రివ్యూ: ఇగో.. గోల గోల‌

Ego telugu movie sameeksha, Ego Review

తెలుగు360.కామ్ రేటింగ్ : 1.5/5

‘నువ్వు నాకు న‌చ్చావ్’ గుర్తుందా?

అందులో బ్ర‌హ్మానందం జ‌యింట్ వీల్ ఎక్కుతాడు. ముందు ధైర్యంగానే కూర్చున్నా… ఆ త‌ర‌వాత‌ ‘ఆపండ్రా బాబోయ్‌… ‘ అంటూ అరిచి గోల పెడ‌తాడు.కొన్ని సినిమాలూ అంతే. సీట్లో కూర్చున్న ప‌ది నిమిషాలకే.. చేతిలోకి సెల్‌ఫోన్ వ‌చ్చేస్తుంది. పావుగంట‌కు నిద్రొస్తుంది. ఇర‌వై నిమిషాల‌కు మ‌ళ్లీ ఉలిక్కిప‌డి లేచి, విశ్రాంతి కార్డు కోసం.. అవురావురుమంటూ ఎదురు చూడాల్సివ‌స్తుంది. ఆ త‌ర‌వాత `ఆపండ్రా బాబోయ్‌` అంటూ గ‌ట్టిగా అర‌వాల‌నిపిస్తుంది. శుభం కార్డు చూడ‌కుండానే పారిపోవాల‌నిపిస్తుంది. స‌రిగ్గా ఇలాంటి ల‌క్ష‌ణాలున్న సిపిమా.. ‘ఇగో’.

క‌థ‌

అది అమ‌లాపురం. త‌ర‌త‌రాలుగా ‘ఇగో’ల్ని పెంచి పోషించుకుంటుంటాయి రెండు కుటుంబాలు. వాళ్ల వార‌సులు ఇందు (సిమ్ర‌న్‌) గోపి (ఆశిష్ రాజ్) కూడా… ఇగో ప్రియులే. ఒక‌రంటే ఒక‌రికి ప‌డ‌దు. ఒక‌రిపై ఒక‌రు పై చేయి సాధించుకోవాల‌ని చూస్తుంటారు. ఇందుకి పెళ్లి సంబంధాలు వ‌స్తుంటాయి. `నీ కంటే అంద‌గ‌త్తెని పెళ్లి చేసుకుంటా. చూడు` అని బెట్టు క‌ట్టి… అమ్మాయిల కోసం హైద‌రాబాద్ వ‌స్తాడు గోపి. ఇక్క‌డికి వ‌చ్చిన త‌ర‌వాతే.. త‌న‌కి ఇందుపై ఇగో లేద‌ని, అదంతా ప్రేమే అని అర్థం అవుతుంది. తీరా అమ‌లాపురం బ‌య‌లుదేరే స‌మ‌యానికి ఓ హ‌త్య కేసులో ఇరుక్కుంటాడు గోపీ. అందులోంచి తాను ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడు? ఆ త‌ర‌వాత ఏం జ‌రిగింద‌న్న‌ది క‌థ‌.

విశ్లేష‌ణ‌

‘క‌థేంటో చెప్పు’ అని నిర్మాత‌లు అడిగేస‌రికి… ద‌ర్శ‌కుడి ‘ఈగో’ హ‌ర్ట‌యి ఉంటుంది. అందుకే.. త‌న‌కు తోచింది, న‌చ్చింది… తీసేసుకుంటూ వెళ్లాడు. క‌థ జోలికి ఏమాత్రం వెళ్ల‌కుండా.

‘వ‌న్ మోర్ ప్లీజ్‌’ అని ద‌ర్శ‌కుడు అడిగితే హీరోకి, హీరోయిన్‌కీ ఈగో హ‌ర్ట్ అయి ఉంటుంది. అందుకే.. త‌మ కొచ్చింది మాత్ర‌మే చేసి.. ప‌క్క‌కు వెళ్లిపోయారు.
‘ఇన్ని పాట‌లు వ‌ద్దు’ అని అంటే…. సంగీత ద‌ర్శ‌కుడి `ఇగో` హ‌ర్ట‌యి ఉంటుంది. అందుకే… త‌న ద‌గ్గ‌రున్న పాట‌ల‌న్నీ ఇచ్చేశాడు. అది టైమింగూ పాడూ లేకుండా తెర‌పైకి వ‌చ్చేశాయి.

సినిమా మొద‌లైన పావుగంట‌కే `ద‌ర్శ‌కుడు కాల‌క్షేపం చేయ‌డానికి నానా పాట్లూ ప‌డుతున్నాడు` అనే సంగ‌తి అర్థ‌మైపోతుంది. దానికి కార‌ణం.. సైడ్ క్యారెక్ట‌ర్‌గా ఉండాల్సిన ఫృథ్వీ… హీరోని సైడ్ చేసేసి హీరోయిజం చూపించేస్తుంటాడు. ఆ ఎపిసోడ్లకీ క‌థ‌కీ సంబంధం ఉండ‌దు. జ‌స్ట్ టైమ్ పాస్ అంతే! ఓ ద‌శ‌లో ఈ సినిమాలో హీరో ఫృథ్వీనా, ఆశిష్ రాజా అనిపిస్తుంది. పోనీ… ఫృథ్వీ ఏమైనా అద్భుతాలు చేశాడా అంటే అదీ లేదు. ‘పూత‌రేకు’ అనే డైలాగుని మార్చి మార్చి చెప్పి.. పూత రేకు అన‌గానే ‘చేదు’ జ్ఞాప‌కాలు గుర్తొచ్చేలా చేశాడు.

ద్వితీయార్థంలో ష‌క‌ల‌క శంక‌ర్‌, చ‌మ‌క్క్ చంద్ర‌ల ఎపిసోడూ అంతే. చూసిన సీనే మ‌ళ్లీ మ‌ళ్లీ చూసిన‌ట్టు అనిపిస్తుంది. క‌థ‌కు కీల‌కం.. మ‌ర్డ‌ర్ ఎపిసోడ్. దాన్ని ప్రీ క్లైమాక్స్ ముందు వాడుకున్నాడు. దాన్ని కాస్త ఇంట్ర‌వెల్ బ్యాంగ్‌కి తీసుకొచ్చుంటే క‌నీసం క‌థ‌, క‌థ‌నాల‌పై కాస్త‌యినా ఆస‌క్తి రేకెత్తేది. ప‌ల్లెటూరులో ర‌క‌ర‌కాల పాత్ర‌ల్ని చూపించాడు ద‌ర్శ‌కుడు. వాళ్ల ఎంట్రీ బాగానే ఉంది. కానీ… ఏ పాత్ర ఎందుకు వ‌స్తుందో? ఎందుకంత న‌స పెడుతుందో అర్థం కాదు. డ్ర‌గ్స్ మాఫియా కూడా క‌థ‌లో ఇరికించిన విష‌య‌మే. అది కూడా లేక‌పోతే… ‘ఇగో’ మ‌రీ స‌గ‌టు సినిమాగా త‌యార‌య్యేదేమో.

న‌టీన‌టులు

ఆశిష్ రాజ్ ఈ సినిమాకి హీరో. ఓ విధంగా తెర వెనుక నిర్మాత‌. త‌న పాట్లేవో తాను ప‌డ్డాడు. చ‌లాకీగా న‌టించాల‌ని న‌టించ‌కూడ‌దు. ఆ చురుకుద‌నం పాత్ర‌లో ఉండాలి. అది లేక‌పోవ‌డం వ‌ల్ల‌.. ఆశిష్ రాజ్‌లోని పూర్తి ఎన‌ర్జీ బ‌య‌ట‌కు రాలేదేమో. సిమ్రాన్‌.. త‌న వెనుక ఉన్న జూనియ‌ర్ ఆర్టిస్టుల కంటే కాస్త బెట‌రంతే. హీరోయిన్ అంటే మాత్రం మ‌నం ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. ఈ సినిమాని కాస్తో కూస్తో చూడ‌గ‌లిగాం అంటే అదంతా ఫృథ్వీ చ‌ల‌వే. పోసాని కూడా బోర్ కొట్టించేశాడు. రావు ర‌మేష్‌, అజ‌య్‌… ఇలా పేరున్న న‌టులున్నా… వాళ్ల నుంచి ఆశించ‌ద‌గిందేం ఉండదు.

సాంకేతిక వ‌ర్గం

సినిమాని వీలైనంత క‌ల‌ర్‌ఫుల్‌గా తీద్దామ‌నుకున్నారు. ఆ ప్ర‌య‌త్నం న‌చ్చుతుంది. ప‌ల్లెటూరి అందాల్ని పూర్తిగా చూపించ‌లేక‌పోయారు. పాట‌లు బాగానే ఉన్నా.. టైమింగ్ తేడా కొట్టింది. సుబ్బు ద‌ర్శ‌కుడి కంటే రచ‌యిత‌గా ఆక‌ట్టుకుంటాడు. అక్క‌డ‌క్క‌డ త‌న పంచ్‌లు పేలాయి. కాక‌పోతే.. మ‌రీ ప్రాస‌లు ఎక్కువ‌య్యాయి. ఈ సినిమాకి ముగ్గురు నిర్మాత‌లు. ముగ్గురికీ తలో పాత్ర ద‌క్కింది. అవి చూసి సంతోష‌ప‌డిపోవ‌డ‌మే.

తీర్పు

ప‌ల్లెటూరి స‌ర‌దాలు, అల్ల‌ర్లు, వాళ్ల మ‌ధ్య‌వెట‌కారాలు చూపించే ఛాన్స్ ఉన్న క‌థ ఇది. కానీ ద‌ర్శకుడు స‌రిగా వాడుకోలేదు. అత‌నిలో టాలెంట్ ఉన్నా… ఈ క‌థ‌లో అది ఎలివేట్ అవ్వ‌లేదు.

ఫైన‌ల్ పంచ్‌: చ‌ప్ప‌డి ‘పూత‌రేకు’

తెలుగు360.కామ్ రేటింగ్ : 1.5/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com