ఈటల రాజేందర్ పద్దతైన రాజకీయ నాయకుడు. “కొడకా” అని విమర్శలు చేస్తారు కానీ.. “ నా కొడకా “ అనేంతగా ఉద్యమ సమయంలోనూ మాటలు జారలేదు. ఇప్పుడు మాత్రం ఆయన పూర్తిగా కంట్రోల్ తప్పిపోయారు. నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైనే అలాంటి భాష వాడుతున్నారు. వాటితో పాటు ఇంకా అభ్యంతరకమైన పదాలు చాలా వాడారు. రాజకీయంగా విమర్శించడానికి.. తిట్లడానికి తేడా ఉంది. ఈటల రాజేందర్ తిట్టడానికే ప్రాధాన్యతనిస్తున్నారు. ఇది ఆయన ఇమేజ్ కే భిన్నం. అందుకే.. ఈటలకే ఎదో గట్టి దెబ్బతగిలిందని అందుకే ఫ్రస్ట్రేషన్ కు గురవుతున్నారని అంటున్నారు.
ఈటల రాజేందర్ అవసరం అయిన పని చేయడానికి రేవంత్ రెడ్డి నిరాకరించి అయినా ఉండాలి లేదా.. రేవంత్ రెడ్డిపై తానే గట్టిగా పోరాడుతున్నానన్న సంకేతాలను ఢిల్లీకి పంపడానికి ఇంత కంటే మంచి దారి లేదని అనుకుని అయినా ఉండాలని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. బీజేపీ అధ్యక్ష పదవి కోసం ఈటల రాజేందర్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మొదట్లో ఆయనే ఆప్షన్ అనుకున్నారు కానీ ఇప్పుడు ఆయన పేరు వినిపించడం లేదు. ఆ అంశంపై ఆయనకు స్పష్టత వచ్చిందేమో కానీ తన ఉనికిని బలంగా చాటాలని అనుకుంటున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. కాంగ్రెస్ నేతలంతా ఇదే చెబుతున్నారు.
తెలంగాణ బీజేపీ అంతర్గత రాజకీయాల గురించి చెప్పాల్సిన పని లేదు. కొత్త నేతలు..పాత నేతల మధ్య అంతర్గత పోరాటం జరుగుతోంది. అందులోనూ మళ్లీ పాత నేతల మధ్య వర్గ పోరాటం ఉంది. కొత్త నేతల మధ్య సయోధ్య ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈటల రాజేందర్ కు మద్దతుగా ఉండేవారు లేరు. ఆయనకు అధ్యక్ష పదవి ఇస్తే సహకరించేవారు అంటూ ఉండరు. అందుకే హైకమాండ్ ఆయన పేరును దూరంగా పెట్టిందని చెబుతున్నారు. ఈ ఫ్రస్ట్రేషన్ ఈటలలో పెరిగిపోయిందని బీజేపీ నేతలు కూడా అంటున్నారు.
ఈటల రాజేందర్ చేసిన విమర్శలకు.. బీజేపీ నేతలు కూడా ఎవరూ సమర్థించే పరిస్థితి లేదు. చివరికి బీఆర్ఎస్ నుంచీ సపోర్టు రాదు. ఇవన్నీ తెలియనిది కాదు. అయినా ఆయన ఎందుకు ఇలా గీత దాటి విమర్శలు చేస్తున్నారో మరి !