వైసీపీ ఎప్పుడూ నెత్తిమీద చెయ్యి పెట్టుకునే పనులే చేస్తుంది. కల్తీ నెయ్యి విషయంలోనూ అదే జరిగింది. ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ రాజ్యాంగవిరుద్ధమంటూ సుబ్రహ్మణస్వామితో పిటిషన్ దాఖలు చేయించింది. అందులో రాజ్యాంగవిరుద్ధమేమీ లేదని.. ఏకసభ్య కమిటీ తన పని తాను చేసుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆ కమిటీపై ఏమైనా సందేహాలు ఉంటే.. వైసీపీ పటాపంచలు చేసినట్లయింది.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారనే ఆరోపణల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అత్యున్నత న్యాయస్థానం మద్దతు తెలిపింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిటీ విచారణను కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
గత ప్రభుత్వ హయాంలో లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందనే ఆరోపణలపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ పర్యవేక్షణలోని ప్రత్యేక దర్యాప్తు బృందం ( ఇప్పటికే విచారణ చేసింది. ఈ సిట్ తన నివేదికను సమర్పించి, నెల్లూరు ఏసీబీ కోర్టులో చార్జిషీటు కూడా దాఖలు చేసింది. అయితే, ఈ నివేదిక ఆధారంగా లోపాలను సరిదిద్దేందుకు , బాధ్యులపై చర్యలకు సిఫార్సు చేసేందుకు ఏపీ ప్రభుత్వం దినేష్ కుమార్ కమిటీని నియమించింది.
ఈ ఏకసభ్య కమిటీ నియామకాన్ని సవాల్ చేస్తూ సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు నియమించిన సిట్ విచారణ జరుగుతున్నప్పుడు, రాష్ట్ర ప్రభుత్వం సమాంతరంగా మరో కమిటీని వేయడం చట్టవిరుద్ధమని, ఇది రాజకీయ ప్రేరేపితమని ఆయన వాదించారు. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ వాదనతో ఏకీభవించలేదు. సిట్ తన దర్యాప్తును పూర్తి చేసి నివేదిక ఇచ్చిన తర్వాత, ఆ నివేదికను పరిశీలించి పాలనాపరమైన చర్యలు తీసుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని అభిప్రాయపడింది. ఏకసభ్య కమిటీ దర్యాప్తులో జోక్యం చేసుకోవడానికి ధర్మాసనం నిరాకరించింది.
ఈ తీర్పుతో వైసీపీ నేతలకు పెద్ద షాక్ తగిలినట్లయింది. ప్రభుత్వం సిట్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునేందుకు మార్గం సుగమమైంది. 45 రోజుల్లోగా తన నివేదికను సమర్పించాలని దినేష్ కుమార్ కమిటీని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది.
