‘ఓజీ’తో టాలీవుడ్ లోకి అడుగుపెట్టబోతున్నాడు ఇమ్రాన్ హష్మీ. బాలీవుడ్ లో రొమాంటిక్ హీరోగా హష్మీకి తగిన గుర్తింపు ఉంది. అయితే.. ఈసారి తెలుగులో విలన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇమ్రాన్ హష్మీని ప్రతినాయకుడిగా చూపించాలనుకోవడం మంచి ఆలోచన. తన లుక్స్, స్టైల్ బాగుంటాయి. కాకపోతే.. బాలీవుడ్ నుంచి ఎంతమంది నటుల్ని విలన్ పాత్రలుగా దిగుమతి చేసుకొన్నా – పెద్దగా ప్రయోజనం లేకుండా పోతోంది. వాళ్ల పాత్రని సరిగా డిజైన్ చేయలేకపోతున్నారు. వాళ్ల స్వాగ్ ని, క్రేజ్‌నీ వాడుకోలేకపోతున్నారు. బాబీ డియోల్ ది అదే పరిస్థితి. బాబీ ని ‘డాకు మహారాజ్’, ‘హరి హర వీరమల్లు’ సినిమాల్లో విలన్ గా చూపించారు. కానీ తన కటౌట్‌ని సరిగా హ్యాండిల్ చేయలేకపోయారు.
ఓజీ లేటెస్ట్ గ్లింప్స్ లో ఇమ్రాన్ హష్మీని ఓమీగా పరిచయం చేశారు. తన లుక్, గ్రేస్ బాగున్నాయి. తన పాత్రని చాలా స్టైలీష్‌గా డిజైన్ చేసినట్టు కనిపిస్తోంది. అన్నింటికంటే ముఖ్యంగా పవన్ కల్యాణ్ పాత్రకు ధీటుగా తన క్యారెక్టరైజేషన్ ఉండబోతోందని అర్థమైంది. విలన్ పాత్ర ఎంత బలంగా ఉంటే.. హీరో క్యారెక్టర్ అంత గొప్పగా పండుతుంది. ఈ సూత్రం తెలిసినవాళ్లు ప్రతినాయక పాత్రల్ని స్ట్రాంగ్ గా డిజైన్ చేయగలుగుతారు. సుజిత్ కూడా అదే చేస్తే.. ఓజీకి ఇక తిరుగులేదు. దాంతో పాటు సౌత్ ఇండియన్ స్క్రీన్‌కి ఓ మంచి విలన్ దొరికినట్టు అవుతుంది. ఓజీ కోసం ఇమ్రాన్‌కు భారీ పారితోషికమే చెల్లించారని టాక్. దానికి ఇమ్రాన్ కూడా తగిన న్యాయం చేసినట్టు అనిపిస్తోంది. చూద్దాం.. ఓజీకి ఓమి ఎంత వరకూ పోటీ ఇవ్వగలడో?!