“ శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్. అద్భుతమైన భవిష్యత్ ఈ అడుగే పెద్ద పునాది “
అని గూగుల్ విశాఖలో పెట్టాలనుకుంటున్న 15 బిలియన్ డాలర్ల ఏఐ హబ్ పెట్టుబడి ఒప్పందం జరిగిన తర్వాత భారత వ్యాపార, పారిశ్రామిక రంగం స్పందించింది. దిగ్గజ పారిశ్రామికవేత్తలు, ఫిలాంత్రఫిస్టులు అందరూ ఇది ఆంధ్ర భవిష్యత్‌కు మంచి సూచిక అని విశ్లేషించారు. నిజానికి ఈ పెట్టుబడి విషయంలో వీరంతా ఇంతలా స్పందించాల్సిన అవసరం లేదు. కానీ వారు స్పందించారు ఎందుకంటే.. ఆంధ్రప్రదేశ్ ఓ ఫీనిక్స్ లా ఎదుగుతోంది. ఓ మహా ఉత్పాతం తర్వాత ఇక ఆ రాష్ట్రం కోలుకోవడం కష్టం.. ఆ వైపు చూడటం కూడా వ్యర్థం అనుకున్న వ్యాపార, పారిశ్రామిక సమాజం ఇప్పుడు కనిపిస్తున్న మార్పు చూసి.. స్పందించకుండా ఉండలేకపోయింది.
ఏపీకి ఓ మంచి అవకాశం
15 బిలియన్ డాలర్లు ఒకే సంస్థ పెట్టుబడి పెట్టడం, అది కూడా ఐదేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకోవడం చిన్న విషయం కాదు. లక్షా పాతిక వేల కోట్ల రూపాయల పెట్టుబడిని .. ఏటా పాతిక వేల కోట్లు ఖర్చు పెట్టి గ్రౌండ్ చేస్తారు. గూగుల్ కు నిధుల సమస్య లేదు. వారు ఏ బ్యాంక్ దగ్గరా అప్పులు చేయాల్సిన అవసరం లేదు. మరో సంస్థతో భాగస్వామ్య ఒప్పందం చేసుకోవాల్సిన పని లేదు. వారికి కావాల్సింది తమ ప్రణాళికల ప్రకారం పనులు పూర్తవడం. దానికి విశాఖలో అవకాశాలు ఉన్నాయని గట్టిగా నమ్మారు. ప్రభుత్వం కూడా వారు పెట్టుబడులు పెట్టడం వల్ల వచ్చే ఆదాయంలో కొంత మొత్తం సబ్సిడీల రూపంలో ఇచ్చింది. కానీ దీర్ఘకాలంలో ఆ గూగుల్ ఏఐ హబ్ ఏపీకి అతి పెద్ద ఆదాయవనరుగా మారుతుంది. విశాఖ ఏఐ ఎకోసిస్టమ్‌లో కీలంగా మారుతుంది. అది వందల కంపెనీలు.. వేల స్టార్టప్‌లు.. లక్షల ఉద్యోగాలను సృష్టిస్తుంది. దాని వల్ల ప్రభుత్వానికి, ప్రజలకు చేరే మేలుతో అంచనా వేస్తే.. ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకాలు చాలా తక్కువే. కియా పరిశ్రమకు ఇచ్చిన ప్రోత్సాహకాల కంటే ఎక్కువ ఇప్పుడు ఆదాయం లభిస్తోంది. దేశవ్యాప్తంగానే కాదు.. ఇతర చోట్లకు ఎగుమతి అవుతున్న కార్లకు మన దగ్గర టాక్స్ కట్టి వెళ్తున్నారు. అలాగే గూగుల్ వల్ల వచ్చే ఆదాయాన్ని కూడా అంచనా వేయడం కష్టం. ఎలా చూసినా ఇది గేమ్ ఛేంజర్ అనడంలో సందేహం లేదు. ఈ పెట్టుబడిని తీసుకురావడానికి నారా లోకేష్ అవిశ్రాంతంగా కృషి చేశారు. ఆయన ప్రయత్నాలకు ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహకరించారు. సమష్టి కృషితో ఓ అద్భుతమైన విజయాన్ని ఏపీకి అందించారు.
ఎవరూ బాగుచేయలేరనుకున్న రాష్ట్రం.. పట్టాలెక్కుతోంది !
2024లో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత జగన్ రెడ్డి హయాంలో జరిగిన విధ్వంసం, కోల్పోయిన నమ్మకం, పెట్టుబడిదారుల విశ్వాసం మళ్లీ సంపాదించుకోవడం అసాధ్యమన్న అభిప్రాయం వినిపించింది. జగన్ రెడ్డి చేసిన విధ్వంసాన్ని గుర్తు చేసుకుంటే ఎవరికైనా రక్తం మరిగిపోతుంది. సొంత భూమికి సేవ చేద్దామని అమెరికా నుంచి వచ్చి అమరరాజా పరిశ్రమను పెట్టి అమరాన్ బ్రాండ్ ను ప్రపంచవ్యాప్తం చేసిన గల్లా కుటుంబాన్ని .. మేమే వెళ్లిపొమ్మని బతిమాలుతున్నామని సజ్జల సిగ్గులేకుండా మాట్లాడారు. వారు తమ పరిశ్రమ విస్తరణ ప్రణాళికల్ని తెలంగాణకు తీసుకెళ్లి పది వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారు. అదే చిత్తూరులో పెట్టి ఉంటే పదివేల మందికి ఉపాధి లభించి ఉండేది. ప్రభుత్వానికి ఆదాయం వచ్చి ఉండేది. ఇది ఒక్కటి మాత్రమే .. పీపీఏల రద్దు గురించి జగన్ రెడ్డి చేసిన అరాచకం లూలు వరకు కొనసాగింది. వీరిలో చాలా మంది తాము భవిష్యత్ లో ఆంధ్ర వైపు కూడా వచ్చేది లేదని బహిరంగంగానే ప్రకటించారు. పీపీఏలు, అమరావతి ఒప్పందాలను రద్దు చేయడమే కాదు.. కేసులు పెడతామని సింగపూర్ అధికారుల్ని బెదిరించడం ద్వారా అంతర్దాతీయంగా పెట్టుబడిదారులు విశ్వాసం కోల్పోయారు. దావోస్‌లో ఏపీ గురించి జోకులేసుకునే పరిస్థితి వచ్చింది. అలాంటి స్థితి నుంచి ఏపీ మెరుగుపడుతుందని.. పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పొందుతుందని ఎవరూ పెద్దగా నమ్మకం పెట్టుకోలేదు. కానీ సంక్షోభాలను అవకాశాలుగా తీసుకునే అలవాటు ఉన్న చంద్రబాబునాయుడుకు, తండ్రిని మించిన తనయుడిగా పేరు తెచ్చుకునేందుకు ఉత్సాహంగా పని చేస్తున్న నారా లోకేష్ తోడయ్యారు. ఇద్దరూ కలిసి నిరంతరం పారిశ్రామికవేత్తలకు నమ్మకం కలిగించడానికి, ఆ భూతం మళ్లీ రాదని భరోసా ఇచ్చి.. మెల్లగా వారికి నమ్మకం పెంచారు. ఏడాది పాటు వారు చేసిన ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ఇప్పుడు పాత విషయాలు మర్చిపోయి మళ్లీ ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు. వారి ఆసక్తిని గమనించి ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేసుకుంటూ మెల్లగా అందర్నీ ఏపీ వైపు చూసేలా చేస్తున్నారు. ఆ ఫలితాలు ఇప్పుడు వస్తున్నాయి.
ఎంవోయూలు కాదు నేరుగా ఒప్పందాలే !
విశాఖలో సునామీ వచ్చిన తర్వాత వేగంగా కోలుకోవడానికి చంద్రబాబు ఎంత తీవ్రంగా శ్రమించారో.. ఐదు సంవత్సరాల సునామీ లాంటి పాలన తర్వాత రాష్ట్ర పారిశ్రామిక రంగంపై విశ్వాసం పెంచడానికి చంద్రబాబు,లోకేష్ అంత కంటే ఎక్కువగా శ్రమించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఎంవోయూలు చేసుకుని పెట్టుబడులు వస్తున్నాయని ప్రచారం చేసుకోవడానికి వారు ఇద్దరూ ఇష్టపడలేదు. దావోస్ పెట్టుబడుల సదస్సుకు వెళ్లినప్పుడు ఒక్క రూపాయి పెట్టుబడికి ఎంవోయూ చేసుకోలేదు. కానీ రాష్ట్రంలో ఉన్న పెట్టుబడుల అవకాశాల గురించి విస్తృత ప్రచారం చేశారు. అక్కడ ఆసక్తి వ్యక్తం చేసిన వారు.. విస్తరణ ప్రణాళికల్లో ఉన్న పారిశ్రమిక వేత్తల్ని గుర్తించి నిరంతరం ఫాలో అప్ చేసుకున్నారు. దాని ఫలితమే విశాఖకు కాగ్నిజెంట్, యాక్సెంచర్, సిఫి వంటి సంస్థలు తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ను విశాఖలో క్యాంపస్ ఏర్పాటు చేయడానికి ఒప్పించడంతో మొదటి అడుగు పడింది. నారా లోకేష్ నేరుగా టీసీఎస్ చైర్మన్ చంద్రశేఖరన్ తో టచ్ లోకి వెళ్లి ఈ క్యాంపస్ ఏర్పాటును ప్రకటించేలా చేసుకున్నారు. అందుబాటులో ఉన్న భవనంలోనే వేగంగా ఈ క్యాంపస్ ప్రారంభమవుతుంది. శాశ్వత భవనాల నిర్మాణాన్ని కూడా ఈ ఏడాదే ప్రారంభించబోతున్నారు. కాగ్నిజెంట్, యాక్సెంచర్లు కూడా .. తమ కార్యకలాపాలను ముందుగానే ప్రారంభించబోతున్నాయి. తర్వాత తమకు కేటాయించిన స్థలాల్లో పూర్తి స్థాయి భవనాలను నిర్మించుకుని డెవలప్మెంట్ సెంటర్లను విస్తరించనున్నాయి. ఉత్తరాంధ్ర సేవల రంగానికి కేంద్రంగా మారుతుంది. విశాఖ లాంటి ఓ అందమైన నగరానికి సాఫ్ట్వేర్, ఏఐ హబ్ లుక్ వస్తే అభివృద్ధికి హద్దే ఉండదు. ఇక రాయలసీమను తయారీ రంగానికి కేంద్రంగా మార్చాలని విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు చేసిన ప్రయత్నాలు అప్పట్లోనే మంచి ఫలితాలను ఇచ్చాయి. అనంతపురంను ఆటోమోబైల్ హబ్ గా మార్చే ప్రయత్నంలో కియా పరిశ్రమను తీసుకు వచ్చారు. శ్రీసిటీలో అన్ని రకాల తయారీ రంగ పరిశ్రమలు కొలువుదీరుతున్నాయి. త్వరలో హుందాయ్ కూడా ప్లాంట్ ను ప్రారంభించాలన్న ఆలోచనలో ఉంది. తిరుపతిలో ఎలక్ట్రానిక్స్ తయారీ హబ్ ఏర్పాటు చేశారు. కర్నూలులో పారిశ్రామిక కారిడార్ రూపుదిద్దుకుంటోంది. అమరావతి ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా.. విద్య, ఉద్యోగ, ఉపాధి కల్పనల కేంద్రంగా మారనుంది. క్వాంటం హబ్ ను అమరావతిలోనే ఏర్పాటు చేస్తున్నారు. ఇలా ఏపీ నలుమూలలా స్పష్టమైన ప్రణాళికలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించేందుకు ముందడుగు వేస్తోంది.
అరాచక కుట్రల వైసీపీనే అడ్డంకి !
అయితే ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న అతి పెద్ద అవరోధం హోదా లేని ప్రతిపక్ష పార్టీ విధ్వంసకర విధానాలే. ప్రజలు పూర్తి స్థాయిలో తరిమికొట్టినా మమ్మల్ని నమ్మే ఓటర్లు ఇంకా ఉన్నారంటూ వారు చేస్తున్న అత్యంత దారుణమైన కుట్రలు రాష్ట్ర భవిష్యత్ కు పెను ప్రమాదంగా మారుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలకు అధికారం పోయిన తర్వాత కూడా కంటిన్యూటీ ఉండేలా చేయడం వైసీపీ ప్రత్యేకత. ఇప్పుడు పరిశ్రమలు వస్తూంటే రాకుండా చేయడానికి.. అమరావతి నిర్మిస్తూంటే ఆపడానికి చేయాల్సిన పనులన్నీ చేస్తున్నారు. గూగుల్ డేటా సెంటర్ పై ఇప్పుడు వారు చేస్తున్న వ్యతిరేక ప్రచారం చూస్తూంటే తినే కంచంలో మట్టి పోసుకునే మూర్ఖులు గర్తుకు వస్తారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంత పాజిటివ్ గా స్పందించారో తెలిసి కూడా వారు ఇలా వ్యతిరేకంగా స్పందించడాన్ని ఏమనాలో నిర్ణయించడం సాధ్యం కాదు. పాజిటివిటీ వస్తుందని.. ఆ డేటా సెంటర్ తామే తెచ్చామని చెప్పుకునేందుకు వెనుకాడటం లేదు. దానికి ఆదాని లింక్ పెట్టుకున్నారు. గూగుల్ ..తాము అదానీ గ్రూప్ తో జాయింట్ వెంచర్ గా చేపట్టామని ప్రకటించలేదు. కేవలం గూగుల్ డెటా సెంటర్ ప్రాజెక్టులో భాగం అయిన రెన్యూవబుల్ ఎనర్జీ పనులను అదానీ గ్రూప్ చేస్తుంది. దానర్థం భాగస్వామ్యం అయినట్లు కాదు. కాంట్రాక్టర్‌గా పని చేస్తుంది. అమరావతిలో నిర్మాణాలను ఆపడానికి.. నిధులు రాకుండా చేయడానికి జగన్ రెడ్డి అండ్ గ్యాంగ్ చేస్తున్న, చేసిన ప్రయత్నాలు బయటకు తెలిసినవి కొన్నే. వారు చేసిన నిర్వాకాల గురించి బయటకు వస్తే చాలా మంది ఆశ్చర్యపోతారు. సొంత రాజధానిపై ఇప్పటికీ కుట్రలు చేస్తున్నారు. ఏపీకి పరిశ్రమలు వస్తే.. ఏపీకి రాజధాని సమకూరితే ఎవరు బాగుపడతారు?. చంద్రబాబునాయుడు బాగుపడతారా? . ఆయన సామాజికవర్గం బాగుపడుతుందా?. రాష్ట్రం మొత్తం బాగుపడుతుంది. మన పిల్లలకు మంచి విద్యావకాశాలు, మంచి ఉద్యోగావకాశాలు వస్తాయి. చదువులు కాగానే ఎక్కడెక్కెడికో పోయే అవకాశం ఉండదు. మంచి వైట్ కాలర్ జాబ్స్ మన రాష్ట్రంలోనే వస్తాయి. కానీ. .ప్రజల్ని ఓటు బ్యాంకులుగానే చూసే వైసీపీ పార్టీకి ఇదంతా పట్టదు. ఎప్పటికప్పుడు రాష్ట్రానికి నష్టం చేద్దామా.. శాంతిభద్రతల సమస్యలు సృష్టించి ప్రజల్ని, పెట్టుబడిదారుల్ని భయపెడతామా అన్న ఆలోచనల వరకే వారి మైండ్ సెట్ ఉంటుంది.
రాష్ట్ర వ్యతిరేకుల్ని బహిష్కరించాల్సిన సమయం !
ఇప్పుడు ఇలాంటి వారిని లెక్క చేయకుండా వారి కుట్రలు, కుతంత్రాలను చేధించడానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని అయినా ముందుకు పోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇటీవల కల్తీ మద్యం పేరుతో డ్రామా ఆడటానికి చేసిన అతి పెద్ద కుట్ర ఉన్న ప్రణాళిక చూస్తే.. త్వరలో వారు ఎవరూ ఊహించనన్ని కుట్రలు రాష్ట్రంపై చేయడం ఖాయంగా కనిపిస్తోంది. క్రిమినల్ మైండ్ సెంట్ ఉన్న వారు ఎప్పుటికీ మారరు. వారు చేస్తున్న పనులు.. కరెక్టే చేస్తున్నామని అనుకునేలా ఉంటాయి. అలాంటి వారి నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవాలంటే.. ప్రజల్ని చైతన్య వంతం చేయాల్సిఉంది. రానురాను వారి గురించి ప్రజలకు తెలిసేలా చేసి.. వారిని ఎంతదూరం చేస్తే రాష్ట్రం అంత బాగుపడుతుందని అర్థమయ్యేలా చెప్పగలగాలి. అప్పుడు మాత్రమే.. ఏపీకి పూర్తి స్థాయిలో ప్రశాంతత లభిస్తుంది.