ఎడిటర్స్ కామెంట్ : ప్రజాస్వామ్య రక్షతి రక్షితః !

” ప్రజాస్వామ్యాన్ని నువ్వు కాపాడితే.. నిన్ను ప్రజాస్వామ్యం కాపాడుతుంది. నువ్వే ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తే ఆ తర్వాత కాపాడటానికి ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంటుంది ?”. మన దేశంలో రాజకీయ నేతలకు ప్రజాస్వామ్యమే రక్ష. ఆ మాటకొస్తే మన దేశంలోనే కాదు… ఎక్కడైనా రాజకీయ నేతలకు ప్రజాస్వామ్యమే రక్ష. ప్రజాస్వామ్యం లేని చోట పాలక పక్షాలకు వ్యతిరేకమైన వారిని అంతం చేశారు. అదే వారి అధికారం కోల్పోయిన తర్వాత అంతం అయ్యారు. కానీ ప్రజాస్వామ్యంలో అలాంటివేమీ ఉండవు. ఉండకూడదు. ఉంటే అది నియంతృత్వం అవుతుంది. కానీ ముందూ.. వెనుకా చూడలేని నాయకులు పుట్టుకొస్తున్న సమయంలో దేశంలోనూ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. దానికి ఆంధ్రప్రదేశ్ పరిణామాలు పరాకాష్ట అని చెప్పుకోవచ్చు.

ప్రజాస్వామ్యంపై పట్టపగలు హత్యాయత్నం !

ప్రజాస్వామ్యంలో దాడులు అనే వాటికి చోటు లేదు. ఎన్నికల సమయంలోనే దాడులు పెరిగిపోతున్నాయి. ఓటర్లను భయపెడుతున్నారు. కానీ అది వేరు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజల తరపున పోరాడాల్సిన ప్రతిపక్షాలపై దాడులు చేయడం అంటే ప్రజాస్వామ్యంపై దాడి చేసినట్లే. డ్రగ్స్, గంజాయి స్మగ్లింగ్ ఆరోపణలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు సాక్ష్యాలు కావాలంటూ పోలీసులు నోటీసులు ఇవ్వడమే విడ్డూరం అయితే .. అలా నోటీసులు ఇవ్వడాన్ని ఆగ్రహంగా ప్రశ్నించినందుకు ఏకంగా ఇంటిపైకి వెళ్లి ఇల్లంతా ధ్వంసం చేయడం ఊహించడానికే అంతుబట్టని విషయం. అదే మూక నేరుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఆఫీసుకు వెళ్లి సుత్తులు, కర్రలు, రాళ్లు, పలుగులతో దాడులకు తెగబడటం చూసే వాళ్లను సైతం నివ్వెర పరిచింది. మనం ఎక్కడ ఉన్నాం అని వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి. సాక్షాత్తూ డీజీపీ ఆఫీసు పక్కన.. దాడి చేయడానికి వస్తున్నారని అని తెలిసినా ఆపకపోవడం.. దాడిలో పోలీసులు ఉండటం.. రెక్కీ వారే నిర్వహించడం అంతా.. ప్రజాస్వామ్యంపై పట్టపగలు జరిగిన దాడి.. ఓ రకంగా డెమెక్రసీపై మర్డర్ ఎటెంప్ట్ అని అనుకోవాల్సిందే..!

రాజకీయం ఏదైనా ప్రజాస్వామ్య పంథాలో ఉండాలి !

పట్టాభి మా సీఎంను అంత మాట అన్నాడు . మేం కొట్టకూడదా అని ప్రశ్నిస్తున్నారు రాజకీయ నేతలు. అనుకోవడం.. కొట్టుకోవడానికి అంత స్వేచ్చ మన ప్రజాస్వామ్యంలో లేదు. ఎందుకంటే అలాంటి నిబంధనలు పెట్టుకుంది కూడా మనమే. ప్రజాస్వామ్యం అంటేనే శాంతి .. సహనం. ఏదైనా ప్రజలే న్యాయనిర్ణేతలు. అంతే కానీ తీర్పు మేమే చెప్పేస్తాం.. శిక్షలు మేమే విధిస్తామంటూ ముందుకెళ్లకూడదు. కానీ దురదృష్టవశాత్తూ ఇక్కడ అదే జరుగుతోంది. పట్టాభి ” ఆ మాట ” అన్నారని ఆయన ఇంటిపైకి.. టీడీపీ నేతల ఇళ్లపైకి .. టీడీపీ కార్యాలయంపైకి దూసుకెళ్లి తమకు తాము “న్యాయం” చేసుకునే తీర్పును అధికార పార్టీ లఖించేసుకుంది. ఇక్కడ పట్టాభిది తప్పా.. అధికార పార్టీ తప్పా అన్నది కాదు సమస్య.. ఇద్దరూ కలిసి ప్రజాస్వామ్యానికి పాత వేయడానికి చెరో గొయ్యి తవ్వారన్నదే అసలు విషయం.

తిట్టడమే రాజకీయమన్న స్థితి నుంచి బూతుల వరకు !

ఆంధ్రప్రదేశ్‌లో గత రెండేళ్లలో రాజకీయాలు పూర్తి స్థాయిలో ఇదేనా ప్రజాస్వామ్యం అనేలా మారాయి. మీరు బూతులు తిడున్నారంటే.. మీరు బూతులు తిడుతున్నార ఆంధ్రప్రదేశ్‌లోని అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నాయి. రెండు పార్టీల నేతలు మీరు ఒకటి అంటే.. మేము పది అనగలమని తిట్టుకున్నారు. ఇప్పుడు దాడుల దశకు వచ్చేశారు. వ్యవస్థీకృతంగా జరిగిన దాడులను చూసిన తరవాత ఎవరికైనా ప్రజాస్వామ్యం ఉందా లేదా అనే ఓ రకమైన ఆందోళన ఏర్పడటం సహజం. ఏపీ పరిణామాలు అదే అభిప్రాయాన్ని కల్పించాయి. విమర్శిస్తే వెళ్లి దాడులు చేయడమేనా..? ప్రతిపక్ష పార్టీలకు రక్షణ ఉండదా..?. ఇలా అయితే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని ప్రశ్నించగలవా.. ? అనేది అందరికీ వచ్చిన సందేహం. రాజకీయంలో ప్రత్యర్థిని ఓడించాలంటే ప్రజలను మెప్పించాలి. ప్రత్యర్థి కన్నా తను గొప్ప అని ప్రజలకు నమ్మకం కలిగించి ఓట్లు వేయించుకుని గెలవాలి. అది గెలుపు. అంతే కానీ ప్రత్యర్థిని బండబూతులు తిట్టడం.. కొట్టాడనికి వెళ్లడం.. దాడులు చేయడం రాజకీయం కాదు. కానీ ఇప్పుడు ఇదే రాజకీయంగా మారిపోయింది.

బాధ్యత తెలియని అధికారం కళ్ల ముందు కనిపిస్తోంది..!

రాజకీయం వేరు.. అధికారం వేరు. అధికారం అంటే బాధ్యత. పరిపాలన చేస్తున్నవారు రాష్ట్రంలో చిన్న తప్పు కూడా జరగకూడదని అనుకుంటారు. అలా జరిగితే అది తమ చేతకాని తనం గా ప్రజల దృష్టిలో ముద్ర పడిపోతుదంని కంగారు పడిపోతారు. కానీ విచిత్రంగా ఆంధ్రప్రదేశ్‌లో స్వయంగా ప్రభుత్వాధినేతనే దాడులను ప్రోత్సహిస్తున్నారు. తనను తిడితే బీపీ వచ్చి తన ఫ్యాన్స్ వెళ్లి దాడులు చేసి వచ్చారని సీఎం జగన్ గర్వంగా చెప్పడం.. అందులో తప్పేమీ లేదన్నట్లుగా అన్న మాటలు విన్న తర్వాత రాష్ట్రంలో ఎవరికైనా భద్రత ఉంటుందా అన్న సందేహం కలగడం ఖాయం. అంటే అధికారంలో ఉన్నారు కాబట్టి వారు కొట్టినా.. తిట్టినా ..హ త్యలు చేసినా భరించాల్సిందే. నోరెత్తడానికి వీల్లేదు. అలా ఎత్తితే ఖూనీలు చేసేస్తారు. ముఖ్యమంత్రే అలా అన్నారు కాబట్టి ఇక మేమెందుకు అనకూడదని వందిమాగధులు అవే మాటలు వినిపిస్తున్నారు. దాడులు చేయడంలో తప్పేమీ లేదంటున్నట్లుగా ఉన్నారు. మంత్రులు హెచ్చరికలు చేస్తున్నారు. కొడతాం.. ఎక్కడ మాట్లాడితే ఖూనీలు చేస్తాం అంటున్నారు. ఇంత కన్నా ప్రజాస్వామ్య పాతకం ఏముంటుంది..?

దెబ్బకు దెబ్బ తీసుకుంటూ పోతే ఏం జరుగుంది..?

మాటకు మాట.. దెబ్బకు దెబ్బతీయకపోతే వాడిని చేతకాని వాడిగా జత కట్టేసే పరిస్థితి రాజకీయాల్లో వచ్చేసింది. అలాంటి పరిస్థితి తెచ్చుకోవాలని ఎవరూ అనుకోరు. రాజకీయాల్లో అసలు అనుకోరు. ఎందుకంటే ఎవరికీ అధికారం శాశ్వతం కాదు. ప్రపంచంలో ఏ దేశం చూసినా.. మన దేశంలోని అనేక రాష్ట్రాలు చూసినా.. ప్రతి ఐదేళ్లకు ప్రభుత్వాలు మారడమే చూశాం. అలా మారిపోయినప్పుడు.. కొత్తగా అధికారంలోకి వచ్చేవారు ఐదేళ్ల కాలంలో తాము ఎదుర్కొన్న కష్టనష్టాలకు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే పరిస్థితి ఏమిటి..? ఇప్పుడు రెండు చేసి ఉంటే.. తర్వాత వచ్చే వారు నాలుగు చేస్తారు. ఇవాళ అధికారంలో ఉన్న వాళ్లకి బీపీ వస్తే… రేపు అధికారంలోకి వచ్చే వారికీ బీపీ రాకుండా ఉంటుందా..? అలా బీపీలు తెచ్చుకుని దాడులు చేసుకుంటూ పోతే ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంటుంది ?

అధికారం పోయిన తర్వాత వెంటపడి కొడుతున్నా సానుభూతి రాదు !

” అందరూ శాకాహారులే.. కానీ బుట్టలో చేపలు మాత్రం మాయం” అయిపోయినట్లుగా ఉంటుంది మన నేతల తీరు. నిన్నటి వరకూ విమర్శల పేరుతో బూతులే తిట్టుకునేవారు కానీ ఇప్పుడు దాడుల వరకూ వెళ్లిపోయారు. దీంతో ప్రజల్లో కూడా ఓ రకమైన భయాందోళనలు కలుగుతున్నాయి. ప్రజాస్వామ్యం అంటే .. అధికారం ఉన్న వాళ్ల నియంతృత్వమా అనే భావన పెరిగిపోతోంది. వారు చేస్తే మేమే చేయలేమా అని ప్రతిపక్ష పార్టీలూ అదే బాటలో వెళ్లడం ప్రజాస్వామ్యాని కే పెను ప్రమాదంగా మారుతోంది. అధికారంలో ఉన్నప్పుడు తమ ప్రత్యర్థుల్ని చట్ట వ్యతిరేకంగా వేటాడితే అధికారం పోయిన తర్వాత అధికారంలోకి వచ్చే వారూ అదే చేస్తారు. అప్పుడు మాన, ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోతుంది. అప్పట్లో అలా చేసినా … గతంలో మీరు చేశారు కదా అనే ఫీలింగే వస్తుంది.. కనీస సానుభూతి కూడా దక్కదు.

ప్రజాస్వామ్య రక్షణ కావాలంటే ఇప్పటికైనా మారాలి !

” ఇంత కన్నా దిగజారడానికి ఏమీ లేదు అనుకున్న ప్రతీ సారి ఇంకా ఇంకా దిగజారిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ” అని రాజకీయాల్లో తలపండిపోయిన వాళ్లు బాధపడుతున్నారు. ప్రజాస్వామ్యం అధికారం ఉన్న వాడి చేతిలో బందీ అయిపోతే ఎవరికీ రక్షణ ఉండదు. ఇప్పుడు అలాంటి దుర్భర పరిస్థితే కనిపిస్తోందన్న అభిప్రాయానికి ప్రజలు వచ్చే ప్రమాదం ఉంది. ఇప్పటికిప్పుడు అడ్డుకట్ట వేసి.. కనీస రాజకీయ విలువల్ని కాపాడకపోతే.. మొదటికే మోసం వస్తుంది. ప్రజాస్వామ్యానికే చేటు వస్తుంది. అదే జరిగితే అరాచకత్వం మాత్రమే మిగులుతుంది. అధికారం అనుభవించే వాడికి.. ఆ అధికారం ఇచ్చిన ప్రజలకు కూడా మిగిలేదేమీ ఉండదు. అందుకే రాజకీయ పార్టీలు.. తమకు ప్రజా జీవితంలో ఉండే అవకాశం కల్పించిన ప్రజాస్వామ్యాన్ని.. తమకు రక్షణ కల్పిస్తున్న ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటే .. వారికి కూడా రక్షణ లభిస్తుంది. ఎప్పుడైతే ప్రజాస్వామ్యాన్ని బలహీనం చేస్తారో అప్పుడే వారి రక్షణ కూడా బలహీనపడుతుంది. ప్రస్తుతం ఇది ఏపీలో స్పష్టంగా కనబడుతుంది. ఆ ముప్పు ఇటు అధికారపక్షానికి అటు విపక్షానికి కూడా ఉంది. కలసి కట్టుగా ఎదుర్కొని ప్రజాస్వామ్యన్ని రక్షించుకుంటారో.. లేక స్వార్థ ప్రయోజనాలే లక్ష్యం ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడానికే ముందడుగు వేస్తారో ముందు ముందు పరిణామాలతో తేలుతుంది. ఏం జరిగినా.. అందరూ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి.. అదే ప్రజాస్వామ్య రక్షతి రక్షితః !

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చైతన్య : “ఓ వర్గం” సెలబ్రిటీలకే ప్రభుత్వ సాయమా ? మిగతా వాళ్లు, సామాన్యులు మనుషులు కారా ?

సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. ఆయన సినిమా పాటలతో ప్రసిద్ధి పొందారు. సినిమా సహజంగానే గ్లామర్ ఫీల్డ్.. ఆయన పాటలు అన్ని వర్గాలను ఆకట్టుకున్నాయి కాబట్టి స్ఫూర్తి పొందిన వారు.. ప్రేరణ పొందిన వారు...

“సెక్రటేరియట్” ఉద్యోగుల పర్మినెంట్ ఎప్పుడు !?

గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల్ని రెండేళ్ల తర్వాత పర్మినెంట్ చేస్తామని ఏపీ సర్కార్ ప్రకటించి వారిని ఉద్యోగాల్లోకి తీసుకుంది. ఇప్పటి వరకూ వారికి ఎలాంటి ప్రత్యేక భత్యాలు లేకుండా కేవలం రూ. పదిహేను...

బీజేపీ నెత్తిన పాలు పోస్తున్న మమత,కేజ్రీవాల్ !

భారతీయ జనతా పార్టీకి ప్లస్ పాయింట్ విపక్షాలే. కాంగ్రెస్ పార్టీ సొంతంగా గెలిచే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఇతర పార్టీలతో కలిసి మోడీని ఓడించాలి. కానీ ఆ ఇతర పార్టీల్లోని నేతలు తమను...

అఖండ‌ రివ్యూ – మాస్ జాతర

Akhanda telugu review Telugu360 Rating : 3/5 ఓ మాస్ హీరోని ఎలా చూపించాలో బోయ‌పాటి శ్రీ‌నుకి బాగా తెలుసు. ఫ్యాన్స్ కి ఏం కావాలో, ఎలా కావాలో.. ఆ లెక్క‌ల‌న్నీ బాగా బ‌ట్టీ...

HOT NEWS

[X] Close
[X] Close