ఎడిటర్స్ కామెంట్ : కుక్క వస్తే రాయి దొరకదు… రాయి దొరికితే కుక్క రాదు !

” కుక్క వస్తే రాయి దొరకదు… రాయి దొరికితే కుక్క రాదు ..” ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలకుల పరిస్థితి అచ్చంగా ఇలాగే ఉంది. ఎలాగైనా సరే ఓ పని చేయాలనుకుంటారు. కానీ ఆ పని చేయడానికి మాత్రం సాధ్యం కావడం లేదు. ఆలోచన వచ్చిందే తడవుగా అమలు చేయాలనుకోవడం .. జీవోలు జారీ చేయడం చివరికి వెనక్కి తీసుకోవడం కామన్ అయిపోయింది. ఒక వేళ మొండిగా ముందుకెళ్తే కోర్టులు కొట్టి వేస్తున్నాయి. అంతే కానీ ఆ నిర్ణయం మాత్రం ముందుకు సాగడం లేదు. పాలన చేపట్టినప్పటి నుండి ఇదే పరిస్థితి. ఎలాగైనా కొట్టేద్దామని రాయి తీసుకుని రెడీగా ఉంటే కుక్కరాదు.. ఇక ఏం లేదులే అని ఖాళీగా కూర్చుకుంటే కక్క వస్తుంది. కానీ ఏమీ చేయలేరు. అలాంటి స్థితిలో ఏపీ ప్రభుత్వం పడిపోయింది.

కిందపడ్డా పైచేయి మాదేననే రెటమతం పాలన !

” సాంకేతిక సమస్యలు ” ఉన్నాయి అందుకే మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకుంటున్నాం అని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. బిల్లు పెట్టారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా తన పద్దతిలో తాను చెప్పాల్సింది చెప్పారు. రూ. లక్ష కోట్ల నుంచి ప్రారంభించి సూపర్ క్యాపిటల్ వద్దన్నారని.. విశాఖను సూపర్ క్యాపిటల్ చేస్తామని చెప్పుకొచ్చి ప్రసంగాన్ని ముగించారు. అంతిమంగా తాము కింద పడ్డా తమదే పై చేయి అని చెప్పేందుకు మళ్లీ మూడు రాజధానుల బిల్లులు తీసుకొస్తామని చెప్పారు. అందులో ఆ బిల్లుల్లో ఉన్న టెక్నికల్ సమస్యలేంటో చెబితే పరిష్కారాలు తెలుస్తాయి. కానీ ఆ టెక్నికల్ సమస్యలేమిటో వారికి కూడా తెలుసో లేదో స్పష్టత లేదు. ఎందుకంటే ఆ బిల్లులు తీసుకొచ్చి రెండేళ్లయింది. న్యాయపోరాటాల కోసం.. రూ. కోట్లు ఖర్చు చేశారు. ఇంత చేసిన తర్వాత సమయానికి సమయం.. డబ్బులకు డబ్బు వృధా చేసుకున్న తర్వాత టెక్నికల్ సమస్యలు గుర్తుకొచ్చాయి. రాజధానికి అసెంబ్లీలోసీఎం జగన్ ప్రతిపక్ష నేత హోదాలో మద్దతు పలికిన “చరిత్ర”నే అసలైన టెక్నికల్ సమస్య. దాన్ని ఎలా మార్చగలరు. అసాధ్యం. ప్రజాస్వామ్యం అంటే ప్రజలు అధికారం ఇచ్చేదాకా ఓ మాట.. అధికారం ఇచ్చిన తర్వాత మరో మాట చెప్పుకుని.. ఎదురు తిరిగే వాళ్లపై వారిచ్చిన అధికారమే ప్రయోగించడం కాదు. నీతి ..నిజాయితీ..మాట మీద నిలబడటం వంటివి కూడా ఉండాలి. ఏపీ ప్రభుత్వంలో అలాంటివేమీ కనిపించడం లేదు. రాజధాని బిల్లులను ఉపసంహరించుకున్న ఒక్క రోజులోనే … మండలి రద్దు తీర్మానం ఉపసంహరించుకుని.. మరింతగా చులకన అయ్యారు. నిజానికి ఆ మండలి రద్దు తీర్మానం చేసేటప్పుడే శ్రేయోభిలాషులందరూ చిలక్కి చెప్పినట్లుగా చెప్పారు. కానీ విన్నారా… లేదు.. పైగా అసెంబ్లీలో భీకరమైన డైలాగులు కూడా చెప్పారు. ఇప్పుడు వాటికి సమాధానం చెప్పాల్సి ఉంది. ఈ నిర్ణయాల్లో ఏపీ ప్రభుత్వం సాధించిందేమీ లేదు.

గట్టిగా అమలు చేసిన నిర్ణయం ఒక్కటి చెప్పగలరా !?

రెండున్నరేళ్ల పాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వెనక్కి తిరగకుండా అమలు చేసిన నిర్ణయం ఒక్కటైనా ఉంది. నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుని దాన్ని అమలు చేసేశాం అని గుండెల మీద చేయి వేసుకుని చెప్పుకునే సరుకు పాలనలో ఉందా..?. ఒక్కటంటే ఒక్కటీ లేదు. ప్రభుత్వ వైఫల్యానికి అతి పెద్ద ఉదాహరణ ఇసుక. గత ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా ఇచ్చేది. రవాణా చార్జీలు పెట్టి తీసుకెళ్లడమే. దీంతో ఎక్కడా బ్లాక్ మార్కెటింగ్ ఉండేది కాదు. కానీ ఈ ప్రభుత్వం రాగానే ఇసుక పాలసీ మార్చేసింది. ఇసుక అమ్మడానికి పెట్టింది. ఈ ఇసుక అమ్మకానికి ఎన్ని పాలసీలు మార్చారో వాళ్లకే తెలియాలి. ఇప్పుడు మొత్తం ప్రైవేటుకంపెనీకి కట్టబెట్టారు. అయినా పేపర్ ప్రకటనలు ఇవ్వాల్సి వస్తోంది. ఒక్క ఇసుకేనా … ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు, ఇంగ్లిష్ మీడియం, ఎస్‌ఈసీగా నిమ్మగడ్డను తొలగించడం..ఇలా చెప్పుకుంటూ పోతే.. ఏ ఒక్క నిర్ణయమూ అమలు చేసిన దాఖలాలు కనిపించవు. చివరికి తాము ఇళ్ల స్థలాలు ఇస్తామంటూ..ఇళ్లు కట్టిస్తామంటూ తీసుకొచ్చిన సెంటు భూమి పథకం కూడా కోర్టు కేసుల్లో చిక్కుకుంది. స్థానిక ఎన్నికలకు కోర్టు క్లియరెన్స్ కోసం.. అయితే సింగిల్ జడ్జి లేకపోతే డివిజన్ బెంచ్ అంటూ హడావుడి చేసి ఎట్టకేలకు అనుకున్నది సాధించిన ప్రభుత్వం తాము తెచ్చి పెట్టిన పథకానికి సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు విషయంలో మాత్రం తొందరపటం లేదు. అంటే ఇక్కడ తమ నిర్ణయం అమలు చేయాలంటే తమకే భారం అని అర్థమయిపోయిందన్నమాట. అందుకే ఈ మొహమాటాలు.

అయితే న్యాయస్థానాలు కొట్టి వేయడం.. లేకపోతే తామే వెనక్కి తీసుకోవడం !

మొదటి నుంచి ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయమూ హైకోర్టులో నిలువలేదు. అంటే దానర్థం.. ఒక్కటంటే ఒక్కటీ నిబంధనల ప్రకారం తీసుకోలేదన్నమాట. చివరికి అసెంబ్లీ, శాసనమండలిని కూడా అవమానించి రాజధాని బిల్లులను అడ్డగోలుగా అక్రమంగా తీసుకొచ్చారు. ఇంత దారుణమైన పరిపాలనను కోర్టులు అడ్డుకోకుండా ఉంటాయంటే అది అమాయకత్వమే. రాజ్యాంగానికి ఇష్టం వచ్చిన భాష్యం చెప్పుకుని పాలనా చేసి.. నిర్ణయాలు చేసేస్తే.. రాజ్యాంగాన్ని రాజ్యాంగాంలా చూసుకుని తీర్పులు చేప్పే కోర్టులు తమ పని తాము చేస్తాయి. అదే చేశాయి. అలా చేసినందుకు న్యాయవ్యవస్థపైనా దాడి చేశారు. కానీ ప్రయోజనం ఏముంది..? తీర్పుల్లో ఎలాంటి మార్పులు రావడం లేదు. ఒకటి.. రెండు కాదు.. దాదాపుగా తీసుకున్న నిర్ణయాలన్నీ కోర్టుల్లో వీగిపోతున్నాయంటే సమస్య ఎక్కడ ఉంటుంది.. కోర్టుల్లో ఉంటుందా.. తీసుకునేవారిలోనా ?. ఇప్పటి వరకూ ప్రభుత్వం తీసుకున్న రెండు వందల నిర్ణయాల వరకూ కోర్టులు ప్రశ్నించాయి.. కొట్టి వేశాయి. ఇప్పుడు తమంతట తాము తమ నిర్ణయాలను వెనక్కి తీసుకోవడం ప్రారంభించారు. అంటే… మెథడ్ ఏదైనా.. వెనక్కి పోవడమే అన్నమాట. రివర్స్ పాలనలో రెండున్నరేళ్లు ముగిసేసరి మళ్లీ రివర్స్‌కు వెళ్తున్నామన్నమాట.

రాజకీయ పరంగానూ సేమ్ టు సేమ్.. ఏమీ తేడా లేదు !

పాలన ఎంత అక్రమంగా.. అడ్డగోలుగా సాగుతోందో.. రాజకీయంగానూ అదే స్టాండర్డ్స్ మెయిన్‌టెయిన్ చేస్తున్నారు. ఫిరాయింపులంటే తనకు ఎలర్జీ అని చెప్పుకున్నారు కానీ.. ఆ ఫిరాయింపులతోనే కాలం గడిపేస్తున్నారు. ఎంత మంది ఎమ్మెల్యేలను.. ఎంత మంది ఎమ్మెల్సీలను టీడీపీ నుంచి తీసుకున్నారో ప్రజల ముందే ఉంది. పైగా ఎమ్మెల్యేలకు కండువా కప్పలేదు.. వాళ్ల ఫ్యామిలీకి కప్పాము అనే సమర్థింపు ఒకటి. ప్రజలు మరీ అంత అమాయకులుగా ఎందుకు లెక్క కడుతున్నారో ఎవరికీ అర్థం. తాము ఏం చేసినా ఓట్లేస్తారన్న నమ్మకంతో ఎందుకు ఉన్నారో అసలు అర్థం కాదు. చేసే పనులకు.. చెప్పే మాటలకు ్సలు పొంతనే ఉండదు.

చంద్రబాబు అడ్డుకున్నాడు చేయనివ్వలేదని చెప్పుకోవడానికి సిగ్గనిపించదా !?

మూడు రాజధానులు ఎందుకు చేయలేదంటే చంద్రబాబు చేయనివ్వలేదు. మండలిని ఎందుకు రద్దు చేయలేకపోయారంటే చంద్రబాబు చేయనివ్వలేదు. ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయలేదంటే చంద్రబాబు చేయనివ్వలేదు.. వరద బాధితుల్ని ఎందుకు ఆదుకోలేదంటే అసలు వరదలకు కారణం చంద్రబాబే అని వాదించడం ఇప్పటి వరకూ వచ్చినసమాధానాలు. ప్రతి సమస్యకూ సొల్యూషన్ చంద్రబాబే. ఆయన పేరు చెబితే చాలు సమస్యల నుంచి తమకు రిలీఫ్ వస్తుందన్నట్లుగా ఉంది పాలకుల తీరు. కానీ చంద్రబాబు ఐదేళ్ల కాలంలో ప్రతిపక్ష పార్టీ గా వైఎస్ఆర్‌సీపీ .. ఆయన పార్టీ సానుభూతిపరులు చేసిన అనేక కానేక చిక్కులతోనే పోలవరం, అమరావతి వంటివి ముందుకు సాగాయి. కానీ ఈ ప్రభుత్వంపై రోడ్లపై కనీసం గుంతలు కూడా పూడ్చలేకపోయారు. అన్నింటికీ చంద్రబాబు అంటే ప్రజలు శాటిస్ ఫై అయిపోతారా.. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటారా?. కానీ అధికారంలో ఉన్న ప్రభుత్వం మాత్రం చంద్రబాబు కారణం చూపిస్తే ప్రజలు సంతృప్తి చెందుతారన్నట్లుగా పరిస్థితి మారింది.

ఏకపక్ష నిర్ణయాలు.. ఎదురు దెబ్బలు.. అంతా నా ఇష్టం అనుకుంటే ఇదే పరిస్థితి ?

ఇంత దారుణంగా పాలన ఉన్నదంటే దానికి కారణం ఎవరు? వందశాతం ముఖ్యమంత్రినే అనిచెప్పుకోవచ్చు. కానీ ముఖ్యమంత్రి అంటే వ్యక్తి కాదు. వ్యవస్థ. ఆయన కేంద్రంగా అధికార వ్యవస్థ అంతా పని చేస్తూ ఉంటుంది. ఆయన విఫలం అయ్యారంటే వ్యవస్థ విఫలమైనట్లుగానే భావించాలి. మరి ఎందుకు వ్యవస్థ విఫలమవుతోంది. ఎవరు ఎంత మంది పని చేసినా.. ఆ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఉచితానుచితాలు మరిగి.. రాష్ట్రానికి ఏది మంచిదో అది గుర్తించగలిగే పరిస్థితులో ఉండాలి. కానీ తనకు ప్రజలు తిరుగులేని మెజార్టీ ఇచ్చారని తాను అనుకున్నదే పాలన అనుకుంటేనే సమస్య వస్తోంది. ఇప్పటి వరకూ అలా అనుకోబట్టే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇదే విధంగా మరో రెండున్నరేళ్లు సాగినా.. చివరికి ఎక్కడ ప్రారంభమయ్యామో అక్కడే ఉంటారు.. ఇంకా చెప్పాలంటే వెనక్కి పోతారు. కానీ ముందుకెళ్లే పరిస్థితి ఉండదు.

ఇదే పరిస్థితి కొనసాగితే “ఉరేసుకున్న రాజు” గతే !

ఒకానొక సమయంలో ఓ రాజు ఉండేవాడు. అతని మాటకు తిరుగులేనంత అధికారం చెలాయించేవాడు. న్యాయం ధర్మం అంటూ ఒక పద్ధతి ఏమీ ఉండదు. రాజు ఏమి చెబితే అదే వేదం. ఓ సారి ఓ దొంగ.. దొంగతనానికి వెళ్లి గోడకూలి చచ్చిపోతాడు. ఆ దొంగ కొడుకు వెళ్లి తన తండ్రి వృత్తి చేసుకుంటూ చచ్చిపోయాడు కాబట్టి గోడ కట్టించని ఇంటి యజమానిని శిక్షించమంటాడు. అది నిజమే కదా అనుకుంటాడు రాజు. ఇంటి యజమానికి పిలిపిస్తాడు. ఇంటి యజమాని మేస్త్రిది తప్పంటాడు. మేస్త్రి తప్పు నాది కాదు కట్టే ముహుర్తం పెట్టిన వాడిదంటాడు. ఆ ముహుర్తం పెట్టే వాటిని ఉరి తీయమని రాజు ఆజ్ఞాపిస్తాడు. దానికి ఆ ముహుర్తం పెట్టే వ్యక్తి కూడా సంతోషిస్తాడు. తనను వెంటనే ఉరి తీయమని బతిమాలుతాడు. అందరూ వదిలేయమని బతిమాలుతూంటే.. ఇతను మాత్రం ఎందుకు అలా అడుగుతున్నాడని ఆరా తీస్తాడు. రాజు ఉరి తీయమని ఆదేశించిన సమయం వెయ్యేళ్లకు ఒకసారి వస్తుంది..అప్పుడు ఉరి తీయబడిన వాళ్లు తర్వాత చక్రవర్తి అవుతారని అందుకే అలా అంటున్నానని గురువు చెబుతాడు. అసలే మూర్ఖపు రాజు.. ఊరుకుంటాడా..ఆ గురువును వదిలేసి..ఆ ముహుర్తానికి తనను ఉరి తీయమని ఆదేశిస్తారు. అప్పటికే అతని బాధలు పడిన వారు అలాంటి అవకాశాన్ని వదులుకుంటారా..? పని పూర్తి చేస్తారు.

ఇది ఓ నీతి కథే. కానీ మన పురాణాల్లో.. ఇతి హాసాల్లో నీతి కథలు ఊరకనే పుట్టవు. వాటికి ప్రతీ కాలంలోనూ ఓ ఉదాహరణ బయటపడుతూనే ఉంటుంది. ఈ ఉరేసుకున్న రాజు నీతి కథకు ఏపీలో పాలనే ఉదాహరణగా చెప్పుకునే పరిస్థితి రాకుండా ఉండాలంటే … ఇప్పటికైనా మనసు మార్చుకోవాలి. అధికారం అనే అహంతో కాకుండా బాధ్యత అనే భావంతో పాలన చేయాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

రోజా దాచిన మద్యం డంప్ పట్టించిన సొంత పార్టీ నేతలు

ఏపీలో మద్యం దుకాణాలను గుప్పిట్లో పెట్టుకుని వైసీపీ నేతలు చాలా మందుగానే అన్ని నియోజకవర్గాలకు మద్యాన్ని సరఫరా చేసి పెట్టుకున్నారు. అది అధికారిక మధ్యమా.. పన్ను కట్టని మద్యమా అన్నదానిపై ఇంకా క్లారిటీ...
video

‘మ‌న‌మే’ టీజ‌ర్‌: క్యారెక్ట‌ర్ల మ‌ధ్య క్లాషు!

https://www.youtube.com/watch?v=_4Ff1zVtKkw శర్వానంద్ - శ్రీ‌రామ్ ఆదిత్య కాంబినేష‌న్‌లో 'మ‌న‌మే' రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ రూపొందిస్తోంది. శ్రీ‌రామ్ ఆదిత్య త‌న‌యుడు ఈ చిత్రంలో...

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close