ఏమిటంటే.. ఈ ప్రెస్మీట్లో ఆయన హెచ్చరికలు జారీ చేశారు. మేము అధికారంలోకి వస్తే మీ పరిస్థితి ఏమిటి..? నా మాటను మా వాళ్లు కూడా వినరు.. ఇప్పటికైనా మారు చంద్రబాబూ అని.. వేళ్లు అటూ ఇటూ తిప్పుతూ.. డైలాగ్ చెప్పారు. కానీ హెచ్చరికలో ఆయన అభిమాన హీరో బాలకృష్ణ లాంటి వాయిస్ బేస్ ఎక్కడా .. ఎవరికీ వినిపించలేదు.. కానీ వేణుమాధవ్ చేసే కామెడీ సీన్లలోని కీచుగొంతు వాయిస్ మాత్రం అందరికీ వినిపించింది. మూడేళ్లలో మళ్లీ వస్తామని ఆయన అంటున్నారు కానీ.. నాలుగేళ్ల వరకూ ఎన్నికల్లేవు. ఎన్నికలు వచ్చినా మళ్లీ గెలుస్తానని ఆయన ఎందుకు అనుకుంటున్నాడోనని వైసీపీ నేతలకూ క్లారిటీ లేదు. జగన్ తన మేనిఫెస్టోలో.. నాలుగేళ్ల వరకూ పింఛన్లు పెంచను అని చెప్పారు. కానీ చంద్రబాబు రాగానే పెంచేశారు. వాలంటీర్లను తీసేసినా అందరికీ ఒకటో తేదీనే పెన్షన్లు వస్తున్నాయి. అంతేనా.. తల్లికి వందనం.. ఎంత మంది పిల్లలకు ఉంటే అంత మందికి వచ్చింది. రైతు భరోసా అమలు చేయబోతున్నారు. అన్న క్యాంటీన్లు పేదల ఆకలి తీరుస్తున్నాయి. పెట్టుబడులు, అభివృద్ధి, ఉద్యోగాలు రోజూ వీటి గురించే చర్చ జరుగుతోంది. వైసీపీ హయాంలో అన్ని అరాచకాల గురించే చర్చ జరిగేది. ఇప్పుడు మళ్లీ ప్రజలు అలాంటి పరిస్థితి రావాలని ఎందుకు కోరుకుంటారు?. అధికారంలో ఉన్నప్పుడు జగన్ రెడ్డి చేయగలిగినంత చేశారు. చంద్రబాబును భౌతికంగా నిర్మూలించేందుకు చేయని ప్రయత్నం లేదు. ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయుల్ని అడ్డం పెట్టుకుని ఎప్పటికప్పుడు రాళ్ల దాడుల్ని ప్లాన్ చేశారు. మార్కాపురం, నందిగామ, కుప్పం, పుంగనూరు, అమరావతి ఇలా చంద్రబాబుపై ఎన్నిసార్లు రాళ్ల దాడులు చేశారో చెప్పాల్సిన పని లేదు. 70 ఏళ్లు దాటిన ఓ వ్యక్తికి ఓ రాయి తగిలితే ఎంత ప్రమాదమో తెలిసే.. వ్యూహాత్మకంగా ఈ ప్రయత్నం చేశారు. మార్కాపురంలో వారి టార్గెట్ మిస్ అయి ఓ వృద్ధుడికి తగలడంతో ఆయన చనిపోయారు కూడా. ఇలాంటి కుట్రలను గుర్తించే కేంద్రం.. కమెండోలను రెట్టింపు చేసింది. ఇంత కంటే ఏం చేయగలరు?. తన మనుషులు తన మాట కూడా వినరని ఆయన చెప్పుకుంటున్నారు… ఇప్పుడు వారు పగబట్టాలంటే అది జగన్ రెడ్డిపైనే. అడ్డగోలుగా తాను దోచుకుని చాలా మందికి చిల్లర మాత్రమే ఇచ్చి వారిని బలి పశువుల్ని చేశారు. లిక్కర్ స్కాంలో దోపిడీ అంతా జగన్ రెడ్డిది.. మరి జైలుకెళ్లింది ఎవరు ?. వెళ్లబోతోంది ఎవరు?. స్కాం చేశారో లేదో వాళ్లకు తెలియదా ? అరెస్టు అవుతున్న ఒక్కరైనా అన్యాయంగా అరెస్టు చేశారని ప్రజలు అనుకుంటున్నారా ? కనీసం ప్రతీకారంగా అరెస్టు చేశారని ప్రజలు అనుకుంటున్నారా ?
ఎన్ని షాక్ ట్రీట్మెంట్లు ఇచ్చినా మారకపోతే ఏం చేస్తారు ?
ప్రెస్మీట్లో జగన్ ఓ ఆణిముత్యంలాంటి మాట చెప్పారు “ ప్రజలకు మేలు చేసి.. వారి అభిమానాన్ని పొందాలి” అని చంద్రబాబుకు సలహా ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు తనకు ఈ మాటను వర్తింప చేసుకోరు. ఈ మాట ప్రకారం జగన్ రెడ్డి తన రాజకీయాన్ని మార్చుకుంటే.. ఖచ్చితంగా ప్రజాకోణంలోనే.. ప్రజలు ఏమనుకుంటారో అన్న భయంతోనే రాజకీయాలు చేస్తారు. దాని వల్ల మెరుగైన దారిలో వెళ్తారు. ప్రజలను గౌరవిస్తారు. ఫలితాల సంగతి పక్కన పెడితే… ముందుగా సరైన రాజకీయం.. ప్రజాస్వామ్య రాజకీయం చేస్తున్నారని ప్రజలు అనుకుంటారు. అంతకు మించి పిచ్చి తగ్గిపోయిందని ప్రజలు అనుకునే అవకాశం ఉంది. అలాంటి మార్పు వస్తే తప్ప.. వైఎస్ఆర్సీపీకి..త జగన్ కు రాజకీయ భవిష్యత్ ఉంటుందని ఎవరూ అనుకోరు. మార్పులు చేసుకోకుండా.. నేను మారిపోయాను.. రాగానే రప్పా.. రప్పా నరికేద్దాం అంటే.. అందరూ ముదిరిపోయిందని అనుకుంటారు. అప్పుడు 11 సీట్లతో ఇచ్చిన షాక్ ట్రీట్ మెంట్ రిపోలేదని.. ఈ సారి మరింత కఠినమైన ట్రీట్ మెంట్ ఇచ్చే ప్రమాదం ఉంది. కానీ ఎన్ని ట్రీట్మెంట్లు ఇచ్చినా…. తన పిచ్చి తనదే అనుకునేవారిని ఎవరూ బాగు చేయలేరు.