ఎమ్మార్ సంస్థ మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ఆసక్తి చూపిస్తోంది. ఈ సంస్థ దుబాయ్ డౌన్‌టౌన్, బుర్జ్ ఖలీఫాను నిర్మించిన ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్ . ఈ సంస్థ తాజాగా హైదరాబాద్‌లో మూసి నది తీరంలో భారీ టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించింది. రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ సమీపంలో సుమారు వందల ఎకరాల్లో విస్తరించే ఈ ప్రాజెక్టును ప్లాన్ చేస్తోంది. అనుమతి లభిస్తే హైదరాబాద్ నగర స్కైలైన్‌ను పూర్తిగా మార్చివేసే అవకాశం ఉంది.
మూసి నది తీరంలో, రాజేంద్రనగర్ ORR ఎగ్జిట్ సమీపంలో వందల ఎకరాల్లో ఈ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ రూపొందనుంది. ఇందులో రెసిడెన్షియల్, కమర్షియల్ , మిక్స్డ్-యూజ్ డెవలప్మెంట్లు ఉంటాయి. ఇది ఇంకా ప్రతిపాదన దశలోనే ఉంది. అధికారిక అనుమతులు రావాల్సి ఉంది. ఐదారు నెలల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎమ్మార్ గ్రూప్ ఇటీవల నిర్వహించిన ‘ఫ్యూచర్ సిటీ’ ఈవెంట్లో స్టాల్ ఏర్పాటు చేసి, ప్రాథమిక కాన్సెప్ట్ డిజైన్లు , విజువల్స్‌ను ప్రదర్శించింది.
ఎమ్మార్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (HICC) , నోవోటెల్ హోటల్లలో వాటాదారు. గచ్చిబౌలిలోని ఎమ్మార్ బౌల్డర్ హిల్స్ ప్రాజెక్టు ఈ కంపెనీదే. అయితే, భాగస్వామ్య సంస్థ MGFతో వివాదాలు , కేసుల కారణంగా ఈ ప్రాజెక్టు ఏళ్లుగా నిలిచిపోయింది. ఇటీవలి పరిణామాలతో ఈ సమస్యలు పరిష్కారానికి దగ్గరయ్యాయని, బౌల్డర్ హిల్స్ కూడా త్వరలో పునఃప్రారంభమయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
రియల్ ఎస్టేట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ ప్రాజెక్టు హైదరాబాద్‌లో అతిపెద్ద ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్లలో ఒకటిగా మారవచ్చు.
