“ ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉండాలంటే అర్హులైన అందరికీ ఓటు హక్కు ఉండాలి. వారందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. అర్హులైన వారికి ఓట్లు లేకపోయినా.. ఓటు హక్కు ఉన్న వారు పెద్దగా వినియోగించుకోకపోయినా ప్రజాస్వామ్య పునాదులు బలహీనపడతాయి”.
ఇది భారత ప్రజాస్వామ్యానికి మొదటి సూత్రం. ఎందుకంటే మనది మెజార్టీ ప్రజాస్వామ్యం. వంద మంది ఓటర్లలో 51 ఓట్లు వచ్చిన వాళ్లు మాత్రమే గెలవరు. 10 వచ్చిన వాళ్లూ గెలుస్తారు. ఐదుగురు పోటీ చేసి.. యాభై మంది ఓటర్లు ఓట్లు వేయకపోతే.. ఐదుగురిలో ఒకరికి 11, మిగతా నలుగురిలో ముగ్గురికి 10, మరొకరికి 9 వచ్చినా ఆ 11 ఓట్లు వచ్చిన వారే విజేతలవుతారు. అతనికి వ్యతిరేకంగా 39 ఓట్లు వచ్చాయన్నది మన ప్రజాస్వామ్యంలో లెక్కలోకి రాదు. అలాగే యాభై మంది ఓట్లు వేయలేదన్నది లెక్కలోకి రాదు. కానీ ఆ వంద మందికి ఆ 11 ఓట్లు వచ్చిన విజేతనే ప్రజాప్రతినిధి. అతని పాలన కింద పడి ఉండాల్సిందే.
బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణ
ఈ ప్రజాస్వామ్య సూత్రాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని రాజకీయ పార్టీలు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఓటర్ల జాబితానే గందరగోళం చేసి విజయం సాధించాలని ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాయి. ఇటీవలి కాలంలో అవి ఎక్కువ అవుతున్నాయి. నడ మంత్రపు నాయకులు భారత ప్రజాస్వామ్య పునాదుల్ని తక్కువగా అంచనా వేస్తున్నారు . అందుకే ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఓటర్ల జాబితా వివాదాస్పదమవుతోంది. ప్రస్తుతం బీహార్ ఓటర్ల జాబితా అంశం పై జరుగుతున్న రచ్చ ఆ కోవలోదే. బీహార్ లో బీజేపీ కూటమికి అనుకూలంగా ఉండని వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకు SIR ( స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ) పేరుతో పరిశీలన చేస్తున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈసీపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బీహార్ రాజకీయ పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి లెక్క ప్రకారం.. కొన్ని లక్షల ఓట్లను తీసేసి.. ఏయే నియోజకవర్గాల్లో ఎవరెవరు గెలవాలో ఈసీ డిసైడ్ చేస్తోంది. ఇంతోటి దానికి తాము ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయాలని.. బహిష్కరణ ఆలోచన చేస్తున్నామని ఆర్జేడీ యువనేత తేజస్వి ప్రకటించారు. అంత తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ విషయంలో ఈసీ జరుగుతున్న ప్రచారానికి సరైన వివరణలు ఇవ్వడంలో విఫలమవుతోంది. అందుకే అనుమానాలు మరింతగా పెరుగుతున్నాయి.
ప్రత్యేకంగా బీహార్‌లో చేపట్టడం వల్లే విమర్శలు
సాధారణంగా ఓట్ల సవరణ ప్రక్రియకు ఓ షెడ్యూల్ ఉంటుంది. దాని ప్రకారం అంతా జరిగిపోతుంది. బీహార్ లోనూ అదే జరిగింది. కానీ ఈ సారి ఎన్నికల సంఘం బీహార్‌లో అనర్హులైన ఓటర్లు చాలా ఎక్కువగా ఉన్నారని వారిని తొలగించాలని నిర్ణయించింది అందుకే SIR ని ప్రకటించి అమల్లోకి తెచ్చింది. బిహార్‌లో 2025 జూన్ 24 నుండి ఈ SIR ప్రక్రియ ప్రారంభించారు. 2003 తర్వాత ఇదే మొదటి సమగ్ర సవరణ. బీహార్‌లో సరిహద్దు దేశాల నుంచి వచ్చిన ముస్లింలు ఎక్కువగా ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దేశ పౌరులు కాని వారికి ఓటు హక్కు ఎలా ఇస్తామని.. ఎన్నికల సంఘం అంటోంది. దేశ పౌరులో కాదో మీరు ఎలా డిసైడ్ చేస్తారని రాజకీయ పార్టీలు అంటున్నాయి. ఈ సవరణ ప్రక్రియలో 2003 జాబితాలో ఉన్న ఓటర్లు కేవలం వివరాలను ధృవీకరిస్తే సరిపోతుంది. ఎలాంటి ఆధారాలు సమర్పించాల్సిన అవసరం లేదు. కానీ 2003 తర్వాత చేరిన ఓటర్లు పుట్టిన తేదీ, స్థలం, తల్లిదండ్రుల సమాచారం వంటి అదనపు డాక్యుమెంట్లు సమర్పించాలి. కానీ ఆధార్, ఓటర్ ఐడీ, రేషన్ కార్డ్ ను పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఎందుకంటే ఇది పౌరసత్వాన్ని ధృవీకరించవని ఈసీ అంటోంది. ఇప్పటి వరకూ బీహార్‌లో జరిగిన పరిశీలన ప్రకారం మొత్తం బిహార్‌లో ఉన్న 7.89 కోట్ల ఓటర్లలో 52.3 లక్షల మంది ఓటర్లు తమ నమోదిత చిరునామాలో కనిపించలేదు. వీరిలో 18 లక్షల మంది మరణించారని గుర్తించారు. 26 లక్షల మంది శాశ్వతంగా వలస వెళ్లారని, 7.5 లక్షలు డబుల్ ఓటర్లని ఈసీ అధికారులు గుర్తించారు. అంటే ఈ 52.3 లక్షల మంది ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తారన్నమాట.
ఇతర దేశాల నుంచి అక్రమంగా వలస వచ్చిన వారికి ఓట్లు ఉండాలా ?
కానీ బీహార్ విపక్ష పార్టీలు RJD, కాంగ్రెస్, TMC ఈ తొలగింపులు దళితులు, వెనుకబడిన తరగతులు, మైనారిటీల ఓటర్లను లక్ష్యంగా చేసుకున్నాయని ఆరోపిస్తున్నాయి, ఇది రాబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికలలో NDAకు ప్రయోజనం చేకూర్చే కుట్రగా చెబుతున్నాయి. SIR ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని, BLOలు ఓటర్లతో సంప్రదించకుండా ఫారమ్‌లు నింపుతున్నారని, ఫారమ్‌లపై నకిలీ సంతకాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. SIR ప్రక్రియను బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు కేవలం నాలుగు నెలల ముందు ప్రారంభించడం అనుమానాలకు కారణం అయింది. 2003లో దేశవ్యాప్తంగా SIR జరిగింది. కానీ ఇప్పుడు కేవలం బిహార్‌లో మాత్రమే ఎందుకు జరుగుతోందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. విపక్షాలు ఈ ప్రక్రియను “నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (NRC)”ను రహస్యంగా అమలు చేసే ప్రయత్నంగా ఆరోపిస్తున్నాయి . ఈ రోజు అంటే 2025, ఆగస్టు 1న డ్రాఫ్ట్ జాబితా ప్రచురితమవుతుంది. అప్పుడు అసలు రాజకీయం ప్రారంభమవుతుంది. ఇప్పుడు రాజకీయ పార్టీలు టెక్నాలజీని ఉపయోగించుకుంటూ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉంటున్నాయి. గ్రామ స్థాయిలో తమకు ఉన్న నెట్ వర్క్ ద్వారా ఓటర్ల జాబితాలో నకిలీలు ఉన్నారో లేదో గుర్తిస్తున్నారు. అలాగే అర్హులైన వారి ఓట్లు గల్లంతు అయితే వెంటనే వివాదం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీఎల్వోలను సైతం దుర్వినియోగం చేసి పెద్ద ఎత్తున ఓట్లు తొలగించేందుకు కుట్ర చేసింది. దీనిపై ఈసీకి అందిన ఫిర్యాదుతో వెంటనే స్పందించడంతో పెను ముప్పు తప్పింది. లేకపోతే ఏపీలో లక్షల మంది అర్హులైన ఓటర్లు ఓటు హక్కు కోల్పోయేవారు. ఇప్పుడు బీహార్ లో ఓటర్ జాబితా వచ్చిన తర్వాత ఎంత మందిని తీసేశారన్నది లెక్క తెలుస్తుంది. నిజానికి చనిపోయిన వారిని ఓటర్ల జాబితాలో ఉంచడం చట్ట విరుద్ధం. అయితే శాశ్వతంగా వలస వెళ్లిపోయారని.. నమోదు చేసుకున్న అడ్రస్సుల్లో లేరని ఓటర్లను తొలగిస్తే మాత్రం వివాదాస్పదం అవుతుంది. మన దేశంలో ఓటర్లు .. ముఖ్యంగా బీహార్ లో అత్యధిక మంది ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తారు..కానీ ఎన్నికల సమయానికి తమ సొంత ఊరిలోనే ఓటు వేస్తారు. ఉపాధి కోసం ఎక్కడికి వెళ్లినా వారికి శాశ్వత నివాసం తమ సొంత ఊరే అవుతుంది. ఇలాంటి వారిని ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని ఎన్నికల ప్రయత్నిస్తే అది వివాదాస్పదం అవుతుంది.
బెంగాలీ మాట్లాడే బంగ్లా అక్రమ వలసదారులనూ తరిమేయాల్సిందే !
బీహార్‌లో SIR ప్రక్రియ అయితే బెంగాల్ లో నిర్వహించేందుకు ఏర్పాట్లను ఎన్నికల సంఘం పూర్తి చేసే అవకాశం ఉంది. ఎందుకంటే బెంగాల్ లో .. బంగ్లా నుంచి వచ్చిన ముస్లింలు, రోహింగ్యాలు పెద్ద ఎత్తున ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వారంతా సహజంగానే బీజేపీకి వ్యతిరేకులు. గతంలో కమ్యూనిస్టులకు మద్దతు పలికేవారు కానీ ఇప్పుడు వారి బలం తగ్గిపోయింది.. వారిని మమతా బెనర్జీ ఓటు బ్యాంకుగా మార్చుకున్నారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లింలు ఉర్దూ మాట్లాడరు. బంగ్లానే మాట్లాడతారు. అదే మమతా బెనర్జీకి ఆయుధం అయింది. SIR లాంటి ప్రక్రియ బెంగాల్ కు రాకుండా అప్పుడే ఉద్యమం కూడా ప్రారంభించారు. కానీ ఏ రాజకీయ పార్టీ అయినా భారత పౌరులు కాని వారికి తప్పుడు గుర్తింపు పత్రాలు ఇచ్చి.. వారిని భారత ఓటర్లుగా చేయడం ఖచ్చితంగా దేశద్రోహం అవుతుంది. భారత పౌరులు మాత్రమే భారత ప్రభుత్వాన్ని లేదా ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలను ఎన్నుకోవాలి. తమకు మద్దతుగా ఉన్నారని అక్రమ వలసదారుల ఓట్లను లీగలైజ్ చేయాలన్న ప్రయత్నాలు చేయడం, వారి ఓట్లను తొలగించడాన్ని రాజకీయం చేయడం మంచిది కాదు.
రూల్స్ ప్రకారం చేయడం కాదు.. నిజాయితీ కూడా కనిపించాలి !
ఎన్నికల సంఘం అన్ని రూల్స్ ప్రకారం చేస్తే ఇలాంటి వివాదాలు రావు. ఎన్నికల జాబితాను పర్ ఫెక్ట్‌గా నిర్వహించడంతో పాటు పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయడం ఎన్నికల సంఘం బాధ్యత. అలా చేయడమే కాదు.. చేసినట్లుగా కనిపించాలి కూడా. దేశవ్యాప్తంగా SIR నిర్వహిస్తూ.. బీహార్ లోనూ నిర్వహిస్తే ఈ సమస్య వచ్చేది కాదు. కానీ ముందుగానే ఓ షెడ్యూల్ ప్రకటించి.. దాని ప్రకారమే నిర్వహించినా ఎవరూ అనుమానించేవారు కాదు. కానీ ఎన్నికలకు నాలుగు నెలలకు ముందు ఓటర్ల జాబితాను సంస్కరిస్తామని బయలుదేరడం వల్లనే సమస్య వచ్చింది. అనర్హులైన ఓటర్లను ఉంచాలని సుప్రీంకోర్టు కూడా చెప్పదు. అలాగే అర్హులైన ఓటర్లను తొలగించాలని కూడా చెప్పలేదు. అర్హులైన ఒక్క ఓటర్ పేరు ఓటర్ల జాబితాలో లేకపోతే అది ఖచ్చితంగా ఎన్నికల సంఘం వైఫల్యమే అవుతుంది. దేశంలో అత్యంత వెనుకబడిన రాష్ట్రం బీహార్. అక్కడ గుర్తింపు కార్డులు, ఇతర గుర్తింపులు చూపించుకోవడం సమస్య అవుతుంది. అంత మాత్రాన వారిని దేశ పౌరులు కాదని చెప్పడం దారుణం అవుతుంది. బీహార్ లో జరుగుతున్న SIR ఇవాళ కాకపోతే రేపైనా దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిందే. అయితే సరిహద్దు రాష్ట్రాల్లోనే ఎక్కువగా సమస్య వస్తుంది. ఇప్పటికే ఆధార్ తో అనుసంధానమైన ఓటర్ల జాబితా ద్వారా.. డబుల్ ఓటర్లు, దొంగ ఓటర్లను గుర్తిస్తున్నారు. ఆధార్ డేటా బేస్ లో లేని నెంబర్లను.. డబుల్ ఎంట్రీలను ఇట్టే కనిపెట్టేస్తున్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు డబుల్ ఓటర్ల సంఖ్య బాగా తగ్గింది. ఇటీవల ఎన్నికల సంఘం SIR ప్రక్రియపై అన్ని పార్టీల అభిప్రాయాలను తెలుసుకుంది. టీడీపీ, వైసీపీసహా అన్ని పార్టీలు ఓటర్ల జాబితాలో లోటు పాట్లు ఉండకూడదని.. స్పష్టం చేశాయి. కేవలం గుర్తింపు పత్రాలు లేవన్న కారణంగా ఓటర్ల జాబితా నుంచి తొలగించకూడదని.. నిశిత పరిశీలన జరగాలని స్పష్టం చేశాయి.
భారత ప్రజాస్వామ్యం నమ్మకం అనే పునాదుల మీద ఆధారపడి ఉంది. ఎన్నికల ప్రక్రియలో ప్రతి అంశంలో ప్రజలకు స్పష్టత ఉండాలి. ఏం జరుగుతుందో తెలియాలి.
ఎన్నికల ప్రక్రియ సరిగ్గా జరగలేదు.. ఎన్నికల ఫలితాలపై అనుమానాలు వస్తున్నాయి అనుకునే పరిస్థితి వస్తే ఈసీ విఫలమయినట్లే. ఓడిపోయిన రాజకీయ పార్టీలు తమ ఓటమికి ఈసీని, ఓటర్లు జాబితాను, ఈవీఎంలను నిందించడం సహజం. కానీ సామాన్య ప్రజల్లో మాత్రం అలాంటి భావనలు రాకూడదు. దానికి సమగ్రమైన ఓటర్ల జాబితా, అర్హులైన అందరికీ ఓటు హక్కు, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ నిర్వహణ కీలకం. అన్నీ సరిగ్గా చేస్తే SIR కరెక్టే. కానీ కరెక్టే చేస్తున్నామని ప్రజలకు అనిపించేలా చేయడం కూడా ఎన్నికల సంఘం విధుల్లో ఒకటి.