“ఇది అమెరికా కాదు.. మనం ఎప్పుడూ ఇలా చేయలేదు”
అని మాజీ అధ్యక్షుడు క్లింటన్ ఓ సందర్భంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అమెరికా పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ప్రపంచం మొత్తం మహోన్నతునిగా కీర్తించే అబ్రహాం లింకన్ పరిపాలించిన అమెరికాను డొనాల్డ్ ట్రంప్ లాంటి లీడర్ పరిపాలిస్తాడని ఎవరైనా ఊహించి ఉంటారా?. ఎవరూ ఊహించి ఉండరు. ఎందుకంటే అమెరికా ఆత్మ ఏమిటో తెలుసుకుని అందరూ పరిపాలన చేస్తారు. అమెరికాను ఉన్నతంగా చేసిందేమిటి..? పెద్దన్నగా గౌరవం ఇచ్చిన అంశాలేమిటి ..? అన్నది తెలియకుండా ఎవరూ పరిపాలన చేయరు. కానీ డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నారు. మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ “మాగా” పేరుతో అమెరికాను సర్వనాశనం చేస్తున్నారు. అమెరికన్లలో భావోద్వేగాన్ని రెచ్చగొట్టి అదే రాజకీయం చేస్తున్నారు. ఆయన నాయకత్వంలో అమెరికా ఉండేది నాలుగేళ్లే అయినా.. ఆ దేశం మరో యాభై ఏళ్లు అయినా కోలుకోలేనంత నష్టం జరుగుతుంది. అమెరికాను పరిపాలించిన అనేక మంది అధ్యక్షులు చివరికి రిపబ్లికన్ మాజీ ప్రెసిడెంట్స్ తో సహా అందరూ ట్రంప్ పాలనను చూసి బాధపడుతున్నారు. అమెరికా గతి ఏమవుతుందోనని కంగారు పడుతున్నారు.
ముస్లింలతో పాటు హిందువులపైనా విద్వేష వ్యూహం
టెక్సాస్‌లో వాలంటీనా గోమెజ్ అనే మాగా ఉద్యమం మద్దతుదారు, ట్రంప్ పార్టీ సభ్యురాలు, టెక్సాస్ నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నా లీడర్ .. బహిరంగంగా ఖురాన్‌ను తగులబెట్టారు. ముస్లింలను దేశం నుంచి తరిమేయాలని ఉద్యమం చేస్తున్నారు. ముస్లింలను రెచ్చగొట్టేందుకు వారిని ఉగ్రవాదులుగా చెప్పేందుకు ఆమె చేయని ప్రయత్నాలు ఉండవు. తీవ్ర విమర్శలు వస్తున్నా.. గోమెజ్‌ను ఆపేవారు లేరు. టెక్సాస్కే చెందిన మరో రిపబ్లికన్ పార్టీ నాయకుడు, వచ్చే ఏడాది జరగనున్న సెనెట్ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేయనున్న అలెగ్జాండర్ డంకన్ హిందువులపై ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. అక్కడ హిందువులు నిర్మించిన భారీ హనుమాన్ విగ్రహాన్ని చూపిస్తూ.. మనది క్రిస్టియన్ దేశం.. హిందూ దేవుళ్లు ఫాల్స్ గాడ్స్.. వారి విగ్రహాలు ఎక్కడ ఎందుకు అని ప్రశ్నించడం ప్రారంభించారు. అంటే ముస్లింలు, ఇటు హిందువుల్ని వ్యతిరేకించే విద్వేషాన్ని వారు రాజకీయంగా పెంచుతున్నారు. ఇది ట్రంప్ విధానం. అమెరికా సెక్యులర్ స్టేట్. ఆ దేశంలో ప్రపంచంలోని నలుమూలల నుంచి వచ్చిన వాళ్లు అమెరికన్లుగా మారారు. అలాంటి చోట్ల జాతి విద్వేషం అంటే ఎంత ప్రమాదకర పరిస్థితులు ఏర్పడతాయో కాస్త అంటే కాస్త ఆలోచన జ్ఞానం ఉన్న ఎవరికైనా అర్థమైపోతుంది. ట్రంప్ తన రాజకీయం కోసం అమెరికాలో ఈ జాతి విద్వేషాల బీజం నాటేశారు. అది చెట్టుగా మారేకొద్ది అమెరికా కల్లోల దేశంగా మారిపోతుంది. ట్రంప్ అప్పటికి ఉంటారో ఉండరో కానీ.. ఆయన చేసిన పనుల వల్ల అమెరికన్లు దశాబ్దాల తరబడి ప్రతిఫలం అనుభవించబోతున్నారు. అమెరికా అంటే అత్యంత భద్రతతో కూడిన దేశం. చిన్న దొంగతనానికీ అవకాశం ఉండదని అనుకుంటారు. కానీ ట్రంప్ పరిపాలనలోకి వచ్చిన కొంత కాలంలోనే ఆ దేశంలో శాంతిభద్రతలు దిగజారిపోయాయి. అల్లర్లు జరగడం కామన్ అయిపోయింది. చివరికి ట్రంప్ భావజాలాన్ని మోస్తున్న వారిని చంపేయాలన్నంత విద్వేషం పెరిగిపోయింది. చార్లీ కిర్క్ హత్య తర్వాత ట్రంప్ సృష్టించిన ఓ భయంకర జాతి విద్వేషం ఎం ప్రమాదకరంగా విస్తరిస్తుందో నిపుణులకు అర్థమైపోయింది. అందుకే వారు అమెరికా భవిష్యత్ గురించి ఆందోళన చెందుతున్నారు.
బంగారుగుడ్లు పెట్టే బాతుని చంపేసుకున్న ట్రంప్
డొనాల్డ్ ట్రంప్ ఓ వైపు అమెరికా సమాజాన్ని విచ్చిన్నం చేసి .. విద్వేషాలను పెంచి పోషిస్తూండటమే కాదు.. అమెరికాను అన్ని రంగాల్లో కుంగదీస్తున్నారు. ప్రపంచానికి నాయకత్వం వహిస్తున్నామని .. తమ కంపెనీలు ప్రపంచం మొత్తం వ్యాపారం చేసి లక్షల కోట్ల లాభాలను సంపాదిస్తున్నాయని గుర్తించడం లేదు. ఆయా కంపెనీలు అమెరికాలోనే పెట్టుబడులు పెట్టాలని, అమెరికాలోనే తయారు చేయాలని.. అమెరికన్లనే నియమించుకోవాలని ఆంక్షలు పెడుతూ ఆయా కంపెనీలను విరక్తి పుట్టిస్తున్నారు. ఇటీవల టెక్ దిగ్గజాలతో సమావేశం పెట్టి ఎవరు ఎంత అమెరికాలో పెట్టుబడులు పెడతారో చెప్పాలని బెదిరించారు. వారు ఏవో లెక్కలు చెప్పారు. పెడతారో లేదో తెలియదు కానీ ఆయన బాధను తాత్కలికంగా తప్పించుకున్నారు. కానీ ఆ కంపెనీలు అమెరికాలోనే పుట్టి ..అమెరికాలోనే వృద్ధి చెంది.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కంపెనీలుగా ఎదిగాయని ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తూ అమెరికా అర్థిక వ్యవస్థకు ఊహించనంత బలం తెచ్చి పెట్టాయని ట్రంప్ గుర్తించలేదు. అమెరికాలో సంపాదించి ఆ కంపెనీలు ఇతర దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నాయని అనుకుంటున్నారు. ఆయనకు చెప్పేవారు లేరు…తెలుసుకునేందుకు సిద్ధంగా లేరు. రాత్రికి రాత్రి అమెరికా నుంచి ఇండియన్స్ ను, చైనీయులను పంపించేస్తే అమెరికన్లకు ఉద్యోగాలు వస్తాయని అనుకుంటారు. ఆయనకు తెలుసు అది సాధ్యం కాదని. కానీ ట్రంప్ నిర్ణయాలు తీసుకుంటోంది కేవలం సంపాదన కోసం. భారత్‌లో రాజకీయ నేతలు తాము ఏం చేసినా ప్రజల కోసమే చేశామని చెబుతారు. కానీ చాలా నిర్ణయాలు ప్రజల కోసం కాదు .. వారి స్వార్థం కోసం. అచ్చంగా ట్రంప్ అదే ఫార్ములా ప్రయోగిస్తున్నారు. ట్రంప్ స్వార్థం కోసమే ఇలా అన్ని విషయాలనూ ధరలు నిర్ణయిస్తూ.. అమెరికాను అమ్మకానికి పెట్టారు. ట్రంప్ తాను వచ్చాక వసూలు చేస్తున్న ప్రతి డాలర్ అమెరికన్ల నుంచి వసూలు చేస్తున్నదే. ఇతర దేశాలు ఒక్క డాలర్ కూడా అమెరికాకు కప్పం కట్టడం లేదు. ఎందుకంటే అమెరికాకు ఎవరూ సామంతులు లేరు. కానీ ట్రంప్ తమ దేశ ప్రజలకు చెప్పేది మాత్రం ఇతర దేశాలపై పన్నులు వేస్తున్నామని.
తగ్గిపోతున్న అమెరికన్ల జీవన ప్రమాణాలు
ట్రంప్ అన్ని దేశాలైప రిపోక్రసిల్ టారిఫ్‌లు వేశారు. ఆ టారిఫ్‌ల వల్ల ఆదాయం భారీగా వస్తోంది. 2025 ఆర్థిక సంవత్సరం జూన్ 2025 వరకు మొదటి 9 నెలలు 108 బిలియన్ డాలర్ల ఆదాయం సుంకాల ద్వారా వచ్చింది. ఆగస్టులో 29.5 ఏకంగా బిలియన్ డాలర్ల ఆదాయం వచ్చింది. ఇది నెలవారీగా రికార్డు. ఇది మునుపటి సంవత్సరం ఆగస్టులో వచ్చిన 7 బిలియన్లతో పోలిస్తే 4 రెట్లు ఎక్కువ. టారిఫ్‌లు ఫెడరల్ ఆదాయంలో 5 శాతానికి చేరాయి. అంతకు ముందు రెండు శాతమే. 2025 చివరికి 300 బిలియన్ డాలర్లు సేకరణను లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ డాలర్లన్నీ ఆయన పన్నులు విధించిన దేశాలు కట్టడం లేదు. అమెరికన్లే కడుతున్నారు. ఇంపోర్ట్ ధరలు పెరగడంతో అమెరికాలోని ప్రతి కుటుంబంలోని వ్యక్తికి 1,300 డాలర్ల నుంచి 1700 డాలర్ల వరకూ అదనపు భారం పడిందని లెక్కలు తేల్చాయి. అంటే ఎవరు కడుతున్నట్లు?. అమెరికా ప్రజలకు అవసరమైన వాటిని దిగుమతి చేసుకుంటారు వ్యాపారులు. అప్పనంగా.. ఇండియా లేదా పాకిస్తాన్ పై జాలితో ఆయా దేశాల నుంచి ఏమీ దిగుమతి చేసుకోవు. ఎక్కడ ధరలు తక్కువగా ఉంటే అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటాయి. కొద్దిగా ఎక్కువ.. తక్కువగా అన్ని దేశాలపైనా పన్నులు వేశానని చెప్పుకున్నారు. ఆ పన్నులు కడుతోంది ఇప్పుడు అమెరికా ప్రజలు. వారి జీవన ప్రమాణాలను తగ్గించి.. వారి ఆదాయాన్ని ట్రంప్ తన ఖజానాకు చేర్చుకుంటున్నారు. దానికి ఆయన పెట్టుకున్న పేరు.. మేక అమెరికా గ్రేట్ ఎగైన్. ఒక్క పన్నులతోనే పని కాదు. H1B వీసాలకు లక్ష డాలర్లు ఫీజు నిర్ణయించడం అంటే ఆయన ఎంత అత్యాశలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. చివరికి గోల్డ్ కార్డ్ పేరుతో అమెరికా పౌరసత్వాలను అమ్మకానికి పెట్టారు. గోల్డ్ కార్డ్ పేరుతో 1 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ. 8.4 కోట్లు కోట్లు కడితే గ్రీన్ కార్డ్ లాంటి అన్లిమిటెడ్ రెసిడెన్సీ , పౌరసత్వాన్ని ఇస్తున్నారు. అలాగే ప్లాటినమ్ కార్డ్ పేరుతో 5 మిలియన్ డాలర్లు ..అంటే సుమారు రూ. 42 కోట్లు కడితే పౌరసత్వం, 270 రోజులు అమెరికాలో ఉండటానికి నాన్-US ఆదాయంపై ట్యాక్స్ మినహాయింపు కూడా ఇస్తున్నారు. 2 మిలియన్ డాలర్లకు కార్పొరేట్ గోల్డ్ కార్డ్ కు బేరం పెట్టారు. కంపెనీలు ఎంప్లాయీలకు స్పాన్సర్ చేయవచ్చట. ట్రంప్ చెప్పినట్లు, 1 మిలియన్ కార్డ్‌లు అమ్మితే 5 ట్రిలియన్ డాలర్ల ఆదాయం వస్తుంది. అంటే పది లక్షల మందికి అమెరికా పౌరసత్వం అమ్మేస్తున్నారు. గతంలో ప్రభుత్వాలు అమెరికాకు వచ్చే వీసాలు ఇవ్వాలన్నా, గ్రీన్ కార్డులు ఇవ్వాలన్నా ఫీజులు కాదు.. వారు దేశానికి ఎంత అవసరమో .. దేశాభివృద్ధికి ఎంత ఉపయోగపడతారో చూసేవి. స్వయంగా ఎలాన్ మస్క్ H1B వీసా మీదనే అమెరికాలో అనేక సంస్థలు ప్రారంభి ప్రపంచ కుబేరుడయ్యాడు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఊపు తీసుకువచ్చాడు. అదే H1Bలను నిలిపివేస్తే మస్క్ లాంటి వాళ్లు ఎంతో మంది ఇతర దేశాలకు వెళ్లిపోతారు. అమెరికా కంపెనీలు విదేశాలకు తరలి పోతాయి. ఎందుకంటే టెక్నాలజీ అనేది ఫ్యాక్టరీల్లో తయారయ్యేది కాదు.. మ్యాన్ పవరే ఆ రంగానికి ఫ్యాక్టరీ. వారు ఎక్కడ ఉంటే కంపెనీలు అక్కడికి వెళ్లిపోతాయి.
మిత్రదేశాలంటూ లేకుండా చేసిన ట్రంప్
ఇలా ఓ వైపు అమెరికా సమాజంలో విద్వేషం నింపుతూ భయం భయంగా గడిపేలా చేస్తూ.. మరో వైపు ఆ దేశ ప్రజలపై పన్నుల భారం మోపి జీవన ప్రమాణాలను తగ్గించడమే కాదు.. దశాబ్దాలుగా అమెరికా ప్రపంచం మొత్తం ఏర్పాటు చేసుకున్న సంబంధాలను దెబ్బతీస్తూ.. అమెరికాను ఓ కుటిల దేశంగా మార్చేస్తున్నారు. పదవి చేపట్టక ముందే పొరుగుదేశాలైన కెనడా, మెక్సికో, పనామా లాంటి దేశాలతో ఆయన ఆడిన పరాచికాలు అధ్యక్షుడు అయిన తర్వాత శృతి మించాయి. వైట్ హౌస్ కు పిలిచి ఉక్రెయిన్ అధ్యక్షుడ్ని బెదిరించారు. అలస్కాకు పుతిన్ ను పిలిచి యుద్ధ విమానాల ప్రదర్శన చేశారు. మోదీని పొగుడుతూ ఇండియాపై విషం కక్కుతున్నారు. ఉగ్రవాద దేశం పాకిస్తాన్ సన్నిహితమవుతున్నారు. చైనా ముందు నవ్వుల పాలవుతున్నారు. చివరికి ఐక్యరాజ్య సమితి సమావేశానికి వెళ్లి.. ఆ సమితి వేస్ట్.. ఆ సమితి చేయాల్సిన పనిని తానే చేశానని ఏడు యుద్ధాలను ఆపానని ఆయన చెప్పుకున్నారు. ఆయన ప్రసంగానికి అందరూ పగలబడి నవ్వుకున్నారు. అ నవ్వుల పాలయింది.. ట్రంప్ కాదు.. అమెరికానే.
అమెరికాకు జరిగే నష్టాన్ని కవర్ చేయడం కష్టం !
ప్రపంచశాంతికి అమెరికా పెనుముప్పుగా మారేలా చేస్తోంది ట్రంప్. యుద్ధాలను ట్రంప్ ఆపలేదుకానీ.. లేనిపోని వివాదాలను యుద్ధాల వరకూ తీసుకెళ్తోంది ట్రంపే. గాజాలో మారణహోమానికి ముమ్మాటికీ ట్రంపే కారణం. ఇజ్రాయెల్ రెచ్చిపోవడానికి ట్రంప్ ఇచ్చిన మద్దతే కారణం .. ఆ మద్దతుతోనే ఖతార్ పైనే ఇజ్రాయెల్ దాడి చేసింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆపేస్తానని సవాల్ చేసి.. అది చాలా కష్టం అని ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. కొలంబియాపై దాడికి సిద్ధమవుతున్నారు. ఆయన గిల్లికజ్జాలు పెట్టుకోని దేశానిధినేత ఉండరు. ఇప్పుడు అమెరికా తాను ఒంటరిగా మారడమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలకు కారణం అవుతోంది. అటు ఇంట.. అమెరికాకు మంట పెట్టారు.. బయట కూడా సెగ తగిలేలా చేసుకున్నారు. కానీ ట్రంప్ మాత్రం..పెద్ద ఎత్తున డాలర్లు వచ్చి పడుతున్నాయని అనుకుంటున్నారు. కానీ ఆయన బంగారు బాతును కోసేసి..గుడ్డును తీసేసుకున్నానని.. ఇక ముందు గోల్డెన్స్ ఎగ్స్ రావని తెలియడానికి ఎంతో కాలం పట్టదు. కానీ అమెరికాకు జరిగిన నష్టాన్ని ఎవరూ భర్తీ చేయలేరు… ట్రంప్ తో సహా ! … అందుకే.. పాపం అమెరికా !