బ్లాక్ & వైట్ సమస్య… టాలీవుడ్ ని కుదిపేడయం మొదలెట్టింది. చిత్రీకరణలు మందకొడిగా సాగుతున్నాయి. కొత్త సినిమా మొదలెట్టడానికి నిర్మాతలు జంకుతున్నారు. రిలీజ్లు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో నిఖిల్ సినిమా ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమా ధైర్యం చేసి శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే ఆఖరి నిమిషాల్లో ఈసినిమాకి టెన్షన్ పట్టుకొంది. రేపు సినిమా రిలీజ్ అనగానే ఈ రోజు బయ్యర్లు క్యాష్ సర్దుబాటు చేస్తుంటారు. ఈ సంప్రదాయం ఎప్పటి నుంచో సాగుతోంది. ఈ సినిమాకీ అంతే. అయితే.. ఇక్కడే ‘పెద్ద నోట్ల రద్దు’ ప్రభావం ఈ సినిమాపై పడింది. ఈ సినిమా కొన్న బయ్యర్లు ఇప్పుడు ‘పాత’ నోట్లు తీసుకొచ్చి లెక్క సర్దడానికి చూస్తున్నారట. ‘పాత నోట్లు వద్దు.. నాకు కొత్తవే కావాలి’ అని నిర్మాత అడుగుతున్నాడట. దాంతో అటు బయ్యర్లకూ, ఇటు ప్రొడ్యూసర్కీ పెద్ద చర్చ నడుస్తోంది. ఈ చర్చలు సఫలమవుతాయా? ఇద్దరూ ఓ రాజీకి వస్తారా, లేదా? అనే టెన్షన్ పట్టుకొంది.
నిజానికి ఈనెల 18న ఈ సినిమారావడం పెద్ద సాహసమే. నిర్మాతకు ప్రస్తుతం ఉన్న పరిస్థితి తెలుసు. పది వేలు, ఇరవై వేలు దొరకడం కష్టమైపోతోంది. ఈ దశలో లక్షలు, కోట్లూ ‘వైట్’ దక్కాలంటే మాటలా?? అయినా సరే, నిర్మాత ధైర్యం చేసి ఈ సినిమాని విడుదల చేయడానికి ముందుకొచ్చాడు. బయ్యర్లకు మాత్రం పూర్తిగా వైట్ ఎక్కడ దొరుకుతుంది. వాళ్లిప్పుడు రద్దయిన పాత నోట్లతో ఈ సినిమా కొనేద్దామని వచ్చారు. అక్కడే నిర్మాతకూ, బయ్యర్లకూ బేరం తెగడం లేదని టాక్. అర్థరాత్రి వరకూ ఈ చర్చ కొనసాగే అవకాశం ఉంది. మరి ఈ గొడవలో పడిన ఈ సినిమా రేపు విడుదల అవుతుందా, లేదంటే వెనక్కి వెళ్తుందా అనేది సందేహంగా మారింది. ఎక్కడికిపోతావు చిన్నవాడా వాయిదా పడకుండా అనుకొన్న సమయానికి ముందుకు రావాలంటే.. ఇద్దరిలో ఎవరో ఒకరు వెనక్కి తగ్గక తప్పదు.