రాహుల్ గాంధీ తమనే టార్గెట్ చేసుకుని నిందలు వేస్తూండటంతో ఎన్నికల సంఘం కూడా ఎదురుదాడి చేయాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. రాహుల్ గాంధీ చేస్తున్నవన్నీ అవాస్తవ ఆరోపణలేనని ప్రజల్ని గందరగోళానికి గురి చేసి, ఎన్నికల వ్యవస్థపై అపనమ్మకం కలిగేలా చేయడానికి ఇలాంటి రాజకీయం చేస్తున్నారని వాదించడానికి రెడీ అయింది. ఆదివారం సాయంత్రం ప్రెస్మీట్ పెట్టనున్నట్లుగా సమాచారం ఇచ్చింది.
అదే సమయంలో రాహుల్ గాంధీ కూడా వోట్ చోరీ యాత్రకు రెడీ అయ్యారు. బీహార్ నుంచే ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నారు. పెద్ద ఎత్తున ఓట్లు గల్లంతు అయ్యాయని ఆయన ఆరోపణలు చేస్తున్నారు. ఈ యాత్రను రాహుల్ తో పాటు కాంగ్రెస్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఓటర్ల జాబితాలో ఓట్ల చోరీ అనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి .. ఓటర్ల జాబితాలో గోల్ మాల్ వల్లే తాము ఓడిపోతున్నామని అనిపించుకోవాలని లేకపోతే గెలిచేవాళ్లమని భావించేలా చేయాలని అనుకుంటున్నారు.
రాహుల్ గాంధీ తాను బయట పెట్టిన అవకతవకలను నిజమని .. అఫిడవిట్ ఇచ్చేందుకు సిద్ధంగా లేరు. తన ఆరోపణలు తాను చేసి తాను రాజకీయం చేస్తున్నారు. ఆయన ఇప్పుడు బీజేపీనే ప్రత్యర్థిగా చేసుకున్నారు. తమ విశ్వసనీయతను కాపాడుకోవడానికి అయినా ఈసీ రాజకీయ పార్టీకి ఎదురునిలబడక తప్పని పరిస్థితి ఏర్పడింది. బీహార్ అసెంబ్లీకి షెడ్యూల్ విడుదల చేయాల్సిన సమయంలో చేస్తున్న ఈ రచ్చ కాంగ్రెస్ కు మేలు చేస్తుందో..కీడు చేస్తుందో అంచనా వేయడం కష్టంగా మారింది.