“ఉగ్రవాదానికి వినాశనమే లక్ష్యం. అలాంటి వినాశనంపై కనీస జాలి చూపించకూడదు. కూకటి వేళ్లతో సహా పెకిలించేయాలి”
మనుషుల్ని చంపి ఏం సాధిస్తావురా అని ఏ ఉగ్రవాదిని అయినా అడిగితే అతని వద్ద సమాధానం ఉండదు. ఎందుకంటే అతనికి తెలిసింది ఒక్కటే చావడం లేదా చంపడం. అలా అతని బ్రెయిన్ వాష్ చేస్తారు అసలు విధ్వంసకారులు. అందు కోసం సులువుగా అందరి మెదళ్లలోకి ఎక్కించగలిగే ఉన్మాద ఉగ్రత్వం మతం. దాన్నే ఆయుధంగా చేసుకుని చేస్తున్న మారణహోమమే నేడు భారత్, పాక్ మధ్య జరుగుతున్న యుద్ధం.
మత విద్వేషంతో బుసలు కొడుతున్న ఉగ్రవాదం
కశ్మీర్ లోని పెహల్గాంలో దేశం నలుమూలల నుంచి వచ్చిన పర్యాటకులను ఉగ్రవాదులు చుట్టుముట్టి మతం అడిగి మరీ కాల్చి చంపారు. అసలు ఉగ్రవాదానికి .. ఆ పర్యాటకులకు ఏమైనా సంబంధం ఉందా ?. వారు సామాన్య పౌరులు. వారికి పుట్టుకతో మతం వచ్చింది కానీ వారు ఎంపిక చేసుకుంది కానీ.. అది వారి తప్పెలా అవుతుంది?. కానీ ఉగ్రవాదులకు చంపడమే తమ మతం బోధించినట్లుగా రెచ్చిపోయారు. ఆ చంపిన వాళ్లకు తాము ఎందుకు చంపుతున్నామో తెలియదు.. వారి బ్రెయిన్ వాష్ చేసేసి ఉంటారు. అందుకే చంపండి..లేదా చావండి అని చెప్పి వారిని పంపించారు. వారిపైన ఉండే వారూ తేడా కాదు. వారు కూడా అంతే. అయితే తమ కింద వారిని బలి చేసి అయినా సరే.. పది మందిని చంపాలనుకునే మనస్థత్వం వారిది. అలాంటి వారికి స్వర్గధామం పాకిస్తాన్. బిన్ లాడెన్ ను దాచి పెట్టేంత దైర్యం పాకిస్తాన్ ఉందంటే.. అది ఎంత ఉగ్రవాద దేశమో చెప్పాల్సిన పని లేదు. అమెరికా సహా అంతర్జాతీయ సంస్థలు టెర్రరిస్టులుగా ప్రకటించిన మసూద్ అజర్, దావూద్ ఇబ్రహీంలాంటి వారు పాకిస్తాన్ ప్రధాని కన్నా ఎక్కువగా భద్రత పొందుతూ పాకిస్తాన్ లో రహస్య జీవితం గడుపుతూ ఉంటారు. నిజానికి వారు పాకిస్తాన్ హై ప్రోఫైల్లో బతుకుతూ ఉంటారు. కానీ ప్రపంచానికి మాత్రం అలాంటి వారు తమ దగ్గర లేరని చెబుతారు. వారంతా ఓ ఉగ్రవాద ముఠాను నడుపుతున్నారు. ఆ ఉగ్రవాద లక్ష్యం ఏమిటంటే మనుషుల్ని చంపడం. ఎందుకు చంపాలో వారికి తెలియదు. చంపాలి అంతే.
భారత ప్రతిస్పందన తీవ్రం అని తెలిసి కూడా కుట్ర చేసిన పాకిస్తాన్ సైన్యం
ఏ మతమూ మనుషుల్ని చంపమని చెప్పదు. ఏ మతమూ హింసను ప్రేరేపించదు. ఏ మత గ్రంధమూ ద్వేషాన్ని బోధించదు. అన్ని మతాల సారం ఒక్కటే.. అహింస, శాంతి, దయ, కరుణలతో జీవించండి అనే చెబుతుంది. ఆనందానికి అంతకు మించి దగ్గర మార్గాలుండవని చెబుతారు. మరి ఈ హింస, ఉగ్రవాదం ఎక్కడి నుంచి వచ్చాయి?. మత ఛాందసవాదం నుంచి వచ్చాయి. పక్క దేశాలను నాశనం చేయాలనుకునే కుట్రల నుంచి వచ్చాయి. తాము బాగుపడకపోయినా పర్వాలేదు.. తమ పొరుగుదేశం బాగుపడకూడదని అనుకునే పరిస్థితుల నుంచి వచ్చాయి. కశ్మీర్ లో దశాబ్దాల తరబడి సాగిన టెర్రరిజం కొన్ని వేల మంది ప్రాణాలను తీసుకుంది. స్విట్జర్లాండ్ లాంటి సుందరమైన ప్రదేశం అయిన కశ్మీర రక్తమోడుతూ వచ్చింది. ఆర్టికల్370 రద్దు తర్వాత అక్కడ పరిస్థితి మెరుగుపడుతూ వచ్చింది. మత తత్వంతో వేర్పాటు వాదులు ఎవరైనా ఉంటే వారు కూడా మనసు మార్చుకుంటూ వస్తున్నారు. అభివృద్ధి రుచి చూస్తున్నారు. టూరిజం పెరుగుతూండటంతో అక్కడి ప్రజలకు ఆర్థిక సమస్యలు తీరుతున్నాయి. ఇదే ఉగ్రవాదులని మరింత ఆందోళనకు గురి చేసింది. వారంతా ఆర్థికంగా బలపడితే.. ఉగ్రవాదంపై నమ్మకం కోల్పోతారని దాడి చేశారు. టూరిస్టులు రాకుండా… టార్గెట్ చేశారు. అయితే గతంలోలో భారత్ తేలికగా తీసుకునే పరిస్థితి లేదు. ఈ దాడుల్ని ఇప్పుడు ఆపకపోతే.. తర్వాత అత్యంత ఘోరమైన టెర్రరిజాన్ని భారత్ చూడాల్సి వస్తుంది. అందుకే ఉగ్రవాద శిబిరాలపై దాడులతు ఆపరేషన్ సింధూర్ ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్ ఒక్కరోజులో అయిపోయేది కాదు. ప్రతీకారం అనే మైండ్ తో రగిలిపోయే పాకిస్తాన్ పాలకులు, ఆర్మీ ఊరుకోదు. ఎదురుదాడి చేస్తుంది. భారత్ దీన్నే అవకాశంగా చేసుకుని మరెప్పుడూ యుద్ధం అనే మాట… టెర్రరిజానికి సపోర్టు అనే మాట రాకుండా పాకిస్తాన్ ను అణిచి వేయాల్సి ఉంది.
ఉగ్రవాదులపై దాడి తనపై దాడిగానే భావించిన పాకిస్తాన్
ఉగ్రవాదులపై దాడి చేస్తే పాకిస్తాన్ తనపైనే దాడి చేసినట్లుగా ఫీల్ అయిందంటేనే తాము ఉగ్రవాదులం అని పాకిస్తాన్ అంగీకరించినట్లయింది. దాన్ని నిరూపిస్తూ జమ్మూతో పాటు సరిహద్దులో ఉన్న నగరాలపై డ్రోన్లు, ఫైటర్ జెట్లతో విరుచుకుపడింది. ఆపరేషన్ సింధూర్ లో భారత్ పాకిస్తాన్ సైనిక స్థావరాలను టార్గెట్ చేసుకోలేదు. కేవలం ఉగ్రవాద క్యాంపుల్నే టార్గెట్ చేసుకున్నారు. చనిపోయిన ఉగ్రవాదుల వివరాలు బయటకు వచ్చినప్పుడు అది నిజం అని తేలింది. అయితే ఆ ఉగ్రవాదులంతా తమ పౌరులేనని పాక్ సొంతం చేసుకుని అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. అంటే ఉగ్రవాదులకు అధికారిక లాంఛనాలు నిర్వహించిన దేశాన్ని ఉగ్రదేశం అనక ఇంకేం అని పిలవాలి?. యుద్ధం వల్ల పాకిస్తాన్ మరింత దరిద్రంలోకి వెళ్లిపోతుంది. ఆ దేశం నిండా దరిద్రంలోనే ఉంది. ఉగ్రవాదాన్ని పెంచిపోషించడమే కాకుండా.. ఆ ఉగ్రవాదంతోనే అతలాకుతలం అవుతున్నారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వారిని రోజూ ఊచకోత కోస్తున్న దృశ్యాలు వెలుగులోకి వస్తున్నాయి. చివరికి ఒకప్పుడు పాలు పోసిన తాలిబన్ కూడా ఇప్పుడు పాకిస్తాన్ సైన్యాన్ని ఓ ఆటాడుకుంటోంది. అలాంటి పాకిస్తాన్ ఉన్న పళంగా ఉండియాతో ఉగ్రవాద ఆట ఆడి.. నేరుగా యుద్ధం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ భారత్ కు జరిగే నష్టమే ఎక్కువగా అని పాకిస్తాన్ అనుకుంటోంది. తమకు రెండు కళ్లు పోయి గుడ్డిగా అయినా పర్వాలేదు.. ఇండియాకు రెండు కళ్లు పోవాలని పాకిస్తాన్ పంతం పట్టుకుంది. అందుకే జమ్మూతో పాటు ఇతర ప్రాంతాలపై దాడులు చేస్తోంది. నిజానికి ఆ దాడులన్నీ కింద టార్గెట్లను తగలకుండానే… గాల్లోనే భారత రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయి. ఫైటర్ జెట్లను కూడా కూల్చివేశాయి. కానీ భారత్ దాడులు మాత్రం నేరుగా లక్ష్యాన్ని తాకి వస్తున్నాయి. లాహోర్ లో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను భారత్ పేల్చేసి వచ్చిందంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. భారత్ సీరియస్ గా యుద్ధం చేయాలనుకుంటే…పాకిస్తాన్ ఆర్మీని నిర్వీర్యం చేయడానికి ఎక్కువ రోజులు పట్టదు. ఆ మాత్రం ఆధునాతన రక్షణ వ్యవస్థల్ని భారత్ సృష్టించుకుంది. కానీ పాకిస్తాన్ మాత్రమే వెనుకబడిపోయి ఉంది. చైనా దయతో ఇచ్చిన కొన్ని ఆయుధాలు, మందుగుండు సామాగ్రి తప్ప పాకిస్తాన్ వద్ద పెద్దగా ఆయుధ సామాగ్రి లేదు. పాకిస్తాన్ ఆర్మీ సామర్ధ్యం సంగతి పక్కన పెడితే ఆ దేశానికి ఎంత నష్టం జరిగినా వారు పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే మత మౌఢ్యులు. మనకు ఎంత నష్టం జరిగితే వారు అంత సంతోషిస్తారు. భారత్ ఆర్థికంగా ఎదగడం పాకిస్తాన్ భరించలేదు. తాము ఏమీ తినలేని పరిస్థితుల్లో ఉన్నాము కాబట్టి .. భారత్ కూడా తినకూడదని అనుకుంటారు. అలాంటి పరిస్థితులో మనకు నష్టం జరగకుండా యుద్ధాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలి. శత్రువు మరోసారి ఉగ్రవాదంతో భారత్ పై దండెత్తాలన్నా భయపడేలా చేయాలి. ఓ రకమైన క్యాన్సర్ పెరుగుతున్నప్పుడు దాన్ని ఉపేక్షిస్తే.. అంతా పాకిపోతుంది. పాకినంత వరకూ కోసి పడేయాలి. ఇప్పుడు పాకిస్తాన్ అనే దేశాన్ని ఉగ్రవాదం అనే క్యాన్సర్ మొత్తం పాకేసింది. ఆ దేశంపై ఏ మాత్రం సానుభూతి చూపినా ఆ క్యాన్సర్ సానుభూతి చూపించే వాళ్లకే పెనుముప్పుగా మారుతుంది. అది ప్రపంచదేశాలకు అర్థమయింది. అందుకే ఎవరూ పాకిస్తాన్ కు సపోర్టు చేయడం లేదు. అందరూ భారత్ కే మద్దతిస్తున్నారు. ఈ మద్దతు ముుందుగా భారత్ చేసిన దౌత్యపరమైన విజయం. పాకిస్తాన్ కు ఘోర ఓటమి. పాకిస్తాన్ చేస్తున్న ఉగ్రవాద యుద్దానికి ముగింపు పలికేలా అందర్నీ కలుపుకుని వెళ్లాల్సిన అవసరం ఉంది.
యుద్ధం తప్పదు – ముష్కరుల్ని తుడిచి పెట్టేయాలి !
ప్రస్తుత ప్రపంచంలో దేశాల మధ్య ఉద్రిక్తతలు సహజంగా మారుతున్నాయి. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆగడం లేదు. నిజానికి యుద్ధం ఆగాలని అనుకుంటే.. ఎప్పుడో సమస్య పరిష్కారం అయ్యేది. కానీ ఆ యుద్ధం వల్ల లాభపడే దేశాలు దాన్నికొనసాగేలా చేస్తున్నాయి. అగ్రదేశాలు ఉక్రెయిన్ ను .. రష్యాకు వ్యతిరేకంగా పక్కెలో బల్లెంలాగా మార్చే ప్రయత్నం చేయడం..దానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సై అనడంతో రష్యా దాడులు చేసింది. ఇప్పుడు ఆ అగ్రదేశాలు పట్టించుకోవడం లేదు. ఉక్రెయిన్ సర్వనాశనం అయింది. ఇప్పుడు పాకిస్తాన్ ఇష్యూలోనూ అలాంటిదే జరుగుతోంది. టర్కీ, చైనా వంటి దేశాలు మేమున్నాం నీకెందుకు దాడులు చేసుకో అని రెచ్చిపోయారు. ఇప్పుడు ఆ రెండు దేశాలు హ్యాండ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవ్వకపోయినా తాము ఖర్చు పెట్టుకుని భారత్ పై దాడులు చేసేందుకు ముందుకు రావు. మధ్యప్రాచ్యంలో ఇప్పటికీ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ప్రపంచం మరో యుద్ధాన్ని భరించే పరిస్థితుల్లో లేదని ప్రపంచదేశాలన్నీ అనుకుంటున్నాయి. ఇప్పుడు పాకిస్తాన్ చేసిన తప్పుడు పనుల వల్ల మరో యుద్ధం ప్రారంభమైనట్లుగా అయింది. ప్రపంచ దేశాలన్నీ బుద్ది చెప్పి పాకిస్తాను మూలన కూర్చోబెడితే తప్ప భారత్ శాంతించదు. లేకపోతే పాకిస్తాన్ వినాశనం చూసే అవకాశం ఉంది. భారత్ మొదటి నుంచి శాంతి కాముక దేశం. ఎవరి జోలికి వెళ్లదు. తమ జోలికి వచ్చినా వీలైనంత వరకూ సామరస్యంగానే పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ ఆ శాంతి మంత్రాన్ని జోక్ గా తీసుకుంటే మాత్రం ఆపరేషన్ సింధూర్లు ప్రారంభమవుతాయి. ఇప్పుడు అదే జరుగుతోంది.
పాకిస్తాన్ కు కూడా భారత్ తో యుద్ధం అంటూ జరిగితే తమ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు. కానీ తమ ప్రజలు పాలకుల్ని హీనులుగా చూడకుండా ఉండాలంటే.. ఏదో ఒకటి చేయాలి. అందుకే దాడులు చేస్తున్నారు. అయితే చివరికి తాము తమ సైనిక సామర్థ్యాన్ని కోల్పోతున్నామని వారికి స్పష్టత ఉంటుంది. అందుకే వారు కూడా ఎక్కువ కాలం యుద్ధం చేయాలని అనుకోరు. ఆ లోపే పాకిస్తాన్ అంతు చూసి.. మరోసారి యుద్ధం అంటేనే పాకిస్తాన్ కాదు.. పాకిస్తాన్ ప్రజలంతా వణికిపోయేలా చేయాలి. ఈ లక్ష్యాన్ని సాదించే క్రమంలో భారత ప్రజలంతా భారత ప్రభుత్వానికి మద్దతుగా ఉంటారు. 150 కోట్ల మంది మద్దతుతో ఉగ్రవాదాన్ని అణిచి పారేయాల్సిన అవసరం కళ్ల ముందు కనిపిస్తోంది. ఇది భారత్ సాధిస్తుంది. జై భారత్ మాతా కీ ..!